ఈరోజుల్లో స్కూలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ స్మార్ట్ఫోనే ప్రపంచం అయిపోయింది. కరోనా కష్టకాలంలో జనాలు మరింతగా ఫోన్లకు బానిసలైపోయారు. దోస్తులను, బంధువులను కలిసే వీలులేక ఫోన్లకు అలవాటు పడ్డవాళ్లు కొందరైతే, ఫోన్ స్క్రీన్కు అతుక్కుపోయి స్నేహితులను దూరం పెడుతున్నవారు మరికొందరు. దీన్నే ‘ఫబ్బింగ్’ అని పిలుస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ మోజులో పడి, దోస్తులను దూరం చేసుకొంటున్నవారిలో చాలామంది ఒత్తిడి, ఒంటరితనం, నిస్పృహ వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు యూనివర్సిటీ ఆఫ్ జార్జియా పరిశోధకులు చెబుతున్నారు. స్నేహితులకు దూరంగా, ఫోన్లకు దగ్గరగా బతకడాన్ని తీవ్ర పరిణామంగా గుర్తించాలని సైకాలజిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. ఇలాంటివాళ్లు ఇతరులతో ప్రత్యక్ష సంబంధాల కంటే, సోషల్ మీడియా పరిచయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారట. ఈ లక్షణాలు స్కూలు పిల్లలు, టీనేజర్లలో కనిపిస్తే అప్రమత్తమై నిపుణులను సంప్రదించాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు పరిశోధకులు.