బజార్హత్నూర్ ఎంపీపీ జయశ్రీ
సాదాసీదాగా మండల సర్వసభ్య సమావేశం
బజార్హత్నూర్, ఫిబ్రవరి 12: గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని ఎంపీపీ అజిడే జయశ్రీ సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన శనివారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా ముగిసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయాలని సూచించారు. గత సమావేశాల్లో తీర్మానం చేసిన పనుల స్థితిగతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని పశువైద్యాశాలలో మందుల కొరత తీవ్రంగా ఉందని పశువైద్యాధికారి పర్వేజ్ హైమాద్ సభ దృష్టికి తీసుకువచ్చారు. యాసంగిలో వేసిన పంటల వివరాలను మండల వ్యవసాయధికారి ప్రమోద్‌రెడ్డి తెలియజేశారు. రానున్న వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా గ్రామాలకు మిషన్ భగీరథ నీరు అందేలా చూడాలని ఎంపీపీ సంబంధిత అధికారులకు సూచించారు. పలు శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. కార్యక్రమంలో తహసీల్దార్ గంగాధర్, ఇన్చార్జి ఎంపీడీవో మహేందర్‌రెడ్డి, జడ్పీటీసీ నర్సయ్య, పీఆర్ఏఈ నారాయణ, అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.