భాషాభివృద్ధికి పలువురి కృషి
భాషా, యాసలను కాపాడుకోవడం ఓ బాధ్యత
నేడు ప్రపంచ మాతృభాష దినోత్సవం
భైంసా, ఫిబ్రవరి, 20 : మన భాష, యాస మనం మాట్లాడే మాటల్లో వ్యక్తమవుతుంది. కానీ రానురాను మాతృభాషపై పట్టు కోల్పోతున్నాం. ప్రస్తుతం ఇంగ్లిష్ మాట్లాడే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది. పాఠశాలల్లో సైతం ఇంగ్లిష్ మీడియం అవశ్యమైంది. ఎంత నేర్చుకున్నా మాతృభాషపై పట్టు వీడకూడదని పలువురు భాషా నిపుణులు సూచిస్తున్నారు. నేడు ప్రపంచ మాతృభాష దినోత్సవం. ఈ సందర్భంగా భైంసాలో తెలుగు భాషాభివృద్ధికి పలువురు కృషి చేస్తున్నారు. వారిపై ప్రత్యేక కథనం..
తేనెలేను లోగిల్లలో వికాస తరంగం నిత్యం సాహిత్య పూదోటగా వికాసానికి తోడ్పడుతున్న మాగాణి, సాహిత్య సంపదకు నిలయమైన నిర్మల్ జిల్లాలో అనేక సంఘాలు, సాహితీ సంస్థలు ముందుంటున్నాయి. ముఖ్యంగా భైంసాలో రచయితల సంఘం, తెలంగాణ కవుల సంఘం, తదితర సంఘాలు, సంస్థలు తమవంతు కృషి చేస్తున్నాయి. ఈ సంస్థలు కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కరణలు, సమావేశాలు, సాహిత్యగోష్టిలతో తెలుగు వెలుగులు నిం పుతున్నాయి. భైంసా పట్టణంలో కవిత, పద్యం, గేయాలు, వ్యాసాలు, తదితర ప్రక్రియల్లో తమదైన శైలిలో రచనలు చే యడంతో పాటు పుస్తకాలు ముద్రిస్తూ జిల్లాలో ప్రత్యేకతను సంతరించుకున్నారు. ఇందులో భాగంగా పుండలిక్ రావు పూలబాట శతకం, పాండురంగ శతకం, గజ్జల మ్మ శతకం, నిజదర్పణం, చిరు పవనాలు రచించారు. మరో కవి కడారి దశరథ్ కడా రి శతకం, కైతిక క్షేత్రం, కడారి పద్య ఝరి పుస్తకాలు రచించారు. అక్షరబద్ధమైన రచనలతో చైతన్యం నింపుతున్నారు. బాలల తో సైతం రచనలు చేయిస్తూ బాల కవులను తయారు చేస్తున్నారు. మాతృభాష పరిమళాలు భైంసా ఒడిలో ఓలలాడుతూ పలు భాషల ప్రక్రియలపై అవగాహన తెచ్చేందుకు కృషి చేస్తున్న రచయితల స్ఫూర్తి అభినందనీయం.
ఇతర భాషలపై అంత పట్టు ఉండదు
ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాష మీద ఉన్న ప్రావీణ్యం ఎందులో ఉండదు. మాతృభాషపై ఉన్న పట్టు ఇతర భాషలపై ఉండదు. జిల్లాలోనే భైంసాకు ప్రత్యేక స్థానం ఉంది. అన్ని రంగాల్లో ముందున్న భైంసా మాతృభాష అభివృద్ధిలోనూ ముందుంటుంది. జిల్లాలో అనేక సంఘాలు, సంస్థలు తెలుగు భాష అభివృద్ధికి కృషి చేస్తున్నాయి.
– పుండలిక్ రావు, కవి