‘వీడు నవ్వితే అచ్చంగా వాళ్ల నాన్నే’ అంటుంది అమ్మ. కానీ, నాన్న నవ్వడం చూసి చాలా రోజులైంది. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ వ్యవహారాలు నాన్నపెదాలపై నవ్వును లాక్కొనిపోయాయి. నేడు ఆదివారం, పైగా ‘పితృ దినోత్సవం’. ఈ రోజు నాన్నను మనసారా నవ్వించండి. ఎలా అంటారా? ఈ రోజే దర్శకుడు జంధ్యాల వర్ధంతి. ఆ హాస్యబ్రహ్మ నవ్వులరాట్నంలో రూపుదిద్దుకున్న సినిమాలను నాన్నకు చూపిస్తే సరి!!
కొడుకు కోసం పరితపించే ఓ తండ్రి సినిమా
‘చంటబ్బాయ్’! ఇంత సీరియస్ థీమ్‌ని ఎంత హాస్యంగా తెరకెక్కించాడో మరి!! తండ్రీ-కొడుకుల చాలెంజ్ సినిమాలు జంధ్యాల తోటలో కోకొల్లలు. ‘ముద్దమందారం’ మొదలుకొని ‘హైహై నాయకా’ వరకు ఆయన సినిమాల్లో నవ్వించని కొడుకూ కనిపించడు. నవ్వని తండ్రీ ఉండడు. కులాసాను ‘కుమారుడి వల్ల లాస్’ అని ‘పడమటి సంధ్యారాగం’లో ఓ పితాశ్రీ పలికిన డైలాగ్ విని తనయులు భుజాలు తడుముకుంటారు. అదే సినిమాలో కూతురు ఇష్టపడిన వ్యక్తిని తొలుత పట్టుదలతో కాదన్నా, పట్టువిడుపులు ప్రదర్శించిన ఓ తండ్రి ఔన్నత్యమూ కనిపిస్తుంది.
కట్ చేస్తే..
‘అయ్యగారు ఒక ఫ్లవర్‌వాజ్’
‘బాబుగారు ఒక అద్దం’
‘అయ్యగారు బల్ల’
‘బాబుగారు టెలిఫోన్’
‘అహ నా పెళ్లంట’ చిత్రంలో తండ్రీకొడుకులుగా నటించిన నూతన్‌ప్రసాద్, రాజేంద్రప్రసాద్ జోడీ కామెడీ ఒక్కసారి చూడండి. అంతెందుకు ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సినిమాలో తండ్రిగా సుత్తి వీరభద్రరావు హూంకరింపులు ఎంత ఇంపుగా ఉంటాయో గుర్తు చేసుకోండి! ‘జయమ్ము నిశ్చయమ్మురా’ సినిమాలోనూ అంతే, తండ్రితో పంతానికి దిగిన కథానాయకుడే కనిపిస్తాడు. ప్రేమించిన అమ్మాయి తండ్రిని మెప్పించడానికి ఆయనగారు చేసిన విన్యాసాలు ఆరోగ్యకరమైన నవ్వును ప్రసాదిస్తాయి. ‘హై హై నాయకా’ మాత్రం తక్కువా! తండ్రి మాటలు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో హాస్యప్రధానంగా చెబుతూనే, నవ్వుతో మలాము రాశారు జంధ్యాల. ఇలా చెబుతూపోతే.. ‘వివాహ భోజనంబు’లో హైదరాబాదు.. ఆదిలాబాదు.. సికిందరాబాదు..’ అని సుత్తివారు పలికిన చాంతాడంత లిస్ట్ అవుతుంది. ఆ ఊళ్లన్నీ గాలించినా ఆయనగారు చెప్పినట్టు తప్పిపోయిన గుంటడు దొరకడు కానీ, మీ నాన్న పెదాలపై మాయమైన నవ్వు మాత్రం తప్పకుండా మళ్లీ ప్రత్యక్షమవుతుంది.
ఎందుకాలస్యం? యూట్యూబ్‌లోనో.. ఓటీటీలోనో జంధ్యాల చిత్రరాజాలు అందుబాటులోనే ఉన్నాయి. ఆ దర్శకబ్రహ్మ వర్ధంతి సందర్భంగా టీవీ చానల్స్‌లోనూ ప్రసారం కావొచ్చు. వీలు చేసుకొని చూడండి. ఆదమరచి చూడండి. ఈ ఫాదర్స్ డేని నవ్వుల వేడుకగా సెలబ్రేట్ చేసుకోండి. మీ అమ్మ అన్నట్టు నాన్న నవ్వులో మిమ్మల్ని మీరు చూసుకోండి.