నవతరం నవ్యతతోపాటు స్వేచ్ఛకు పెద్దపీట వేస్తున్నది. తినడం నుంచి తిరగడం వరకూ.. ప్రతి విషయంలోనూ స్వతంత్రతను కోరుకుంటున్నది. అందులోనూ జెన్-జీ మరింత కొత్తగా ఆలోచిస్తున్నది. అందుకే.. ట్రావెలింగ్‌లో అపరిచితులతో జట్టు కడుతున్నది. ‘సోలో-గ్రూప్ ట్రావెల్’ పేరుతో.. ముక్కూముఖం తెలియనివారితో ప్రపంచాన్ని చుట్టేస్తున్నది.
ఒకప్పుడు అపరిచితులు చాక్లెట్ ఇచ్చినా.. చచ్చినా తీసుకునేవాళ్లు కాదు. తెలియనివారిని దగ్గరికి కూడా రానిచ్చేవాళ్లు కాదు. కానీ, జెన్-జెడ్ తరం.. ఆ అంతరాలను చెరిపేస్తున్నది. స్వేచ్ఛకు పెద్దపీట వేస్తూ.. అపరిచితులతో టూర్లకు ‘సై’ అంటున్నది. ఒకప్పుడు అసాధారణంగా అనిపించిన ఈ రకమైన యాత్రలను.. ఇప్పుడు సాధారణ విషయంగా మార్చేసింది.
కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి టూర్లకు వెళ్లడాన్ని జెన్-జెడ్ కుర్రకారు నిర్బంధంగా ఫీలవుతున్నారు. తెలిసినవారితో యాత్రలు చేస్తే.. స్వేచ్ఛను కోల్పోయినట్లుగా భావిస్తున్నారు. ఎక్కడికి వెళ్లాలి? ఎక్కడ బస చేయాలి? ఏం తినాలి? ఎన్నిరోజులు టూర్ సాగించాలి? అనే విషయాలను మిత్రుల నిర్ణయాలు ప్రభావితం చేస్తున్నాయట. దాంతో, తమకు నచ్చినట్లు ఉండలేక పోతున్నామని జెన్-జెడ్ ఫీలింగ్. అదే సమయంలో ఒంటరిగా ప్రయాణించడానికీ.. అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. భద్రత, బడ్జెట్.. ఇలా అనేక సమస్యలు సోలో ట్రావెలింగ్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో తమ స్వేచ్ఛా
స్వాతంత్య్రాలను కాపాడుకుంటూనే.. భద్రత- బడ్జెట్ తప్పిపోకుండా ‘సోలో-గ్రూప్ ట్రావెల్’కు శ్రీకారం చుడుతున్నారు కుర్రకారు. అపరిచితులతో కలిసి ప్రయాణాలు కట్టేస్తున్నారు. ఈ ట్రెండ్ మనదేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్నది.
నవతరం యాత్రికులకు.. సోలో-గ్రూప్ ట్రావెల్ అన్నిరకాలుగా అనుకూలంగా ఉంటున్నది. చాలామంది తమలాంటి భావాలు కలిగిన అపరిచితులను తమతో కలుపుకొని ట్రావెల్ చేస్తున్నారు. ఇందుకోసం ముందుగానే పక్కా ప్లాన్ వేసుకుంటున్నారు. ఈ నయా ట్రావెలింగ్ ట్రెండ్ వల్ల.. ఒంటరి ప్రయాణాల స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. అదే సమయంలో ఒక గ్రూప్‌గా ప్రయాణిస్తూ.. ఉమ్మడి భద్రతను పొందుతున్నారు. ఖర్చులను పంచుకుంటున్నారు. కొత్త స్నేహాలను కనుగొంటున్నారు.