రాధకు ప్రాణం కిట్టయ్య. కిట్టయ్యకు ఆరోప్రాణం రాధ. రాధామాధవుల ప్రేమకు వేదిక యమున. యమునా తీరంలో భాషలో రాయలేని రాసలీలలెన్నో! రాసలీల వేళ రాయబారం సాగించిన యమున ప్రేమ తరంగిణి. కాళిందిగా కాళియ మర్దనుని వరించింది. అణువణువూ కన్నయ్య తలపుల్లో చిక్కి, వలపుల్లో మరిగి, ఆ నల్లనయ్య తనువును తాకి నలుపెక్కిన ఈ జీవధార.. ప్రేమసాగరమే అయింది. ఈ ప్రణయాబ్దిని తమ కలాలతో చిలికి.. కళాత్మకమైన గీతాలను తెలుగు వెండితెరకు అందించారు సినీకవులు. పుష్కర సంబురంతో ముచ్చటగా ముస్తాబవుతున్న యమున తీరంలో ఉదయించిన సంధ్యారాగాలు ఒకసారి గుర్తుచేసుకుందాం…
సినీకవులకు నదులంటే ప్రాణం. అందుకే, సందర్భం కుదిరితే చాలు.. జీవన లహరిని జీవ తరంగిణితో ముడిపెట్టి ప్రేమలో మునకేసేలా పాటలు రాసేస్తారు. ఆనాటి ఆరుద్ర వారి నుంచి ఈనాటి రామజోగయ్య శాస్త్రి వరకు అందరూ తమ గీతాల్లో మది దోచేలా నదిని ప్రవహింపజేశారు. వెండితెరపై పల్లవించిన వాహినీల్లో గోదారిదే అగ్రస్థానం. ఎల్లువెత్తి గోదారమ్మా.. తెలుగు సినీ గీతాల్లో వెల్లాకిలా పడిందనే చెప్పొచ్చు. ఆ తర్వాత కృష్ణాతరంగాలు సారంగ రాగాలు కుమ్మరించాయి. అటుపై వెన్నెల పైటేసి కిన్నెరసానీ వచ్చేసింది. మరోవైపు తుంగ అలలు, చెలి… పై ఎదపై నర్తించాయి. ప్రణయ గాన లాహిరిలో యమునకూ అంతే ప్రాధాన్యం కనిపిస్తుంది. నాయికా, నాయకుల సరసాలకే కాదు, విరహాలకూ యమునా తీరాన్ని ఎంచుకున్నారు కవులు. యమున అనే ఒకే ఒక్క పదం వాడినా.. అది వాడిగా, వేడిగా పాటను నిలుపుతుంది. ఎందుకంటే, యమున అనగానే, బృందావనం స్ఫురణకు వస్తుంది. రేపల్లియ.. ఎద ఝల్లుమనేలా చేస్తుంది. రాధామాధవ గాథలు మనోఫలకంపై రంజిల్లుతాయి. గోపాలుని మృదుపదాన్ని ముద్దాడిన కాళింది.. తెలుగు పాటల్లో ఆడిందే ఆట, పాడిందే పాట!
యమున అనగానే ‘జయభేరి’లో ఎవర్గ్రీన్ పాట గుర్తుకురాక మానదు. ‘యమునా తీరమునా.. సంధ్యా సమయమునా..’ అంటూ సాగిపోయే గీతలహరి అత్యద్భుతం. విరహాలు, కలహాలు, అలకలు, కులుకులు అన్నిటినీ ఇందులో గుదిగుచ్చేశారు రచయిత ఆరుద్ర. ఘంటసాల, సుశీల గానం చేసిన ఆ గీతం అజరామరం.
‘యమునా తీరమున.. సంధ్యా సమయమునా.. వేయి కనులతో రాధ.. వేచి ఉండెను కాదా’ అని మొదలవుతుంది. రాధమ్మ ఎదురుచూపులకు కళ్లెం వేస్తూ.. వస్తాడు కృష్ణుడు. ఆ మాత్రం ఎడం కూడా సహించని రాధ.. వచ్చిన కన్నయ్యను నిలదీస్తుంది. ‘ఇంతసేపూ ఏ ఇంతికి వంతపాడినావో.. దాని చెంతకే పోరాదో’ అంటూ నిష్ఠురమాడుతుంది. ‘రానంత సేపూ విరహమా.. నేను రాగానే కలహమా..’ అంటూ ఇదైపోతాడు మాధవుడు. ఆ యమున నుంచి వీచిన ప్రేమవీచికలు.. రాధామాధవుల మధ్య రాజీ కుదుర్చుతాయి. చివరికి ‘రాధికా.. మాధవా..’ అంటూ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని యమున సాక్షిగా ఒక్కటవుతారు. సరసాన్ని పెంపు చేసే యమున, విరహాన్ని అమాంతం తుంచిపడేస్తుంది.
‘ఎవరికి వారే యమునా తీరే’ అని తెలుగు పదబంధం. ఏ మహాశయుడు దీనిని ప్రస్తావించాడో కానీ, ఆయన ఏనాడూ యమునా తీరానికి వెళ్లలేదని ఘంటాపథంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రాధ ఆరాధనా గీతి పలికించిన ‘మథురా నగరిలో.. యమునా లహరిలో..’ జీవన వాహిని బృందావన గీతమవుతుంది కానీ, ఎవరికి వారే ఎలా అవుతారు చెప్పండి. ‘రాసలీలకే ఊపిరి పోసిన అందెల రవళి’ రాధమ్మది. ‘అనగల రాగమై తొలుత వీనులు అలరించిన మురళి..’ ఆయనది. ఈ జంట యమున చెంత కలవడం వల్లే… యుగాలుగా ఆబాలగోపాలాన్ని అలరిస్తున్నది. ‘సప్తపది’లో వేటూరి గీతం ‘రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి’ పాట ఎంత హాయిగా ఉంటుంది. ఈ పాట మూడో చరణంలో గానీ యమున రాదు. తొలి చరణంలో బాలగోపాలుడి లీల, రెండో చరణంలో మురళీ గానామృత వైభవాన్ని అలంకారయుతంగా పొగిడిన వేటూరి.. మూడో చరణంలో యమునను ప్రస్తావించి, రాసలీలకు ఊపిరులూదిన వైనం విన్నంత మాత్రాన యమునలో పుష్కర స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది.
యదు కుమారుడు రాని వేళలో.. రాధ మనసు ఎలా ఉంటుంది. వెతలు రగిలి ‘పాపం రాధ’ అనిపించేలా ఉంటుంది. ఆ రాధమ్మ ఎక్కడో ఎదురు చూస్తుంటే కృష్ణుడు ఎప్పటికో గానీ రాడు. అదే ‘యమునా తటిలో నల్లనయ్యకై..’ ఎదురుచూస్తే.. సాయం సంధ్యకైనా తప్పకుండా వచ్చి వాలతాడు. ‘దళపతి’ సినిమాలో రాజశ్రీ రాసిన గీతం మరో అద్భుతం. సినిమా కథానుసారంగా ఆ పాటలో రేయి గడిచినా, పగలు గడిచినా.. మాధవుడు రాడనుకోండి. మనకు మాత్రం యమున ప్రస్తావనతో మరో అందమైన గీతం వచ్చేసింది. ఆ పాట ‘ప్రేమ పొంగులా పసిడి వన్నెలే వాడిపోయెనూ కాదా’ అని విరహ వేదనతో ముగిసినా.. నేటికీ ప్రేమికుల వాట్సాప్ స్టేటస్‌లలో రాగబంధాన్ని చాటుతూనే ఉంది.
‘నిరీక్షణ’లో ఓ గీతంలో రాధామాధవులు కనిపించరు. యమునాకృష్ణుల ప్రేమకు పట్టం కట్టిన ఓ పాట వినిపిస్తుంది. మనసు కవి ఆత్రేయ ఓ కన్నెపిల్ల తలపుల్లోకి తొంగి చూస్తే పొంగుకొచ్చిన ధార ఇది. ‘యమున ఎందుకే నువ్వు ఇంత నలుపెక్కినావు.. రేయి కిట్టయ్యతోటి కూడావా’ అంటూ యమున నలుపెందుకో తేల్చేశాడు. రాధకీడైన జతగాడు అంటూనే.. కాళిందిని కూడా చేరదీస్తాడన్న ఆ యువతి నమ్మకాన్ని పాటలో చిత్రించాడు ఆత్రేయ. జానకమ్మ గొంతులో ఈ పాట యమున తరంగమంత ఇంపుగా, సొంపుగా వినిపిస్తుంది.
మధువనిలో రాధికను ప్రస్తావిస్తూ సాగిపోయే మధువొలికే గీతక ‘అల్లరి బావ’ సినిమాలో ఒకటుంది. నదీనదాలపై పదుల్లో పదాలు ఊరించిన వేటూరి పాట ఇది. సంగీతం రాజన్-నాగేంద్ర ద్వయం. గానం ఎస్పీబీ, సుశీల. ఇంకేముంది ‘అల్లరి బావ’ మైసూర్ బృందావన్ గార్డెన్లో ఈ పాట మీద చిందులేసినా.. అది మథురానగరిలా గోచరమైంది. యమునా లహరిని గుర్తుకుతెచ్చింది. ప్రాసలు, ప్రయోగాలు ఈ పాటలో కొల్లలుగా కనిపిస్తాయి. ‘మథురాపురికి యమునా నదికి ఒకటే రాధిక’ అంటూ తొలి వలపుల్లో, తొలకరి మెరుపులను ఆవిష్కరించాడు కవిరాజు. ‘సఖి’లో ఇదే వేటూరి యమునను ఎంత ఇదిగా వాడుకున్నాడో తరచి వింటే.. పండు ముదుసలికి కూడా పైలాపచ్చీసు ప్రాయమున తన ప్రౌఢిమ తలంపుకొస్తుంది. ‘కాలమాగినది రా దొర ప్రా‘యమున యమున’ మురళీధర యవ్వనులై పొంగెరా కన్నా’ అంటూ ఆనంద మోహన వేణుగానాన్ని ఆ పాటలో అలై పొంగించారు. ఈ గీతాన్ని అలా వింటూ ఉంటే నిలబడి ఉన్న చోటే చిత్తరువు అయిపోవడం ఖాయం. అంతలా తాదాత్మ్యం చెందుతాం.
వెన్నెల్లో గోదారి అందాన్ని ఎన్నేసి మార్లో వర్ణించిన వేటూరి.. యముననూ మన గడ్డ మీద ప్రవహించే నదిగా మార్చేశారు. ‘ఆనంద్’ సినిమాలో ఆయన రాసిన గీతం ‘యమునా తీరం.. సంధ్యారాగం’ పాట మరో మెచ్చు తునక. యమునా తీరంలో.. సంధ్యారాగం వింటుంటే.. కలలు నిజమవుతాయట. ‘నీలా రెండు కనులలో.. నిలువగనే పూదారి యెన్నెల్లో గోదారి మెరుపులతో’ అంటూ యమున, గోదావరి నదుల అనుసంధానం చేసేశారు. ఏతావాతా కవి హృదయం ఏంటంటే.. యమునా తీరంలో కలలు నిజమవుతాయని. పురాణాలు పరికిస్తే అదే కదా అవగతమయ్యేది. రాధాకృష్ణుల ప్రేమ సత్యమైంది యమునా తటిలోనే! పూపొదల మాటున కూడా చిక్కని.. చక్కని నల్లనివాడు పద్మనయంబులవాడు గోపెమ్మలకు పట్టుబడింది యమునా తీరంలోనే కదా! అందుకే కాబోలు ప్రేమ చిహ్నంగా గుర్తింపు పొందిన తాజ్‌మహల్ యమున ఒడ్డున వెలిసింది!! భక్తులకు యమున ఆధ్యాత్మిక తరంగిణి. సినీభక్తులకు మాత్రం ప్రేమవాహిని. ఎందుకు ఆలస్యం.. యమునా తీరంలో.. సంధ్యారాగాలన్నీ వినేయండి. యమున ఒడ్డున.. విరహగీతం విన్నా, ప్రేమాయణమే అనిపిస్తుంది.
– కణ్వస