శుక యోగి పరీక్షిత్తుతో.. రాజా! నందరాజు ఏకాదశీ పుణ్యతిథి దినాన ఉపవసించి ఉపేంద్రుని- విష్ణువుని విధి విధానంగా ఉపాసించాడు. అసురవేళ అని తెలియక వేకువ కాకముందే, ద్వాదశి గడియలు దాటిపోతాయేమోనని ఆకుల- కలవరపడుతూ స్నానానికై వెళ్లి యమునా జలంలో దిగాడు. వెంటనే జలానికి అధిదేవత అయిన వరుణుని దూత నందరాజుని పట్టి బంధించి వరుణ నగరానికి పట్టుకుపోయాడు. తెల్లవారి బృందావనంలో నందుని కానక గోపకులెల్లరూ కలతచెందారు. గ్రద్దన- వేగంగా బలరామకృష్ణులను పెద్దగా కేకలు పెట్టి పిలిచారు. అది వరుణ భృత్యుని మోసపు కృత్యమని గ్రహించి సత్య సంకల్పుడు- నందుని పట్టి కృష్ణుడు అగత్యం- అత్యవసరంగా వరుణలోకానికి వెళ్లాడు. ఆ సమయాన వారి(జల) పతి వరుణదేవుడు తన లోకానికి విచ్చేసిన దానవారిని, వారిజాక్షుడు శౌరిని వీక్షించి వినయంతో వందించి పూజించాడు. ‘ప్రభూ! ఈ రూపంగా మీరు నా గృహానికి అపురూపంగా- అపూర్వంగా విజయం చేశారు’ అని ఆప్యాయంగా పలికాడు.
‘పుండరీకాక్షా! పండితులను నిండుగా ప్రమోద- ఆనంద పరచువాడా! ఏ పరమేశ్వరుని పాదపద్మాల యందు సేదతీరిన వారు ఎప్పుడూ, ఎవ్వరూ పొందలేని పెంద్రోవ- గొప్ప దారిలో నడువ గలుగుతారో, అట్టి నీ మేలైన రాకతో నా డెందం- మనసు అమంద- అపరిమిత ఆనందంతో నిండిపోయింది. నా కోరిక తీరింది. నీ సేవ వల్ల నా శరీరం పావనమైంది. మహానుభావా! లోకాలన్నిటినీ అలవోకగా కప్పివేయగల మాయ నీకు అధీనమై ఉంటుంది. నీవు ఒప్పిదమై- సర్వాంగ సుందరమై విరాజిల్లు మంగళమూర్తివి. సద్బుద్ధి గలవారిని సంరక్షించడంలో సర్వదా సంసిద్ధుడవై ఉంటావు. ఘనమైన తపమే మహాధనంగా గల సన్మనస్కులకు- సజ్జనులకు నీవు సార్వభౌముడవు. ఓ వనమాలీ! అనఘా! (పాప రహితుడా!) నా పాపం, తను (దేహ) తాపం తొలగటానికి నీకు సాగిలపడి మ్రొక్కుతాను’. ‘పురుషోత్తమా! నీవు పితృభక్తి పరాయణుడవు, మాయాదూరుడవు. పవిత్ర హృదయులైన భక్తులయందు ప్రేమ కలవాడవు. నా భృత్యుడు ఇంచుకైనా వివేకం లేక, నీ తండ్రి అని ఎంచక, ఈయనను నా వద్దకు తెచ్చాడు. దయతో నీ జనకుని గొనిపొమ్ము. కృపానిధీ! నా అపచారం మన్నించి నన్నూ, నా భటుణ్నీ కాపాడు’ అని వేడుకుంటున్న వరుణుణ్ని కరుణించి వాసుదేవుడు, తన జనకుని తోడుకొని గోకులానికి తిరిగి వచ్చాడు.
మూలంలో వరుణుడు అశరణ శరణుని కృష్ణుని ప్రస్తుతించే ప్రసంగంలో ‘పితృవత్సల!’ అని మాత్రమే ఉండగా పోతన ‘జనక వత్సల, నిర్మల, భక్తవత్సలా’ అని విస్తరించాడు. గోపకులందరూ శ్రీకృష్ణుని సాక్షాత్ విష్ణువుగా భావించారు. ‘తన ఏకాంత- అనన్య ప్రేమీ భక్తులు మాత్రమే దర్శించగల తన మాయాతీతమైన పరంధామాన్ని- బ్రహ్మమనే నామం కల స్వస్థానాన్ని మాకు కూడా చూపితే ఎంతో బాగుండు కదా!’ అని ఆశపడ్డారు. సర్వజ్ఞుడైన భగవానుడు తన బంధువుల మనోభావం గ్రహించి దయతో ఇలా తలచాడు.
ఆ॥ ‘ప్రకృతి కామ కర్మ పరవశమై యుచ్చ నీచ గతుల బొంది నెఱయ బ్రమసి తిరుగుచున్న జనము తెలియనేరరు నిజగతి విశేషమీ జగంబు నందు’ఈ సంసారంలో జీవులు అజ్ఞానం వల్ల తమ దేహాలనే ఆత్మగా భ్రమించి బహువిధాల కోరికలతో సతమతమవుతూ, వాటిని తీర్చుకోడానికి అనేక కర్మలలో తగులుకొని, తత్ఫలంగా ఉత్తమ, అధమ (దేవ, మనుష్య, పశు పక్ష్యాది) జన్మలను పొంది భ్రాంతితో సంచరిస్తున్నారు. వాస్తవికమూ, అసాధారణమూ అయిన నా నిజస్వరూప విశేషాలను గ్రహించ లేకుండా ఉన్నారు.
‘రాజా! అలా భావించి దయా స్వరూపుడైన ఆ దామోదరుడు, మాయకు అతీతము, పరంజ్యోతీ స్వరూపము, ఇదం- ఇత్థం- ఇది, ఇట్టిది అని నిరూపించరానిది, సత్యము- త్రికాలలో నశించనిది, జ్ఞానానందమయ పరబ్రహ్మము, త్రిగుణ రహితులు సమాధి నిష్ఠులైన పరమ పుణ్యాత్ములు మాత్రమే దర్శించ గలిగిన తన శాశ్వతలోకాన్ని దయతో వారికి చూపించదలచాడు. పరమాత్మ, పూర్వం అక్రూరునికి తన స్వరూపాన్ని చూపించిన, యమునలోని ‘బ్రహ్మహ్రదం’ అనే మడుగు వద్దకు తీసుకువెళ్లాడు. నందాది గోపకులందరూ అందులో మునిగి పరంధామాన్ని దర్శించారు. పరమానందం పొందారు. వేదాలన్నీ రూపుదాల్చి యశోదానందనుని కృష్ణుని కీర్తిస్తుండగా చూచి వారు విస్మయం చెందారు. హంస స్వరూపుడైన పరమాత్ముని అవలోకించి- తిలకించి, అర్చించి పులకించారు.’ పై మత్తేభ వృత్తంలో మూలశ్లోకానికి చాల విధేయమైన ఉత్తమ అనువాదం అందించి కవి సత్తముడు పోతన తన వాగ్జాలంలో భావుక భక్తుల చిత్తాలను బంధించాడు.
‘ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః’ (విష్ణు సహస్ర నామ స్తోత్రం)- శ్రీకృష్ణుని దేవాధి దేవత్వాన్ని నిరూపించటానికి భాగవత దశమ స్కంధంలో చతుర్ముఖ బ్రహ్మ, ఇంద్ర, వరుణుల పరాభవం ప్రస్తావించబడింది. బ్రహ్మకి, నేను సృష్టికర్తను అన్న అభిమానం. ఆయన మాయం చేసిన గోపబాలుర, దూడల రూపాలను కైటభారి కృష్ణుడు తానే ధరించి హాటకగర్భు (బ్రహ్మదేవు)ని ఆట కట్టించాడు. గోవర్ధనలీలలో ‘నేను నాక (స్వర్గ) పతిని, లోకపాలుణ్ని, వర్ష అధిదేవతని’ అన్న పాకశాసను (ఇంద్రు)ని అహంకారాన్ని నిరాకరించాడు. ఇప్పుడు వరుణ లోకం నుండి తన జనకుని క్షేమంగా తెచ్చుకొన్న ఈ వరుణ పరాభవ ప్రసంగం ద్వారా శ్రీకృష్ణుని రాసక్రీడకు ద్వారం తెరువబడింది. రాసలీలకు ముందుగా ముఖద్వారంగా కానవచ్చే ఈ ఘట్టం పరిమాణంలో ఊన- చిన్నదైనా మహిమలో ఘనమై మిక్కిలి మనన యోగ్యమైనది. ‘వరుణుడు మన రసనేంద్రియానికి- నాలుకకు అధిపతి- ఏలిక. ఆయన దూతలు షడ్రుచులు- ఉప్పు, పులుపు, తీపి, చేదు, కారం, వగరు అనేవి. రసనేంద్రియాన్ని- జిహ్వని జయించనిదే ఎవ్వరూ రాసలీలలో ప్రవేశానికి నోచుకోలేరు. షడ్రసాల వ్యసనపరునికి వాసుదేవుని భాసురమైన రాసరసం- బ్రహ్మానందం లభించదు. నందుడు జీవులకు ప్రతినిధి. జీవుడు కృష్ణభక్తి అనే కాళింది (యమున)లో స్నానానికి దిగగానే వరుణ సేవకులైన షడ్రసాలు- ఆరు రుచులు అతనిని బంధించడానికి పూనుకొంటాయి.
జీవాత్మ శబ్ద, స్పర్శాది లౌకిక- భౌతిక విషయ రసాలకు వశమై ఉన్నంతవరకు అలౌకిక- నిర్విషయమైన బ్రహ్మరసాన్ని ఆస్వాదించజాలదు. షడ్రసాలను జయించడానికి భక్తిరసాన్ని ఆశ్రయించాలి, సాధించాలి. ఈ కాలంలో మానవుని ఎక్కువ సమయం జిహ్వేంద్రియ, గుహ్యేంద్రియ (ఉపస్థ)ములను తృప్తిపరచడంతోనే- రస, స్పర్శ సుఖానుభవంతోనే గడచిపోతుంది అని డోంగ్రే మహారాజ్ ఈ లీలా పరమార్థాన్ని చాలా చక్కగా వక్కాణించారు. ‘వయసిగతే కః కామ వికారః’- తిరిగి రాని యవ్వనం తరిగిపోతే మరుని- కాముని వికారమన్నా కనుమరుగై పోతుందేమో కాని రసనేంద్రియం మాత్రం అంతకంతకూ మెరుగుపడుతూ- పెచ్చరిల్లుతూ చచ్చేవరకు కచ్చ(కక్ష) కట్టి వ్యసనాన్ని- కష్టనష్టాలను కలిగిస్తూనే ఉంటుంది. ‘సాధకుడు సంయమం పాటిస్తూ వివేకంతో ఆహారం స్వీకరించక ఇతర ఇంద్రియాలను శీఘ్రతరంగా తరించ- జయించ గలిగినా రసనేంద్రియం- నాలుక మాత్రం అంత తేలికగా వశం కాదు. తిండి పెట్టక మాడిస్తే దాని కండబలం పెరిగి ఇంకా చండ ప్రచండమవుతుంది. ఉద్ధవా! ‘జితం సర్వం జితేరసే’- నాలుకను లొంగ
తీసుకుంటే ఇంద్రియాలన్నీ వంది మాగధుల వలె వంగి-వంగి వందనాలు చేస్తాయి’ అని భాగవతం ఏకాదశ స్కంధంలో ఉద్ధవునికి భగవానుని మహోపదేశం. నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే! (సశేషం)
ఉ॥ ‘ఏ విభు పాదపద్మ రతులెన్నడు నెవ్వరు బొందలేని పెంద్రోవ జరింతు రట్టి బుధతోషక! నీ వరుదెంచుటం బ్రమోదా వృతమయ్యె జిత్తము గృతార్థత నొందె మనోరథంబు నీసేవ బవిత్ర భావమును జెందె శరీరము నేడు మాధవా!’
మ॥ ‘అని చింతించి దయాళుడైన హరి మాయాదూరమై జ్యోతియైయని రూప్యంబయి, సత్యమై యెఱుకయై, ఆనందమై బ్రహ్మమై
-తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006