యోగం అంటే కలపడం (సంయోగ పరచటం) అని అర్థం. అంటే జీవాత్మను పరమాత్మతో ఐక్యం చేయడం ఇక్కడ జీవాత్మ అంటే మానవుడు. వాస్తవానికి జీవాత్మ, పరమాత్మ ఒక్కటే! కానీ, జీవాత్మను మాయ ఆవహించి తన గుప్పిట్లో పెట్టుకుంటుంది. ఆ మాయ కారణంగా జీవుడు తాను పరమాత్మ అంశననే విషయాన్ని విస్మరిస్తాడు. తాను వేరు, పరమాత్మ వేరు అనుకుంటాడు. పరమాత్మ గురించి ఎక్కడెక్కడో అన్వేషిస్తుంటాడు.
మానవుడు పరమాత్మలో ఐక్యం కావటానికి చాలా జన్మలు పడుతుంది. కానీ, యోగసాధనతో ఒకే జన్మలోగానీ, కొన్ని జన్మల్లోగానీ ఆత్మ, పరమాత్మలో తేలికగా లయమవుతుంది. ఈ విలీనం కోసం పతంజలి అందించిన సులభమైన మార్గం అష్టాంగ యోగం. అవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి. అని ఈ ఎనిమిదింటిని యోగానికి అంగాలుగా (అష్టాంగ యోగం) చెప్పారు.
మానవ దేహం భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలతో, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనే పంచకోశాలతో, 72 వేల నాడులతోపాటు మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా, సహస్రారం అనే ఏడు ప్రధాన చక్రాలే కాకుండా అనేక ఉపచక్రాలతో ఏర్పాటైంది. వీటన్నిటిని చైతన్య పరచుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
అందుకు యోగసాధనే అసలైన మార్గం. అష్టాంగయోగంతో పూర్వం రుషులు అష్టసిద్ధులనూ సాధించారు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను దర్శించగలిగారు. అంతరిక్షంలో జరిగే అద్భుతాలను, గ్రహ గతులను వీక్షించగలిగారు. సామాన్య మానవుడూ ఈ అద్భుతాలను సాధించగలడు. అందుకు సద్గురువు మార్గదర్శకత్వంలో యోగాన్ని సాధన చేయాలి. యోగం వల్ల కలిగే లాభాలు అనేకం. అంతిమ ప్రయోజనం జన్మరాహిత్యం.
– భువనగిరి కిషన్ యోగి
85198 34758