నాటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో.. ఒక్కో ఇంట్లో పదిమంది దాకా పిల్లలు కనిపించేవారు. అంతమంది ఉన్నా.. అన్యోన్యంగా కలిసిమెలిసి ఆడుకునేవారు. నేటికాలంలో ఇంట్లో ఇద్దరే ఉన్నా.. చీటికిమాటికి గొడవలు పడుతున్నారు. రాజీకి రాలేకపోతున్నారు. ఇందుకు పెద్దల
పర్యవేక్షణ లేకపోవడం ఒక కారణమైతే.. తల్లిదండ్రుల తీరికలేని జీవనశైలి మరో కారణమని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇలాగే కొనసాగితే, వయసుతోపాటే వారిమధ్య దూరం కూడా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా జరగకూడదంటే.. చిన్నప్పుడే తోబుట్టువుల మధ్య ప్రేమ, అనురాగాలను పెంచేందుకు తల్లిదండ్రులు చొరవ చూపాలని సూచిస్తున్నారు.
పక్షపాతం పనికిరాదు..
పిల్లల విషయంలో పక్షపాతం ఏమాత్రం పనికిరాదు. తోబుట్టువులు అన్నాక.. గొడవలు సాధారణమే! అలాంటి సమయాల్లో ఇద్దరి సమస్యలనూ పూర్తిగా వినాలి. ఒకరివైపే వకాల్తా పుచ్చుకొని.. వారు చెప్పిందే విని తుది నిర్ణయం తీసుకోవద్దు. ఇలా చేయడం వల్ల ఎదుటివారు మానసిక క్షోభకు గురవుతారు. తోటివారిపై విద్వేషం పెంచుకుంటారు. అలాకాకుండా ఉండాలంటే.. ఇద్దర్నీ కూర్చోబెట్టి మాట్లాడాలి. ఇద్దరి వివరణలూ విని.. అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే పిల్లల మధ్య నైతిక సంబంధాలు మెరుగుపడుతాయి. స్నేహపూర్వక వాతావరణం అలవడుతుంది.
పోలికలతో పోటీనే..
పిల్లల్ని ఒకరితో మరొకరిని ఎట్టి పరిస్థితుల్లోనూ పోల్చవద్దు.‘అక్కను చూసి నేర్చుకో!’ అనో.. ‘అన్నను చూసి బుద్ధి తెచ్చుకో!’ అనో అస్సలు అనొద్దు. అలా పోలిక పెడితే.. వారి మధ్య పోటీ పెడుతున్నట్టే! ఒకరిని పొగడటం.. మరొకరిని తిట్టడం.. పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. వారిలో ఒకరిపై ఒకరికి తెలియకుండానే కోపతాపాలు పెరుగుతాయి. దీంతో.. ఇద్దరి మధ్యా తరచుగా తగువులూ అవుతుంటాయి.
బంధం బలపడేలా..
పిల్లల మధ్య విద్వేషాలు రగిలితే.. పెద్దయ్యాక కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. అందుకే, బాల్యంలోనే వారిలో విద్వేషాలను తొలగించాలి. వారి మధ్య స్నేహపూర్వక వాతావరణం కల్పించాలి. వారితో ఇద్దరూ కలిసి ఆడే సరదా ఆటలను ఆడించాలి. ఫన్నీ టాస్కులు అప్పగించి.. ఇద్దరూ కలిసి చేసేలా ప్రోత్సహించాలి. దీనివల్ల ఒకరి గురించి మరొకరు పూర్తిగా తెలుసుకుంటారు. ఒకరికొకరు సాయం చేసుకోవడం.. బొమ్మలను పంచుకోవడం, పరస్పరం సంతోషంగా ఉండటం.. పిల్లల మధ్య బంధాన్ని బలపరుస్తుంది.
ఇష్టాయిష్టాలను గౌరవించేలా..
ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోలా ఉంటుంది. ఎవరికివారే ప్రత్యేకంగా, విభిన్నంగా ఉంటారు. వారి అలవాట్లను, అభిరుచులను తోబుట్టువులతో పంచుకునేలా ప్రోత్సహించాలి. ఒకరిలో ఉన్న విభిన్న లక్షణాలను మరొకరు గౌరవించేలా, ఇష్టపడేలా చూడాలి. అలాగే, ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలో పిల్లలకు నేర్పించాలి. ఇద్దరూ ఐకమత్యంగా ఉండాలని.. కలిసి ఉంటే కలిగే ప్రయోజనాలను వివరించాలి.