పై పెదవిపై అవాంఛిత రోమాలు మహిళల సౌందర్యానికి అవరోధం. వాటిని తొలగించుకోవడం ఓ ఇబ్బందికర సమస్య. ప్రతీసారి పార్లర్‌కు వెళ్లడం కుదరదు. నిజానికి, అవాంఛిత రోమాలను వదిలించుకునేందుకు అనేక చిట్కాలున్నాయి. నిపుణుల సలహాతో వీటిని పాటించవచ్చు.
గుడ్డు తెల్లసొన, పసుపు: గుడ్డులోని తెల్లసొనకు అతుక్కునే స్వభావం ఉంటుంది. అవాంఛిత రోమాలను సున్నితంగా తొలగించడంలోనూ సాయపడుతుంది. చర్మంలోని రంధ్రాలను తగ్గించి, ముఖంపై ముడతలు లేకుండా చేస్తుంది. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. తెల్లసొన, పసుపు మిశ్రమాన్ని పెదవిపై రాసుకుని, ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
తెల్లసొన, కార్న్‌ఫ్లోర్: గుడ్డు తెల్లసొన, కార్న్‌ఫ్లోర్, చక్కెర మిశ్రమాన్ని పై పెదవికి రాసుకుని.. 15-20 నిమిషాల తర్వాత వెంట్రుకల పెరుగుదలకు వ్యతిరేక దిశలో షేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి 2-3 సార్లు ఇలా చేస్తే సరిపోతుంది. కార్న్‌ఫ్లోర్ చర్మంలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా చర్మం మృదువుగానూ
తయారవుతుంది.
పసుపు, పాలు: అవాంఛిత రోమాలను తొలగించడంలో పసుపు ఔషధంలా పనిచేస్తుంది. చర్మంపై ఎలాంటి మరకలూ ఏర్పడకుండా పాలు తోడ్పడతాయి. పాలు, పసుపు కలగలిపి పెదవిపై రాసుకుని.. ఆరిన తర్వాత షేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడగాలి. వారానికి రెండుసార్లు ఇలాచేస్తే మంచి ఫలితం ఉంటుంది.
చక్కెర, తేనె, నిమ్మకాయ: ఈ మూడింటి మిశ్రమానికి మైనాన్ని తలపించే గుణం ఉంటుంది. ఈ మిశ్రమాన్ని పెదవిపై రాసి ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.