భారతీయ మహిళలు.. నిజంగా బంగారు తల్లులే! వారి వద్దనున్న బంగారం.. టాప్-5 దేశాల కన్నా ఎక్కువే! మనదేశ పడతుల దగ్గర 24,000 టన్నుల పుత్తడి నిల్వలు ఉన్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. ఇది.. ప్రపంచంలోని మొత్తం బంగారంలో 11 శాతమని చెబుతున్నది.
మనదేశంలో పసిడికి ప్రత్యేక స్థానం ఉన్నది. సంపదగానే కాకుండా, సంస్కృతీ సంప్రదాయాల్లోనూ బంగారం భాగమైంది. ఇక్కడ నిర్వహించే వివాహాది శుభకార్యాలు, పండుగల్లో.. స్వర్ణమే అగ్రతాంబూలం అందుకుంటున్నది. అలా, భారతీయుల జీవితాల్లో చెరగని ముద్ర వేస్తున్న స్వర్ణం.. ఇప్పుడు సరికొత్త రికార్డులూ సృష్టిస్తున్నది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదిక ప్రకారం.. భారతీయ మహిళల దగ్గర దాదాపు 24,000 టన్నుల బంగారం ఉందని తేలింది. ప్రపంచంలోని మొత్తం బంగారంలో వీరి వాటా 11 శాతం కాగా.. మొదటి ఐదు దేశాల బంగారు నిల్వల కన్నా ఇది ఎక్కువని వెల్లడైంది. అమెరికా దగ్గర 8,000 టన్నుల బంగారం ఉండగా, జర్మనీ 3,300 టన్నులు, ఇటలీ 2,450 టన్నులు, ఫ్రాన్స్ 2,400 టన్నులు, రష్యా దగ్గర 1,900 టన్నుల బంగారం ఉన్నది.
ఈ మొత్తం కలిపినా.. భారతీయ మహిళల దగ్గరున్న బంగారం కంటే తక్కువే! భారతీయ కుటుంబాల దగ్గర ఉన్న పుత్తడి విలువ అంతర్జాతీయ ద్రవ్యనిధితోపాటు అమెరికా, స్విట్జర్లాండ్, జర్మనీ దేశాల సంయుక్త నిల్వల కంటే ఎక్కువేనట. ఇక భారత్‌లోనూ అత్యధికంగా 40 శాతం బంగారం దక్షిణాదిలోనే ఉన్నది. అందులో తమిళనాడు వాటా.. అత్యధికంగా 28 శాతంగా తేలింది. 2020-21లో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. భారతీయ కుటుంబాల దగ్గర 21,000 నుంచి 23,000 టన్నుల బంగారం ఉంది. 2023 నాటికి ఇది 24,000 టన్నుల నుంచి 25,000 టన్నులకు చేరింది. ఇది దేశ జీడీపీలో 40 శాతాన్ని కవర్ చేస్తూ.. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పునాదిగా నిలుస్తున్నది. ఆడవాళ్లు అపురూపంగా చూసుకొనే బంగారం.. దేశ భవిష్యత్తునూ నిర్ణయించే స్థాయికి చేరిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంటున్నది.