ఉల్లాస కల్లోల ఉన్మాద కామంతో నువ్వు
యవ్వనాకర్షణపు వెర్రి మోహంతో నేను
ప్రేమ బజార్లో ఎదురుపడతాం
నా కళ్లకెప్పుడూ కలలే
నీ చూపులెప్పుడూ వలలే
వేనవేల సంవత్సరాలు నడిచి వచ్చినా
వెర్రి మోసాలెన్నో తెలిసొచ్చినా
మళ్లీ మళ్లీ మాయజలతారు పరదా
నా పరువాన్ని కమ్ముతూనే ఉంటుంది
మదమెక్కిన నీ మగతనపు వాంఛ
వాడి బాణాలతో విషం చిమ్ముతూనే ఉంటుంది
నువ్వు నా వేలికి తొడిగిన గాంధర్వ ఉంగరాన్ని
వయసు నీళ్లలోని.. వలపు చేప మింగుతూనే ఉంటుంది
నిండు సభలోనైనా నీలి వెలుగులోనైనా
నీ చేతుల లక్ష్యం నా ఉడుపులు విప్పడమే
ఉషోదయ నిశి ఉదయ ఉభయ సంధ్యల్లో
నీతో జీవన గమనాన్ని నేను కోరుకుంటే
ఎప్పటికప్పుడు చీకటింట నా ఆడతనాన్ని
మట్టు పెట్టడానికే నువ్వు చూస్తావు
నీ కపట ప్రేమలో పడి పదేపదే అగ్నిపరీక్షకు
నేను సిద్ధపడుతూనే ఉంటాను
సిగ్గు విడిచిన ఏకాంత క్షణాలు
బట్టబయలు బజార్లో పడి
నన్ను మాత్రమే శీలపరీక్షకు నిలబెడతాయి
ఆంతరంగిక అడ్డుగోడలు అంతఃపుర పరదాలు
అవధుల్ని అతిక్రమించలేక సాక్షులుగా విఫలమై
నిజాల నిగ్గు తేల్చలేక సిగ్గుపడతాయి
నీ వందిమాగధుల వంతగాళ్ల
బలగపు బలప్రదర్శన ముందు
నా నిజాయతీ నిస్సహాయతా
నిలువు గుంజీలు తీస్తూ ఉంటుంది
బుసకొట్టే కోడెనాగు పడగనీడ
నుంచి పారిపోవడానికి
తొందర తోవలు అన్వేషిస్తూ
విష ప్రయోగానికి విరుగుడు
వెతుక్కుంటూ
జీవితాంతం బిక్కుబిక్కుమని కంపిస్తూనో
వేదనలో విలపిస్తూనో
నేనుంటాను!