ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో కురిసిన వర్షానికి పంట ఉత్పత్తులు తడిసి ముద్దయ్యాయి. జైనథ్, భోరజ్, బేల మండలాల్లో భారీ వర్షం పడింది. చేలు, రహదారులు, మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన వరి, మక్క, సోయాను ప్లాస్టిక్ కవర్లు కప్పి కాపాడుకునేందుకు రైతులు ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ పంట ఉత్పత్తులు తడిశాయి. ఇదంతా కూడా జిల్లాలో కొనుగోళ్లు ప్రారంభించకపో వడంతో నష్టపోవాల్సి వస్తున్నది. ఇప్పటి వరకు కూడా సోయా కొనుగోళ్లు ఆరంభం కాలేదు. పంట చేతికొచ్చి 25 రోజులు గడచినా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఈ ఏడాది 62 వేల ఎకరాల్లో సోయా సాగు కాగా.. క్వింటాలుకు మద్దతు ధర రూ.5328 ప్రకటించింది. గతంలో కురిసిన వర్షాల కారణంగా దిగుబడులు సగానికి పడిపోగా.. మిగిలిన పంటను మద్దతు ధరతో మార్కెట్ యార్డుల్లో విక్రయించుకుందామనుంటే నిరాశే మిగులుతున్నది. కాగా.. జిల్లాలో వానకాలంలో రైతులు పత్తి తర్వాత అధికంగా సోయా పండిస్తారు. యేటా అక్టోబర్ మొదటి వారంలో సోయా కొనుగోళ్లు ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం మాత్రం అక్టోబర్ చివరివారం వరకు పంట సేకరణ ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట ఉత్పత్తులను త్వరగా కొనుగోలు చేయాలని రైతులు
– ఆదిలాబాద్, అక్టోబర్ 25(నమస్తే తెలంగాణ)
నార్నూర్, అక్టోబర్ 25 : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలాల్లో శనివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో అరబెట్టిన మక్క, సోయా పంట ఉత్పత్తులు తడిశాయి. పత్తి పంట చేతికొచ్చే దశలో పత్తిపంటకు తీవ్ర నష్టం వాటిల్లితుందని రైతులు చర్చించుకుంటున్నారు. ఈ యేడాది వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లితుందని వాపోతున్నారు.
ఖానాపూర్, అక్టోబర్ 25 : నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. వారం రోజుల క్రితం తర్లపాడు, పాత తర్లపాడు, ఖానాపూర్ గ్రామాల రైతులు ధాన్యాన్ని ఖానాపూర్ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు. అధికారులు, సెంటర్ నిర్వాహకులు కొనుగోలు చేయకపోవడంతో తడిసిపోయాయి. ఈ సందర్భంగా తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా తూకం చేయాలని రైతులు మహేశ్, నర్సయ్య, గంగవ్వ డిమాండ్ చేశారు.
బేల, అక్టోబర్ 25 : ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో మారెట్కు తీసుకొచ్చిన సోయా తడిచింది. రైతులు పంట ఉత్పత్తులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతులు వేడుకుంటున్నారు.
ఇచ్చోడ, అక్టోబర్ 25 : శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(బీ)లో సోయా, ఇంట్లో నిల్వ ఉంచిన పత్తి తడిచి ముద్దయ్యాయి. సిరికొండ మండలకేంద్రంలో వరి పైరు గాలివానకు నేలకొరిగింది.