భారతీయ భోజన విధానం పరిపూర్ణ ఆరోగ్యానికి సోపానం. వంటలో ఉపయోగించే ప్రతి దినుసూ ఏదో ఓ రూపంలో, ఏదో ఓ శరీర భాగానికి మంచి చేసేదే, ఏదో ఓ రుగ్మతను నివారించేదే. అందులోనూ ఇడ్లి, దోసె.. మొదలైన ఉపాహారాలు రుచితోపాటు ఆరోగ్యాన్నీ అందిస్తాయి. పిండిని పులియబెట్టడం వల్ల ఆ పదార్థానికి ఔషధ గుణం అబ్బుతుంది. ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా అందులో తిష్ఠవేస్తుంది. ఆ సూక్ష్మజీవులు పేగులను శుభ్రం చేస్తాయి. దీనివల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ రెండు గుణాలూ ఊబకాయాన్ని నివారించడంలో, బరువును నియంత్రించడంలో సాయపడతాయి. జీర్ణక్రియ మెరుగ్గా ఉంటే.. ఆహారం ఇట్టే అరిగిపోతుంది. సుఖ విరేచనాలు అవుతాయి. మంచి నిద్ర పడుతుంది. చర్మానికి నిగారింపు వస్తుంది. రక్తపోటు సాధారణ స్థాయికి వస్తుంది.
‘మంచి’ బ్యాక్టీరియా
నిత్య జీవితంలో ఆహారం రూపంలో, గాలి ద్వారా ఎన్నో విషపూరిత పదార్థాలు ఒంట్లో చేరుకుంటాయి. మంచి బ్యాక్టీరియా వీటిని కడిగిపారేస్తుంది. పెరుగు కూడా పులియ బెట్టిన ఆహారమే. చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో, ఎముకల అరుగుదలను అరికట్టడంలో తనవంతు పాత్ర పోషిస్తుంది. పులిసిన గంజిలోనూ ఔషధ గుణాలు అపారం. నూనెలు ఎక్కువగా గుప్పించని నిమ్మకాయ, ఉసిరి పచ్చళ్లు కూడా పులియబెట్టిన ఆహారం కిందికే వస్తాయి. చాలా సందర్భాల్లో మనం యాంటీబయాటిక్స్‌ను విచ్చల
విడిగా వాడేస్తుంటాం. ఆ చెడు ప్రభావాన్ని పులియబెట్టిన ఆహారం నామమాత్రం చేస్తుంది. ఇందులోని జీవ ఎంజైములు, విటమిన్-బి, బి12, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్, ప్రొటీన్లు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఆహారంలోని పోషక గుణాల్ని శరీరం పూర్తిగా స్వీకరించేలా చేస్తాయి. పోషకాల లోపంతో బాధపడాల్సిన పరిస్థితే ఎదురుకాదు.
-మయూరి ఆవుల , న్యూట్రిషనిస్ట్ , Mayuri@trudiet.in