కుభీర్, జూలై 27 : మండలంలోని చాత, హల్ద, రంగశివుని, పల్సి తదితర గ్రామాల్లో వరినాట్లు ప్రారంభమయ్యాయి. ఆయా గ్రామాల్లో సుమారు 150 ఎకరాల్లో మాత్రమే వరి సాగవుతున్నది. ఈ ప్రాంత రైతులు పాత పద్ధతులను అవలంబిస్తుండడంతో దిగుబడులు తగ్గిపోతున్నాయి. దీంతోపాటు వరి సాగు చేసే రైతుల సంఖ్య కూడా యేటా తగ్గుతున్నది. ఈ తరుణంలో వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టారు. కాలిబాటల పద్ధతిలో సాగును ప్రోత్సహిస్తున్నారు. బుధవారం మండలంలోని రంగశివుని గ్రామానికి చెందిన సురేశ్ పటేల్ పొలంలో ప్రయోగాత్మకంగా ఈ పద్ధతిలో నాటు వేయించారు. నాటు తీరు, ప్రయోజనాలు, దిగుబడుల గురించి ఏఈవో హరీశ్ రైతులకు వివరించారు. నాటువేసే విధానాన్ని ప్రత్యక్షంగా రైతులకు చూపించారు. రెండు, మూడు మీటర్లు నాటు వేసి, 20 నుంచి 30 సెంటీమీటర్ల బాట విడిచి పెట్టాలని సూచించారు. దీన్నే కాలిబాటల పద్ధతి అంటారని తెలిపారు. తూర్పు-పడమర దిశలకు మాత్రమే ఈ పద్ధతిలో నాటు వేయాలని సూచించారు. దీని ద్వారా సూర్యరశ్మి పుష్కలంగా అందుతుందని తెలిపారు. తద్వారా చీడపీడల ఉధృతి తగ్గి, దిగుబడులు అధికంగా ఉంటాయని వివరించారు. అలాగే ఎరువులు, రసాయనాల పిచికారీకి అనువుగా ఉంటుందని పేర్కొన్నారు.