భారత్‌లో విభిన్న నైపుణ్యాలు కలిగిన మహిళలు.. విధులపై విముఖత చూపుతున్నారట. బ్లూ-గ్రే కాలర్ వర్క్‌ఫోర్స్‌లో 52 శాతం మంది.. ఏడాదిలోపే ఉద్యోగ విరమణ చేయాలని యోచిస్తున్నారట. ఉడైతి ఫౌండేషన్-క్వెస్ కార్ప్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనం.. ఈ విషయాలను వెల్లడించింది. జీతం పట్ల అసంతృప్తి, భద్రతా సమస్యలతోపాటు కెరీర్ వృద్ధి అవకాశాలు లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా తేలింది. రిటైల్, తయారీ, బీఎఫ్ఎస్ఐ, సేవలు.. తదితర రంగాలకు చెందిన 10,000 మందితోపాటు ఉద్యోగాలు మానేసిన 1,500 మంది మహిళా కార్మికులతో ఈ సర్వే నిర్వహించారు.
గత ఆరు నెలల్లో ఉద్యోగాలు వదిలివేసిన 1,500 మందిలో.. 67 శాతం మంది వివిధ కారణాల వల్ల ఉద్యోగానికి దూరంగా ఉన్నట్లు చెప్పారు. సర్వేలో పాల్గొన్నవారిలో 54 శాతం మంది మహిళలు జీతంపట్ల అసంతృప్తిగా ఉన్నారట. వీరిలో 80 శాతం మంది నెలకు రూ.2,000 కంటే తక్కువ ఆదా చేస్తున్నారని బయటపడింది. ఇక 57 శాతం మంది రవాణా సవాళ్లను ఎదుర్కొంటున్నామనీ, 11 శాతం మంది ప్రయాణాల్లో.. ముఖ్యంగా రాత్రివిధుల్లో అభద్రతకు గురవుతున్నట్లు చెప్పుకొచ్చారు. పని ప్రదేశాల్లో భద్రత, మౌలిక సదుపాయాల సవాళ్ల విషయానికి వస్తే.. 22 శాతం మంది మహిళలు పని ప్రదేశాలలో సురక్షితంగా లేనట్లు భావిస్తున్నారు. మరో 21 శాతం మంది మహిళలు.. వృత్తి జీవితంలో వృద్ధి లేకపోవడమే ఉద్యోగాలను విడిచి పెట్టడానికి ప్రధాన కారణమని వెల్లడించారు.
ఇక రూ.20,000 కంటే ఎక్కువ సంపాదించే వారు భవిష్యత్తులో ఉద్యోగం మానేసే అవకాశం 21 శాతం తక్కువగా ఉంటున్నదని సర్వేలో వెల్లడైంది. మెరుగైన జీతం ఉంటే.. ఉద్యోగంలో కొనసాగుతారని చెప్పడానికి ఇదే ఉదాహరణ అని అధ్యయనకారులు అంటున్నారు. అయితే, 2047 నాటికి ‘వికసిత భారత్’గా మారే లక్ష్యాన్ని సాధించడానికి మన దేశం ఏడాదికి 7-10 మిలియన్ల వ్యవసాయేతర ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉన్నది. ఈ ఉద్యోగాలలో బ్లూ-కాలర్ శ్రామిక శక్తి వాటానే అధికం! వీరే భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తారు. అలాంటి బ్లూ-గ్రే కాలర్ శ్రామిక శక్తిని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదని అధ్యయనకారులు అభిప్రాయపడుతున్నారు.