ఈ ప్రపంచంలో ఎవరికి వారు బిజీ అనుకుంటారు! కానీ, తరచి చూస్తే.. రెండు బిజీల మధ్య గంటలకొద్దీ తీరిక వేళ కనిపిస్తుంది. ఒక్క అమ్మ విషయంలోనే బిజీ అనే పదానికి సరైన అర్థం ఉందనిపిస్తుంది. బిడ్డల అవసరాలు తీర్చడం కోసమే ఈ జన్మ అన్నంతగా కష్టపడుతుంది అమ్మ. ప్రతీ నిమిషం తనకు ఎదురయ్యే సవాళ్లను చిరునవ్వుతో స్వీకరిస్తుంది. పిల్లల బాగోగులు, పెద్దలను కనిపెట్టుకొని ఉండటమూ, కట్టుకున్నవాడి డిమాండ్లు నెరవేర్చడమూ ఇలా రకరకాల పనులతోరోజులు గడిపేస్తున్న అమ్మ ఆల్వేస్ బిజీ!! ఇలా మన కోసం అనుక్షణం ఆలోచిస్తూ, నిరంతరం పరిశ్రమించే అమ్మకు ఒక్క రోజన్నా థ్యాంక్స్ చెప్పడం కుటుంబ సభ్యులుగా మన బాధ్యత. మాటలతో కాదు మనసుతో చెపితేనే దానికి సరైన అర్థం!
ఈ గజిబిజీ లైఫ్ మనకు కొత్తగా పరిచయమైంది కానీ, ఎందరో అమ్మలు.. ఎప్పుడూ బిజీగానే ఉంటుంటారు. ఇల్లే ఆమె సామ్రాజ్యం. గృహిణిగా ఉన్నా, ఉద్యోగం చేస్తున్నా.. ఇంటి పనిలో మాత్రం అమ్మ ఎవరి సాయమూ ఆశించదు. పొద్దున లేవడంతోనే బిజీ అయిపోతుంది. ప్రతి ఉదయం వంటింట్లో యుద్ధమే చేస్తుంది. రోజంతా పనిలోనే ఉండిపోతుంది. కొలువులు చేస్తున్న అమ్మల సంగతి సరేసరి. కాలం కన్నా వేగంగా పరిగెత్తడం వాళ్లకు అలవాటు. ఒళ్లు నొప్పులున్నా, మనసు కలతగా ఉన్నా.. తన బాధ్యతల విషయంలో రాజీపడని మనస్తత్వమే అమ్మను ఆదిదైవానికన్నా మిన్నగా నిలిపిందేమో! అందుకే అమ్మ రుణం తీర్చుకోలేనిదంటారు పెద్దలు. అరవెయ్యి బదులిస్తేనే ‘థ్యాంక్స్ బ్రో’ అని చెప్పే మనం అనునిత్యం ఆమె శక్తినీ, సమయాన్నీ ధారపోసే అమ్మకు ఎన్ని కృతజ్ఞతలు చెబితే సరిపోతుంది.
ఉరుకులు-పరుగులు
ఇల్లంతా ఆమెదే అయినా.. వంటింటితో అమ్మది జన్మజన్మల అనుబంధం. తరాలు మారినా ఈ విషయంలో మాత్రం మార్పు చోటు చేసుకోవడం లేదు. సూర్యుడి కన్నా ముందుగా మేల్కొనే అమ్మ అత్యవసరంగా అడుగుపెట్టేది వంటింట్లోనే! అప్పటికింకా భర్తగారు గాఢ నిద్రలోనే జోగుతుంటారు. మంచి ఫిల్టర్ కాఫీతో రోజు మొదలుపెడదాం అనుకున్నా.. అమ్మకు అంత వెసులుబాటు ఎక్కడిది. పొయ్యి మీద పాలు పెట్టి.. ఇల్లంతా ఊడ్చేసరికి విలువైన పదిహేను నిమిషాలు కరిగిపోతాయి. పిల్లల సుప్రభాత సేవకు సమయం ఆసన్నమవుతుంది. వాళ్లను నయానోభయానో లేపే ప్రయత్నం చేయడం, ‘ఒక్క ఐదు నిమిషాలు’ అంటూ వాళ్లు మళ్లీ నిద్రలోకి జారుకోవడం రివాజు. పాలు పొంగుతున్న శబ్దానికి వంటింట్లోకి పరుగుతీస్తుంది. గిన్నె అంచులు దాటకముందే పొయ్యి ఆఫ్ చేయగలిగితే.. స్టౌ కడిగే పని తప్పిందని సంతోషిస్తుంది. ఆ హడావుడిలో కాఫీ సంగతే మర్చిపోతుంది. ఉరుకుల పరుగుల మీద స్నానం కానిచ్చేస్తుంది. వచ్చీ రావడంతోనే కూరగాయలు సిద్ధం చేసుకోవడం, ఎసరు పెట్టడం గబగబా చేయాల్సిన విధులు. ఏ మాత్రం ఆలస్యమైనా.. జీవన గడియారం లయ తప్పుతుంది.
పిల్లలకు స్నాక్స్, భర్తకు టిఫిన్, రెండు వెరైటీలతో లంచ్ బాక్సులు సిద్ధం చేసేసరికి ఏడు గంటలు దాటుతుంది. ఇంతలో భర్తగారు నిద్ర లేవడం, కాఫీకి ఆర్డర్ జారీ చేయడం జరిగిపోతాయి. అప్పుడు గానీ, తను కాఫీ తాగలేదన్న విషయం అమ్మకు గుర్తుకురాదు. రెండు కప్పుల కాఫీ కలిపినా.. ఒక్కోసారి హడావుడిలో ఒక కప్పు ఒలికితే.. ఆ పూటకు కాఫీ మాఫీ అనుకుంటుంది. సవ్యసాచిలా రెండు చేతులతో ఎడతెగక పనులు చేస్తే గానీ ఎనిమిదింటి కల్లా పిల్లలను బడికి పంపడం కుదరదు. వాళ్లు అటు వెళ్లగానే గిన్నె అడుగున మిగిలి ఉన్న టిఫిన్ గబగబా తినేసి, లంచ్బాక్సుతో ఆఫీస్‌కు బయల్దేరుతుంది అమ్మ. భర్త, పిల్లలు బయటికి పోతే ఇంట్లో ఉండే అమ్మకేం పనుంటుంది? అనుకుంటారేమో! గృహిణి చేయాల్సిన పనులు ఉద్యోగాలు చేసే అతివల కన్నా ఒకింత ఎక్కువగానే ఉంటాయి. ఒక రకంగా ఇంటిల్లిపాదీ ఇల్లాలి మీదే ఆధారపడతారు. అందరికీ ఆమెతోనే అవసరం. అడగకుండానే ఆ అవసరం తీరిందంటే అక్కడ అమ్మ ఉందనే అర్థం. ఆమె ఒక్కో పనికీ ఒక్కో ధన్యవాదం తెలిపినా ఆ లెక్క చాంతాడుకు మించి సాగిపోతుందేమో!
అన్నీ చిరునవ్వుతోనే..
వంటింట్లో అమ్మ నిత్యం అష్టావధానం చేస్తుంటుంది. ఆదివారాలు, సెలవు దినాలు, పండుగ రోజుల్లో అది కాస్తా మహాసహస్రావధానం స్థాయికి చేరుకుంటుంది. రాత్రి పడుకునే ముందే.. ‘రేపు వడలు చెయ్యమ్మా’ కూతురు కోరిక, ‘మధ్యాహ్నానికి మటన్ బిర్యానీ చేయవా’ అని కొడుకు అభ్యర్థన. అన్నిటికీ అమ్మ సమాధానం చిరునవ్వే! పతిదేవుడి కోరికలు అదనం. మర్నాడు మమకారం దండిగా వేసి, ప్రేమను రంగరించి.. పిల్లల కోరికలన్నీ వండి వార్చి సిద్ధం చేస్తుంది అమ్మ. మధ్యాహ్న భోజనం చేస్తూనే.. సాయంత్రం అల్పాహారం సంగతి కనిపెడుతుంది. రాత్రి భోజనంలోకి ఏం చేయాలో ఆరాలు తీస్తుంది. వంటపనులు చేస్తూనే.. ఇంటిపనులు చక్కదిద్దుతుంటుంది. అయినా సరే, ఆమె ముఖంలో కించిత్ విసుగు, కాస్త చిరాకు కనిపించే సందర్భాలు చాలా తక్కువగానే ఉంటాయి. మనం చెప్పే ముచ్చట్లన్నీ వినడానికి నిరంతరం ఆమె ముఖంలో చిరునవ్వు స్వాగతిస్తూ ఉంటుంది. ఎన్ని ఎయిర్‌హోస్టెస్ ట్రెయినింగ్లు తీసుకుంటే అంత ఓపిక వస్తుంది అన్నది లెక్కగట్టడం కష్టమే.
ఒక్కరోజు సెలవు..
ఎంత అలసిపోయినా.. తన ముఖంలో ఆ ఛాయలు కనిపించకుండా జాగ్రత్త పడుతుంది అమ్మ. సెలవుల్లో కొడుకో, కూతురో, కోడలో సాయం చేస్తామన్నా.. ‘ఈ పనులు నాకు కొత్తా! మీరు రిలాక్స్ అవ్వండి. చిటికెలో చేసేస్తా’ అంటుంది కానీ, ‘అది చెయ్, ఇది చెయ్’ అని ఆర్డర్లు ఇవ్వదు. ఇన్ని చేస్తున్న అమ్మకు మనం ఏమిచ్చినా తక్కువే! అందుకే రోజూ కాదులే కానీ, వారంలో ఒక్క రోజైనా, అమ్మకు సెలవిద్దాం! అమ్మ ఒప్పుకోకపోతే.. నెలలో ఒక్క రోజన్నా హాయిగా విశ్రాంతి తీసుకోమని వేడుకుందాం! జాలి గుండె కదా.. ఒప్పేసుకుంటుంది. ఆ రోజు అమ్మను వంటింటి పరిసరాల్లోకి రానివ్వకండి. అమ్మ లేవగానే స్ట్రాంగ్ కాఫీ/ టీ పెట్టివ్వండి. తనకిష్టమైన టిఫిన్ చేసి పెట్టండి. భోజనానికి మూడు రకాలైనా సిద్ధం చేయండి. ఉప్పు, పప్పు ఎక్కడున్నాయో కన్ఫ్యూజ్ అయితే.. ఒక్కసారి వంటింట్లోకి వచ్చి వెళ్లమని చెప్పండి. వంతులు వేసుకుంటారో, ఒకరికొకరు వంత పాడుకుంటారో గానీ పనులన్నీ మీరే చక్కబెట్టండి. నాన్నను కూడా ఇన్వాల్వ్ చేయండి. అమ్మకు ఏదంటే ఇష్టమో ఆయనకు బాగా తెలిసే ఉంటుంది. కనుక్కొని అవకాశం ఉంటే.. ఆయనతోనే ఆ వంటకాన్ని చేయించండి. మీరు వండి వడ్డించే పదార్థాలు మీకు ఎలా ఉంటాయో గానీ, అమ్మకు మాత్రం బహు పసందుగా ఉంటాయి! ఎందుకంటే ఆమె అల్పసంతోషి. పని తప్పినందుకు తృప్తిపడే బాపతు కాదు! తన పనిని గుర్తించినందుకు అంతకన్నా కాదు! తన కోసం ఇంటిల్లిపాదీ పరితపించినందుకు!! మరి అమ్మకు కాస్త విశ్రాంతి ఇవ్వడానికీ, అందంగా ఆమెకు థ్యాంక్స్ చెప్పడానికీ ఇదీ ఓ మంచి రోజే!! అందుకే మనసు నిండా చెప్పండి…థ్యాంక్యూ అమ్మా!!
ఆదివారమూ అంతే..
ఆదివారం కాస్త ఆలస్యంగా లేచినా.. పనిలో మాత్రం అమ్మకు తేడా ఉండదు. పైగా అంతో ఇంతో పెరుగుతుంది కూడా! ఇంటాయన బాల్కనీలో నుంచి కాఫీ అంటాడు. టీవీ ముందున్న కొడుకు బూస్ట్ కోరతాడు. కాసేపయ్యాక ‘సండే స్పెషల్స్ ఏమున్నాయ్?’ అంటూ పిల్లాజెల్లా డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరుకుంటారు. అప్పటికే అక్కడ పొగలు కక్కుతూ పదార్థాలు సిద్ధంగా ఉంటాయి. అల్పాహారం తర్వాత ల్యాప్‌టాప్ చూస్తూ పెద్దోడు.. ఫోన్ చూస్తూ చిన్నకూతురు..! కాలక్షేపం చేస్తుంటారు. పేపర్లు తిరగేస్తూనో, స్నేహితులతో ఫోన్లో మాట్లాడుతూనో ఇంటాయన తాను చాలా బిజీ అనుకుంటూ ఉంటాడు. తామున్న చోటు అనువుగా అనిపించని మరుక్షణం మకాం మరోగదికి మార్చేస్తుంటారు. చేస్తున్న పని మీద విసుగొస్తే.. చిటికెలో మరో పనికి మారిపోతారు. ఇలాంటి వెసులుబాటు అమ్మకు ఉండదు. ఆదివారం అదనపు పనిని కూడా ఆనందంగా స్వీకరిస్తుంది. లంచ్‌లోకి పిల్లలు కోరిన వెరైటీలన్నీ ప్రేమగా చేసి పెడుతుంది. అమ్మ అలా ఉండబట్టే.. ఇంటిల్లిపాదీ హాయిగా మనగలుగుతున్నారు. సండే కూడా అమ్మకు ఫన్డే ఏం కాదు!