సభా మర్యాద… మంటగలిసిన ప్రతిసారీ ఆ కీలల్లో కాలేది ఆడదే…
హౌస్ ఆర్డర్… తప్పిన చాలా సందర్భాల్లో ఆగమయ్యే మనసు మహిళదే…
లక్షల మంది ఓటేస్తే గెలిచిన ఆమెకు రక్షణన్నదే ఇక్కడ కరవు…
తొట్ట తొలిసారి.. తెలంగాణ అసెంబ్లీ… చిల్లర… అతి చిల్లర వ్యాఖ్యలకు వేదికైంది… అక్కడ బాధ పడ్డ గుండె సబితమ్మ,సునీతమ్మలదే కాదు… యావత్ తెలంగాణ సమాజానిదీ… చట్టసభల సాక్షిగా భంగపడ్డ ప్రతి మహిళదీ…
జయలలిత… పురుట్చి తలైవిగా తమిళనాట జన నీరాజనాలందుకున్న నేత. ఒక రకంగా చెప్పాలంటే అమ్మగా ఆమెను అక్కడి ప్రజలు కొలుస్తారు. రాజకీయ ఎత్తుగడల్లోనే కాదు, మానవీయ దృక్ఫథంతో జనానికి మేలు చేసే విధంగానూ ఆమె ఆలోచనలను ఎవరూ దాటలేరు. ఆ స్థాయి నేతకూ చట్టసభలో అవమానం తప్పలేదు. అది 1989 మార్చి 25. తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్షనేత హోదాలో ఆమె కూర్చున్నారు. ఆ రాష్ర్టానికి తొలి ప్రతిపక్ష నాయకురాలూ ఆవిడే.
ఆర్థిక శాఖను తన దగ్గరే ఉంచుకున్న అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సిద్ధమయ్యారు. అంతకుముందు ఆ పార్టీ జయ మీద చేసిన అసత్యమైన ప్రచారాల నేపథ్యంలో, క్రిమినల్ చర్యలు చేసే వాళ్లకు బడ్జెట్ ప్రవేశ పెట్టే అర్హత లేదంటూ ఆమె గొంతెత్తారు. దానికి ప్రతి స్పందనగా వినలేని మాటలను, పత్రికల్లో ప్రచురించలేని వాక్యాలనూ వాడారు కరుణానిధి. దీంతో సభలో నిరసనలు వెల్లువెత్తాయి. ఆయన మాటలతో తీవ్ర మనస్తాపం చెందిన జయ సభ నుంచి బయటికి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, ఆమెను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు అధికార పక్ష సభ్యులు. ఆమె మీద దాడి చేయడమే కాదు, ఏకంగా చీరలాగారు.
చెదిరిన జుట్టుతో, అస్తవ్యస్తంగా ఉన్న చీరతోనే ఆమె అసెంబ్లీ నుంచి బయటికి దాదాపు పరిగెత్తుకుంటూ వచ్చారు. మీడియా అలాగే ఆమె చిత్రాలను ప్రచురించింది. దుశ్శాసన పర్వాన్ని ప్రతిబింబిస్తూ జరిగిన ఈ పరిణామానికి యావత్ దేశం నివ్వెరబోయింది. తనను ఇంత అవమానానికి గురి చేసిన ఈ సభలోకి మళ్లీ ముఖ్యమంత్రిగానే అడుగుపెడతానంటూ జయ ఆనాడు శపథం చేశారు. రెండేండ్ల తర్వాత ఆ పదవిలోనే ఆమె అసెంబ్లీ గడప తొక్కారు. అంతటి నేతనూ బోరున విలపించేలా చేసింది ఆనాటి రాజకీయం!
తెలంగాణలో ఆడబిడ్డల్ని ప్రత్యేకంగా చూస్తారు. బతుకమ్మ పండుగంటే ఆడబిడ్డ. రాఖీ పున్నమంటే ఆడబిడ్డ. బోనం కుండలంటే ఆడబిడ్డ… కానీ అదే ఆడబిడ్డల్ని గౌరవంగా చూడాల్సిన సంప్రదాయాన్ని మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో మంటగలిపారు సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి. రాజకీయ అంశాలనూ, వ్యక్తిగత కక్షలను కలబోసి… మహిళా సభ్యుల వ్యక్తిత్వ హననానికి పూనుకున్నారు. పార్టీ ఫిరాయింపు గురించి ముచ్చటగా మూడు పార్టీలు మారిన రేవంత్ మాట్లాడారు.
ఆడబిడ్డలను నమ్ముకుంటే నిండా ముంచేస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చట్టసభ గౌరవాన్ని పాతాళానికి తొక్కేశాయి. ఆ మాటలు కొన్ని లక్షల మందికి ప్రతినిధిగా ఉన్నవాళ్ల విశ్వసనీయతను ఎలా ప్రభావితం చేస్తాయన్న విషయాన్ని అక్కడి సభ్యులు కనీసం ఆలోచించినట్టు కనిపించలేదు. లోతున్న వైపునకు నీళ్లు పోయినట్టు అధికారం వైపునకు అమాంతంగా దూకిన అక్కడి నేతల విషయంలో మాత్రం ఈ నోళ్లు పెగలలేదు. మగవాళ్ల విషయంలో అలాంటి ప్రయత్నమే జరగదు కూడా.
పైగా ఈ నేత మాటకు ఉపనేతలంతా వంతపాడటం వింతను తలపించింది. మరో నేత ‘ఏ మొహం పెట్టుకుని వచ్చారు…’ అంటూ ఒత్తి ఒత్తి నోరు పారేసుకున్న వైనం తెలంగాణ ఆడబిడ్డల్ని కలచివేసింది. మహిళల రక్షణకు పాదుగొలిపే చట్టాలను చేయాల్సిన బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్లే… ఇలా కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారంటే, చట్ట సభల్లో ఆడవాళ్ల అర్హత మీద వాళ్లకున్న అభిప్రాయాల్లోని డొల్లతనాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడనే కాదు… గతంలోనూ కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్ తమ పార్టీ నుంచే ఎమ్మెల్యేలు అయిన ఆడవాళ్ల అయిదోతనం గురించి చులకనగా మాట్లాడి పలచనయ్యారు.
పార్లమెంట్లో తమ గొంతుక గట్టిగా వినిపించే ఎంపీల్లో ముందు వరుసలో ఉంటారు మహువా మొయిత్రా. తృణమూల్ కాంగ్రెస్ తరఫున పనిచేస్తున్న ఈమెను మమతలాగే ఫైర్‌బ్రాండ్‌గా పిలుస్తారు. ప్రధానిని సైతం గట్టిగా ప్రశ్నించే ఈమెనూ.. సాక్షాత్తూ పార్లమెంటరీ కమిటీ ద్వారానే అవమానించే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్య గోప్యతకు భంగం కలిగించారంటూ సభనుంచి బహిష్కరించారు. ఈ సమయంలో ఆమె వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి చూపించేందుకు అధికార పార్టీ సభ్యులు చేసిన ప్రయత్నాలు మీడియా ద్వారా అనేక సందర్భాల్లో జనాన్ని చేరాయి. అంతేకాదు, ఒక అధికార పార్టీ సభ్యుడు ఆమెను ‘నగరవధు (వేశ్య)’ అంటూ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఇవన్నీ ఆమెను తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. కానీ ఆమె ఎక్కడా తగ్గలేదు. మరోసారి పోటీ చేసి అదే లోక్‌సభలో అడుగుపెట్టారు. ‘తాను తన సభ్యత్వాన్ని, ఇంటిని, చివరకు గర్భాశయాన్నీ కోల్పోయాననీ.. కానీ గట్టిగా మాట్లాడే ధైర్యాన్నీ, స్వేచ్ఛనూ కోల్పోలేదంటూ’ చేసిన వ్యాఖ్యలు ఈ మధ్య వైరల్ అయ్యాయి.
చట్టసభల్లో సభ్యులు కాస్త నోరు అదుపుకోల్పోయినా.. ఆ పదాల్ని రికార్డుల్లోంచి తొలగించాలని డిమాండ్ చేస్తుంటారు. దస్ర్తాలకెక్కని ఎన్నో పదాలు.. మహిళల మనుసుపై చెరగని గాయాన్ని చేశాయని మన దేశ ప్రజాస్వామ్య చరిత్రను చూస్తే తెలుస్తుంది. చట్టాలు చేసి ఆడపిల్లలకు రక్షణ కల్పించాల్సిన చోటే.. స్త్రీమూర్తి చిన్నబుచ్చుకునేలా చేసిన వ్యాఖ్యానాలు చిట్టాలకొద్దీ కనిపిస్తాయి.
2016లో బీఎస్పీ అధినేత్రి మాయావతిపై బీజేపీ సభ్యుడు దయాశంకర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చట్ట సభల రికార్డుల్లో మాయని మచ్చగా మిగిలిపోయాయి. మాయావతిని ‘వేశ్య’ అని సంబోధించిన సదరు నేత అప్పుడు బీజేపీ ఉత్తర్‌ప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా ఉండటం శోచనీయం. ఆ మరుసటి ఏడాది సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ కూడా మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘ఏనుగు’ అంటూ ఆమె ఆకారాన్ని అవహేళన చేశారు.
2011లో తృణమూల్ కాంగ్రెస్‌కు విదేశాల నుంచి కొంత మొత్తం పార్టీ ఫండ్‌గా అందింది. ఈ అంశాన్ని లేవనెత్తుతూ సీపీఐ (ఎమ్) సభ్యుడు అనిల్ బసు చేసిన కామెంట్లు ఆయనకు ఓటేసి గెలిపించిన ఆరామ్‌బాగ్ ఓటర్లను సైతం తలదించుకునేలా చేసింది. ‘ఏం చేస్తే ఇంత సొమ్ము వచ్చింది’ అంటూనే పశ్చిమ్‌బెంగాల్‌లోని వేశ్యావాటిక పేరును ప్రస్తావించారు ఆయన.
కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీనీ చట్టసభ సాక్షిగా ఆమె మనసు గాయపడే విధంగా తూలనాడారు కొందరు ప్రబుద్ధులు. ‘విషకన్య’, ‘బార్ డ్యాన్సర్’ అంటూ ఆమెను అవహేళన చేశారు.
మొన్నటికి మొన్న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్… ఆ రాష్ట్ర అసెంబ్లీలో మహిళా సభ్యురాలిపై నోరు జారారు. రేఖాదేవీ అనే ఎమ్మెల్యేపై వేలెత్తి చూపుతూ ‘నువ్వు ఆడదానివి నీకేం తెలుసు..’ అని వివక్షపూరితంగా వ్యాఖ్యానించారు. గతంలోనూ ఓ మహిళా ఎమ్మెల్యేను ‘మీరు అందంగా’ ఉంటారంటూ నిండుసభలో నితీశ్ నిస్సిగ్గుగా కామెంట్ చేశారు.