పండ్లు ఆరోగ్యానికి మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ వాటిని తినేందుకూ ఒక పద్ధతి ఉంది. వీటిలో తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు ఉండటం మంచి విషయమే అయినా.. పండ్లలో చక్కెరలు కూడా ఉంటాయి. కాబట్టి, మెరుగైన ఫలితాల కోసం వాటిని ఎంత పరిమాణంలో, ఎలా తీసుకోవాలనే విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
రసాల రూపంలో కన్నా , నేరుగా పండ్లను తినడమే ఆరోగ్యానికి మంచిది. రసం తీసినప్పుడు గుజ్జు, తొక్క వడగడతాం. దీంతో విలువైన పోషకాలు, పీచులు వడపోతకు గురవుతాయి. ఉదాహరణకు నారింజలో అధికశాతం ఫ్లేవనాయిడ్లు గుజ్జులోనే ఉంటాయి. జ్యూస్ తీసుకున్నప్పుడు అవన్నీ శరీరానికి పూర్తిగా అందవు.
పైనాపిల్, మామిడి, బొప్పాయిలాంటి ఫలాల్లో పోషకాలు పుష్కలం. అయితే, చక్కెర పరిమాణం ఎక్కువ. వీటిని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. లేకపోతే బరువు పెరిగే ప్రమాదం ఉంది.
పండ్లలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. భోజనానికీ భోజనానికీ మధ్య ఫలాలను ఆరగించడం వల్ల తక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటాం. తద్వారా బరువు అదుపులో ఉంటుంది.
ఒకసారికి ఒక రకం పండును మాత్రమే తీసుకోవడం మేలు. ఎక్కువ పోషకాలు వస్తాయి కదా అని, రకరకాల పండ్ల మిశ్రమాల్ని తరచూ ఆరగించడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు రావచ్చు.
పండ్లు తిన్న ప్రతిసారీ వాటిమీద ఉప్పు చల్లుకోవద్దు. ఇలా చేస్తే శరీరంలో అదనపు లవణం పోగవుతుంది.
రోజుకు కనీసం రెండుసార్లు నచ్చిన పండ్లను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.
రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుకునేందుకు తక్కువ ైగ్లెసిమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లను తీసుకోవాలి. చెర్రీ, నారింజతో పాటు అల్బుఖారాలాంటి రేగుజాతి పండ్లూ ఈ కోవకు చెందుతాయి.