ఆమె ఓ కిరాణా వ్యాపారి కూతురు. బలమైన సంకల్పంతో తన కల నెరవేర్చుకుంది.నాన్నకిచ్చిన మాట నిజం చేసుకుంది. ఆ విజయాన్ని ఎవరైనా విందులూ వినోదాలతో వేడుక చేసుకుంటారు. కానీ ఆ తండ్రీకూతుళ్లు మాత్రం తమ సిబ్బందిని విమానంలో తిరుపతికి తీసుకెళ్లి మురిసిపోయారు.
ఆత్మబలంతో ఆకాశాన్నీ జయించవచ్చని నిరూపించింది ఆ యువతి. విదేశాల్లో పట్టా అందుకున్నాక, ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో పైలట్ ఉద్యోగం సంపాదించింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి చెందిన అజీజ్ ఇరానీ, నెవినా ఇరానీ దంపతుల ముద్దుల కూతురు అఫ్రినా. విమానం నడపాలన్నది ఆమె కల. అజీజ్ కిరాణా వ్యాపారం చేస్తారు. నెవినా గృహిణి. అఫ్రినా పదో తరగతి వరకు ఆదిలాబాద్‌లోనే చదువుకుంది. ఇంటర్మీడియట్,ఏరోనాటికల్ ఇంజినీరింగ్ హైదరాబాద్‌లో పూర్తి చేసింది. ఆ తర్వాత రెండేండ్ల పైలట్ శిక్షణకు ఆస్ట్రేలియా బయల్దేరింది. మంచి మార్కులతో ఆ కోర్సులో ఉత్తీర్ణురాలైంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ అఫ్రినా ప్రతిభకు మెచ్చి ఉద్యోగం ఇచ్చింది. ఆ వార్త తెలియగానే కన్నవారి ఆనందం అంతాయింతా కాదు. అజీజ్ ఇరానీకైతే కొండెక్కినంత సంబురం. ఆ సంతోషాన్ని తన దగ్గర పనిచేసే ఉద్యోగులతోనూ పంచుకోవాలని అనుకున్నాడు. విందులూ, వినోదాలూ కాదు.. ఏదైనా మరచిపోలేని అనుభూతిని అందించాలని భావించాడు. తన కూతురు భవిష్యత్తులో విమానం నడప
బోతున్నది కాబట్టి, ఏకంగా విమానంలో తిరుపతికి తీసుకెళ్లాలని అనుకున్నాడు.
ఆ ప్రతిపాదనకు అఫ్రినా కూడా సరేనంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచీ విమానం ఆకాశంలో దూసుకుపోతున్నప్పుడు సిబ్బంది మొహంలో ఆనందాశ్చర్యాలు. ‘మేమే రెక్కలుకట్టుకుని పైకెగురుతున్నామేమో అనిపించింది. ఈ అనుభవాన్ని జీవితాంతం మరిచిపోలేం. విమానంలోని పైలట్ స్థానంలో మా యజమాని కూతురిని ఊహించుకుని మురిసిపోయాం’ అని చెప్పారు వాళ్లంతా. వస్తూ వస్తూ వాళ్లందర్నీ హైదరాబాద్‌లో వండర్ వర్డ్ లాంటి వినోద కేంద్రాలకూ తీసుకెళ్లారు అజీజ్. ‘నా విజయంలో నాన్న సహకారం ఎంతో ఉంది. ఖర్చుల గురించి ఆలోచించొద్దు, బాగా చదివి నీ కలను నిజం చేసుకో.. అని భరోసా ఇచ్చారు. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తానని నేను మాటిచ్చాను. ఆ వాగ్దానం నిలబెట్టుకున్నాను కూడా. ఇప్పటికి కూడా విమానయాన రంగంలో పురుషులదే ఆధిపత్యం. స్త్రీలు ఎయిర్ హోస్టెస్లాంటి కొలువులకే పరిమితం అవుతున్నారు. అవరోధాలను అధిగమించి మహిళలు అగ్రస్థానానికి చేరే రోజు ఎంతో దూరం లేదు’ అంటున్నది అఫ్రినా. ఆదిలాబాద్ నుంచి కమర్షియల్ పైలట్‌గా ఎంపికైన రెండో మహిళ తను. ఆ జాబితా ఇక్కడితో ఆగిపోకూడదు.
-బాకే రఘునందన్