గేమింగ్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చాలామంది దాన్నో కెరీర్‌గా ఎంచుకుంటున్నారు. కాకపోతే, ఇప్పటికీ పురుషులదే ఆధిపత్యం. అలాంటి చోట గేమింగ్‌లో పట్టుసాధించడమే కాదు, తన ప్రతిభను చాటుకుంటూ లక్షలమంది అభిమానుల్ని సంపాదించుకున్నది హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ నిపుణురాలిగా పనిచేస్తున్న వైష్ణవి. కంప్యూటర్ గేమ్స్‌లో మెలకువలు చెబుతూ తను ప్రారంభించిన ఛానెల్ పేరు ‘నటాషా గేమింగ్’. పబ్జీ (బీజీఎంఐ) ఆడటంలో నేర్పరి వైష్ణవి. ఆట లైవ్ స్ట్రీమింగ్ ఇస్తూ ఆమె చేసే రన్నింగ్ కామెంటరీ సరదాగా ఉంటుంది. దీంతో గేమింగ్ ప్రియులు ఈ ఛానెల్ చూసేందుకు ఇష్టపడుతుంటారు.
అంతేకాదు, మధ్యమధ్యలో కామెడీ బిట్లు, పంచ్ డైలాగులు జొప్పించి.. వీక్షకులను ఆకట్టుకుంటుంది. అప్పుడప్పుడూ పాపులర్ యూట్యూబ్ గేమర్లతోనూ కలిసి ఆడుతుంది వైష్ణవి. తొలుత తనెవరో తెలియకుండా ఆట ద్వారానే.. సబ్‌స్ర్కైబర్లను ఆకట్టుకుంది. తర్వాత నేరుగా వీడియోల్లో కనిపించడం ప్రారంభించింది. నటాషా అనే పేరు తనకిష్టమనీ, అందుకే తన ఛానెల్‌కు ఆ పేరు పెట్టుకున్నానని చెబుతుంది వైష్ణవి. ఆటలతో పాటు తన జీవితంలోని వివిధ వేడుకలనూ వీక్షకులతో పంచుకుంటుంది. ‘భయపడాలా ఏంటి?’ అనే మాట తన ఊతపదం. నిజంగానే ఆమె, భయపడకుండా పబ్జీలో దూసుకెళ్తున్నది.