e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home News వినాయ‌క చ‌వితి రోజు చంద్రుడిని ఎందుకు చూడొద్దు? దోష ప‌రిహారం ఎలా చేసుకోవాలి?

వినాయ‌క చ‌వితి రోజు చంద్రుడిని ఎందుకు చూడొద్దు? దోష ప‌రిహారం ఎలా చేసుకోవాలి?

ganesh chaturthi | ధర్మరాజును శౌనకాది మహామునులందరూ కలిసి, సూతుడి దగ్గరికి వెళ్లి సత్సంగ కాలక్షేపం చేయాలని భావించారు. అప్పుడు సూతుడు మిగతా మునులతో ‘నేను ఈ రోజు మీకు వినాయకుని పుట్టుక, చవితి రోజున చంద్రుణ్ని దర్శిస్తే కలిగే దోషం, దాని నివారణోపాయములు వివరిస్తాను’ అని చెప్పడం మొదలు పెట్టాడు. శౌనకాది మహా మునులంతా శ్రద్ధగా వింటున్నారు.

వినాయ‌క చ‌వితి

పూర్వకాలంలో ఏనుగు రూపం కల గజాసురుడు అనే రాక్షసుడు పరమశివుని గురించి ఘోర తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు ‘గజాసురా! నీకేమి వరము కావలెనో కోరుకో’ అని అడిగాడు. అప్పుడు గజాసురుడు శివుణ్ని అనేక విధాలుగా స్తుతించి ‘స్వామీ! లోకాలన్నిటిలోనూ పూజలందుకునే మీరు ఇకపై నా ఉదరంలో నివాసం ఉండాలి’ అని వరాన్ని అడిగాడు. భక్తుల కోరికలను ఎన్నడూ జవదాటని భోళా శంకరుడు వెంటనే గజాసురుని ఉదరంలోకి ప్రవేశించి అక్కడే నివాసం ఉన్నాడు.

- Advertisement -

కైలాసంలో పార్వతీదేవి తన భర్త ఎటు వెళ్లాడో తెలియక అనేకచోట్ల వెతికి, ఎక్కడా కనిపించక నిరాశ చెందింది. కొంత కాలానికి తన పతి గజాసురుడనే రాక్షసుని ఉదరంలో ఉన్నాడని తెలుసుకుంది. శంకరుడిని తిరిగి తీసుకువచ్చే మార్గం తెలియక బాధపడుతూ చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి, జరిగినదంతా చెప్పి ‘ఓ మహానుభావా! పూర్వం భస్మాసురుడి బారి నుంచి నా భర్తను రక్షించావు. ఇప్పుడు కూడా అలాగే తగు ఉపాయముతో రక్షించమని’ విలపించింది. అప్పుడు శ్రీహరి పార్వతిని అనునయించి నేనున్నానని అభయమిచ్చాడు. బ్రహ్మాది దేవతలను పిలిపించాడు విష్ణువు. గజాసురుని ఉదరంలో బందీ అయిన పరమేశ్వరుడిని ఎలా బయటకు తీసుకురావాలో చర్చించాడు. చివరికి ‘దీనికి గంగిరెద్దుల మేళమే సరి అయినదనే’ ఆలోచనకు వచ్చాడు. శివుని వాహనమైన నందిని గంగిరెద్దుగా అలంకరించారు దేవతలు. బ్రహ్మాది దేవతలంతా తలో వాద్యం చేతబూనారు. విష్ణువు చిరుగంటలు, సన్నాయి పట్టుకొని మేళగాని వేషం కట్టుకున్నాడు.

వినాయ‌క చ‌వితి

దేవతలంతా గంగిరెద్దు మేళంతో గజాసురుని రాజ్యంలో ప్రవేశించారు. నగరంలో పలు చోట్ల జగన్మోహనముగా గంగిరెద్దును ఆడించారు. ఆ నోటా ఈ నోటా వీరి ఆటాపాటా సంగతి గజాసురునికి చేరింది. వారిని పిలిపించి తమ భవనం ఎదుట మేళం కట్టమన్నాడు గజాసురుడు. బ్రహ్మాది దేవతలు వాద్యాలను విశేషంగా వాయిస్తూ వీనుల విందు చేశారు. శ్రీహరి గంగిరెద్దును చిత్రవిచిత్రంగా ఆడిస్తూ గజాసురునికి కన్నుల పండువ చేశాడు. వారి ప్రదర్శనకు పరమానంద భరితుడయ్యాడు గజాసురుడు. ‘మీకేమి కావాలో కోరుకోండి’ అని అడిగాడు. అప్పుడు శ్రీహరి గజాసురుడిని సమీపించి ‘ఓ రాజా! ఇది శివుని వాహనమైన నంది. శివుడిని కనుగొనడానికి వచ్చింది. కనుక, పరమశివుడిని తిరిగి ఇవ్వమ’ని అన్నాడు. ఆ మాటలకు ఉలిక్కిపడ్డాడు గజాసురుడు. ఆ వచ్చింది రాక్షసాంతకుడగు శ్రీహరి అని గుర్తించి తనకిక మరణం తప్పదనుకున్నాడు. ‘నా శిరస్సుకు త్రిలోకాలలో పూజలు జరగాలి. నా చర్మాన్ని నీవు ధరించాలి’ అని తన ఉదరంలో ఉన్న శివుడిని ప్రార్థించాడు గజాసురుడు. శంకరుడు ‘సరేనని’ వరమిచ్చాడు. వెంటనే శ్రీహరి అనుమతితో నంది తన కొమ్ములతో గజాసురుని పొట్టను చీల్చి సంహరించాడు. శివుడు ఆ అసురుని ఉదరం నుంచి బయటకు వచ్చి విష్ణుమూర్తిని స్తుతించాడు. బ్రహ్మాదులతో శ్రీహరి ‘దుష్టులకు ఇటువంటి వరములు ఇవ్వకూడదు. ఇచ్చినట్లయితే పాముకు పాలు పోసి పెంచినట్లు అవుతుంది’ అని ఉపదేశించి వైకుంఠానికి వెళ్లిపోయాడు. శివుడు నందిని ఎక్కి కైలాసానికేగాడు. బ్రహ్మాది దేవతలు స్వస్థలాలకు వెళ్లిపోయారు.

వినాయ‌క చ‌వితి

వినాయక జననం

కైలాసంలో ఉన్న పార్వతి తన భర్త వస్తున్నాడని దేవతల ద్వారా తెలుసుకొని సంతోషించింది. అభ్యంగన స్నానం చేసి, నలుగు పిండితో ఒక బాలుణ్ని తయారు చేసి ప్రాణం పోసింది. ఆ బాలుణ్ని ద్వారం దగ్గర కాపలాగా ఉంచింది. సర్వాభరణాలు అలంకరించుకున్న పార్వతి పశుపతి రాకకై ఎదురుచూస్తూ తన గదిలో ఉంది. అంతలో పరమేశ్వరుడు నందిని అధిరోహించి కైలాసానికి వచ్చాడు. గదిలోకి వెళ్లబోతుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుడు పరమశివుణ్ని అడ్డగించాడు. దానితో కోపావేశుడైన శివుడు, తన త్రిశూలంతో ఆ బాలుని శిరస్సు ఛేదించి లోపలికి వెళ్లాడు.

చాలాకాలం తర్వాత వచ్చిన శివుడిని సాదరంగా ఆహ్వానించింది పార్వతి. దంపతులిద్దరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండగా మధ్యలో బాలుని ప్రస్తావన వచ్చింది. జరిగిన పొరపాటును తలచుకొని శంకరుడు చింతించాడు. అదేసమయంలో మహేశ్వరునికి తాను గజాసురునికిచ్చిన వరం గుర్తొచ్చింది. శివగణాలను పంపి గజాసురుని తలను తెప్పించాడు. దానిని ఆ బాలుడికి శరీరానికి అతికించి ప్రాణం పోసి ‘గజాననుడనే’ పేరు పెట్టాడు. ఆ బాలుడిని పుత్ర వాత్సల్యంతో ఆదిదంపతులిద్దరూ అల్లారుముద్దుగా పెంచసాగారు. గజాననుడు కూడా భక్తి ప్రపత్తులతో తల్లిదండ్రులను సేవించాడు. అనింద్యుడను ఒక ఎలుకను వాహనంగా చేసుకున్నాడు గజాననుడు. కొన్ని రోజులకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతడు మహా బలశాలి. కుమార స్వామి నెమలిని వాహనంగా చేసుకుని దేవతల సేనానాయకుడిగా ప్రఖ్యాతి చెందాడు.

వినాయ‌క చ‌వితి

విఘ్నేశాధిపత్యం

ఒకరోజు దేవతలు, మునులు పరమశివుణ్ని సేవించి, విఘ్నములకు అధిపతిగా ఒకరిని నియమించమని అడిగారు. అక్కడే ఉన్న కుమారస్వామి ‘గజాననుడు మరుగుజ్జువాడు, అసమర్థుడు. కావున, ఆ ఆధిపత్యము తనకు ఇవ్వమ’ని తండ్రిని ప్రార్థించాడు. అప్పుడు శివుడు గజాననుడిని, కుమారస్వామిని ..ఇద్దరినీ పిలిచి ‘మీలో ఎవరు ముందుగా ముల్లోకాల్లోని నదులన్నిటిలో స్నానం చేసి నా దగ్గరకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం ఇస్తాన’ని చెప్పాడు. పరీక్షకు కుమారస్వామి సమ్మతించి తన వాహనమైన నెమలి మీద ఎక్కి వాయువేగంతో వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న గజాననుడు తండ్రి దగ్గరకు వెళ్ళి వినమ్రంగా నమస్కరించి ‘తండ్రీ! నా అసమర్థత తెలిసి కూడా మీరు ఇలాంటి పరీక్ష పెట్టడం తగునా’ అంటూ, తగిన ఉపాయం చెప్పమని ప్రార్థించాడు. అప్పుడు శివుడు కరుణతో ‘వత్సా! ఒక్కసారి నారాయణ మంత్రాన్ని పఠించినవారు మూడువందల కల్పాల కాలం పుణ్యనదులలో స్నానమాచరించిన ఫలం పొందుతార’ని చెప్పి గజాననుడికి మంత్రం ఉపదేశించాడు. గజాననుడు కైలాసంలోనే ఉండి తండ్రి ఉపదేశించిన మంత్రాన్ని ధ్యానించాడు. నారాయణ మంత్ర ప్రభావంతో కుమారస్వామి ఏ నదిలో స్నానమాచరించుటకు వెళ్ళినా తన కంటే ముందుగా గజాననుడు అక్కడ ఉండటాన్ని గమనించాడు. అన్ని నదుల్లో స్నానం చేసి కైలాసానికి వెళ్లిన కుమారస్వామికి అక్కడ శివుని పక్కనే గజాననుడు కనిపించాడు. అన్న గొప్పదనాన్ని గుర్తించిన కుమారస్వామి ఆయనకు నమస్కరించి ‘ఈ ఆధిపత్యము అన్నగారికే ఇవ్వమ’ని తండ్రిని కోరాడు. ఈ విధంగా ‘భాద్రపద శుద్ధ చవితి’ నాడు గజాననుడు విఘ్నాధిపత్యం పొందాడు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని దేవతలు, భక్తులు విఘ్నేశ్వరుడికి కుడుములు, ఉండ్రాళ్ళు మొదలైనవి నైవేద్యంగా పెట్టగా.. వాటిని సంతోషంగా తిని, కొన్ని తన వాహనానికి పెట్టి, మిగతా వాటిని చేతిలో పెట్టుకుని భుక్తాయాసంతో సాయంకాలానికి కైలాసానికి చేరుకున్నాడు. అక్కడే ఉన్న తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేయడానికి ప్రయత్నించాడు. ఎక్కువగా ఆరగించడం వల్ల వంగడానికి శరీరం సహకరించక ఇబ్బందిపడుతున్న విఘ్నేశ్వరుడిని చూసి శివుని శిరసులోని చంద్రుడు వికటంగా నవ్వాడు. ‘రాజదృష్టి సోకితే రాయి అయినా పగులును’ అన్న సామెత నిజమైనట్టు గజాననుడి పొట్టపగిలి అంతకుముందు అతడు తిన్న కుడుములు ఆ ప్రదేశం మొత్తం దొర్లి గణేషుడు చనిపోయాడు. తన పుత్రుని మరణం చూసి తట్టుకోలేని పార్వతి ‘పాపాత్ముడా! నీ దృష్టి వల్ల నా కుమారుడు మరణించాడు. ఇకపై నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక’ అని శపించాడు.

రుషిపత్నులకు నీలాపనిందలు

అదే రోజున సప్తమహర్షులు యజ్ఞం చేస్తున్నారు. వారి భార్యలు అగ్నికి ప్రదక్షిణం చేస్తున్నారు. రుషిపత్నులను చూసి మోహించిన అగ్నిదేవుడు శాపభయంతో క్షీణించసాగాడు. ఇది గ్రహించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి అరుంధతి రూపం తప్ప, తక్కిన ఆరుగురి రుషిపత్నుల రూపాలను ధరించి పతికి సేవ చేయసాగింది. ఇది చూసిన రుషులు తమ భార్యలే అగ్నికి ఉపచారాలు చేస్తున్నారని అనుమానించి వారిని విడిచిపెట్టారు. విషయం తెలుసుకున్న బ్రహ్మదేవుడు ‘ఓ రుషి పుంగవులారా! ఆ రోజు అగ్నిదేవుడిని సేవించిన వాళ్లు మీ భార్యలు కారు’ అని జరిగిందంతా చెప్పి వారిని సమాధానపరిచాడు. మీ పత్నులు చంద్రుడిని చూడటం వల్ల ఇలాంటి అపనిందకు గురయ్యారని తెలిపాడు. దీనికి పరిహారం కోరుతూ బ్రహ్మాది దేవతలు కైలాసానికి వెళ్లి ఉమామహేశ్వరులను వేడుకొన్నారు. మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుణ్ని బతికించారు. చంద్రునికి ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా పార్వతిని కోరారు. ‘భాద్రపద శుద్ధ చవితి మినహా మిగతా రోజుల్లో చంద్రుణ్ని చూసినా ఏ సమస్యా ఉండద’ని పార్వతీదేవి శాపాన్ని సడలించింది. దేవతలంతా సంతోషించి తమ ఇండ్లకు చేరుకుని వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకుండా జాగ్రత్తగా ఉండసాగారు.

వినాయ‌క చ‌వితి

శమంతకమణి కథ

ద్వాపర యుగంలో ఒకనాడు ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుని చూడటానికి దేవర్షి నారదుడు వస్తాడు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటారు. సాయంత్రం కావడంతో ‘ఈ రోజు వినాయక చతుర్థి. చంద్రుణ్ని చూడరాదు. కనుక, తను బయల్దేరుతాన’ని జరిగిన వృత్తాంతం అంతా కృష్ణుడికి తెలిపి స్వర్గానికి వెళ్లిపోతాడు. విషయం తెలుసుకున్న కృష్ణుడు ‘ఈ రోజు చంద్రుణ్ని చూడరాద’ని రాజ్యంలో చాటింపు వేయిస్తాడు. కాసేపయ్యాక కృష్ణుడు గోశాలకు వెళ్లి పాలు పితుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబం చూసి, ‘ఆహా నాకు ఎలాంటి ఆపద రానుందో కదా’ అని
చింతించాడు.

కొన్నాళ్లకు యదువంశ రాజు సత్రాజిత్తు సూర్యుడిని ఉపాసించి శమంతకం అనే పేరు గల అద్భుత మణిని సంపాదిస్తాడు. ద్వారకానగరంలోని శ్రీకృష్ణుణ్ని సందర్శిస్తాడు. అతణ్ని శ్రీకృష్ణుడు సాదరంగా ఆహ్వానించి మర్యాద చేసి, ‘ఈ మణిని మన రాజుకు ఇమ్మని’ అడుగుతాడు. ‘రోజుకు ఎనిమిది బారువుల బంగారమిచ్చే ఈ మణిని తాను ఎవ్వరికీ ఇవ్వనని’ తిరస్కరిస్తాడు సత్రాజిత్తు. ‘సరే నీ ఇష్టం’ అని ఊరుకుంటాడు కృష్ణుడు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో ధరించి అడవికి వేటకు వెళ్తాడు. అక్కడ ఒక సింహం ప్రసేనుడిపై దాడి చేసి మణిని నోట కరుచుకొని వెళ్లిపోతుంది. మణితో పోతున్న సింహాన్ని ఎలుగుబంటి (జాంబవంతుడు) సంహరించి ఆ మణిని తీసుకొని గుహకు వెళ్లి కూతురైన జాంబవతికి ఆట వస్తువుగా ఇస్తుంది.

మరునాడు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విని కోపంతో ‘ఆ రోజు శ్రీకృష్ణుడికి మణి ఇవ్వలేదని, నా తమ్ముడిని చంపి మణిని తస్కరించాడని’ నగరమంతా చాటింపు వేయిస్తాడు. అది విన్న శ్రీకృష్ణుడు బాధపడి ‘అయ్యో ఆ రోజు పాలలో చంద్రుడిని చూసినందుకే కదా ఇటువంటి నీలాపనిందలు’ అని అనుకున్నాడు. ఆ అపవాదు తొలగించుకునేందుకు బంధుసమేతుడై అడవికి వెళ్ళి అంతటా వెతుకుతాడు. ఒకచోట ప్రసేనుని మృతదేహం, ఆ పక్కగా సింహము కాలి జాడలు, కొంత దూరం వెళ్లాక ఎలుగుబంటి పాద ముద్రలు కనిపిస్తాయి. వాటివెంట కొంతదూరం వెళ్లగా ఓ గుహ కనిపిస్తుంది. తన పరివారాన్ని బయటే ఉంచి శ్రీకృష్ణుడు లోపలికి వెళ్తాడు. అక్కడ మణితో ఆడుకుంటున్న జాంబవతిని చూస్తాడు. కృష్ణుడిని చూసిన జాంబవతి కేకలు వేయడంతో జాంబవంతుడు అక్కడికి వస్తాడు. కృష్ణుడితో భీకర యుద్ధం చేస్తాడు. ఇద్దరి మధ్యా 28 రోజులు యుద్ధం కొనసాగుతుంది. క్రమంగా జాంబవంతుడు అలసటకు గురవుతాడు. ‘నా బలాన్ని హరించే శక్తి ఉన్న మహాపురుషుడు శ్రీరాముడు ఒక్కడే!’ అని గుర్తించిన జాంబవంతుడు ‘దేవదేవా! భక్తజన పాలకా! నీవు శ్రీరామచంద్రుడివని నేను గుర్తించాను. త్రేతాయుగంలో నీవు నా మీద ప్రేమతో వరం కోరుకొమ్మని అడుగగా, నేను బుద్ధిమాంద్యంతో మీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నా. ఇంతకాలానికి నా కోరిక తీరింది’ అని కృష్ణుడిని కీర్తించాడు జాంబవంతుడు.

కృష్ణుడు జాంబవంతుడికి జరిగిన వృత్తాంతం అంతా చెప్పి మణిని ఇమ్మని కోరాడు. ‘స్వామీ! ఈ మణితో పాటు నా పుత్రికను కూడా స్వీకరించి నన్ను ధన్యుణ్ని చేయమని’ అభ్యర్థించాడు. దానికి శ్రీకృష్ణుడు అంగీకరించి మణితోపాటు జాంబవతిని కూడా తీసుకుని ద్వారకకు బయల్దేరుతాడు. తర్వాత సత్రాజిత్తుకు జరిగిన వృత్తాంతం అంతా తెలిపి శమంతకమణిని అతడికి ఇచ్చేస్తాడు. కృష్ణుడిని అనుమానించినందుకు క్షమాపణ కోరిన సత్రాజిత్తు పరిహారంగా తన కూతురైన సత్యభామను భార్యగా స్వీకరించమని కోరుతాడు. శుభముహూర్తాన జాంబవతి, సత్యభామలతో శ్రీకృష్ణుడి వివాహం జరుగుతుంది.

ఈ వివాహానికి తరలి వచ్చిన దేవతలు, మునులు శ్రీకృష్ణుణ్ని స్తుతించి ‘స్వామీ! మీరు సమర్థులు కనుక మీ మీద వచ్చిన అపనిందను పోగొట్టుకోగలిగారు. మరి, మాలాంటి సామాన్యుల గతి ఏమని’ ప్రార్థించారు. అప్పుడు శ్రీ కృష్ణుడు ‘ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ శమంతకమణి కథను చదివి, విని అక్షతలు తలపై చల్లుకుంటారో వారికి చంద్రుణ్ని చూసినా ఎలాంటి నిందలు కలుగవ’ని అభయమిచ్చాడు. దాంతో అందరూ సంతోషిస్తారు. నాటి నుంచి ప్రతి సంవత్సరమూ భాద్రపద శుద్ధ చతుర్థినాడు తమ శక్తికి తగ్గట్టుగా గణపతిని పూజించి, తాము సుఖముగా జీవించుచుండిరని సూతుడు శౌనకాది మహామునులకు వినిపించి, అక్కడే ఉన్న ధర్మరాజుతో ‘నువ్వు కూడా ఇదే ప్రకారంగా గణపతిని పూజిస్తే తప్పక నీకు జయం కలుగుతుంది. తిరిగి నీ రాజ్యం నీకు దక్కుతుంది. దీన్ని ఎంతో మంది భక్తితో ఆచరించారు. ఈ వ్రత ప్రభావంతో దమయంతి నలుని, శ్రీకృష్ణుడు జాంబవతిని పొందారు. ఇంద్రుడు వృత్రాసురుణ్ని సంహరించాడు. సకల విజయ ప్రదాత అయిన వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి అందరూ ఈ వ్రతాన్ని యథాశక్తి చేసుకోవాలి’అని చెప్పాడు సూతుడు. అప్పుడు ధర్మరాజు విధి ప్రకారంగా గణపతిని పూజించి సకల ఐశ్వర్యాలనూ, రాజ్యాన్ని పొంది సుఖంగా జీవించాడు.

ఇది శ్రీ స్కాంద పురాణములో భాగమైన ఉమామహేశ్వర

సంవాదంలోని వినాయక వ్రతకల్పం.

ఉద్యాపన: యజ్ఞేన యజ్ఞ మయజంత దేవా / తాని ధర్మాణి ప్రథమాన్యాసన్‌
తేహ నాకం మహిమాన స్సచంతే /యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః
(దేవుని ఈశాన్య దిశగా కొంచెం కదపండి!)

సర్వేజనాస్సుఖినో భవంతు…
ఓం శాంతిః ఓం శాంతిః ఓం శాంతిః
\

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

వినాయ‌క చ‌వితి రోజు మాత్రమే గణపతికి తులసిదళం ఎందుకు సమర్పించాలి?

Ganesh Chaturthi 2021 : గణపతి పూజ ఎలా చేయాలి? కావాల్సిన సామగ్రి ఏంటంటే..

అరుదైన రూపాల్లో వినాయ‌కుడు క‌నిపించే ఆల‌యాలు ఎక్క‌డెక్క‌డ ఉన్నాయి? వాటి విశిష్టతేంటి?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana