HomeZindagiWhy The 3x3 Fitness Rule Should Take Over Your Mornings
బరువు తగ్గాలా 3×3 ఉందిగా!
ఫిట్నెస్ గురూలు వెయిట్‌లాస్ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త సూత్రాలు చెబుతూనే ఉంటారు. కొన్ని పద్ధతుల్ని పాటించి, ఇవి ప్రయోజనకరంగా ఉన్నాయనిపిస్తే వాటిని ప్రచారం చేస్తుంటారు.
ఫిట్నెస్ గురూలు వెయిట్‌లాస్ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త సూత్రాలు చెబుతూనే ఉంటారు. కొన్ని పద్ధతుల్ని పాటించి, ఇవి ప్రయోజనకరంగా ఉన్నాయనిపిస్తే వాటిని ప్రచారం చేస్తుంటారు. ఈ వరుసలో మరో కొత్త ఫిట్నెస్ రూల్ తెరమీదకి వచ్చింది. అదే 3×3. ఉదయం పూట మనం పాటించే మూడు విషయాలు మన బరువును క్రమబద్ధం చేస్తాయని చెబుతుంది ఇది.
3వేల అడుగులు
ఉదయపు నడక మన జీవక్రియను ఉత్తేజపరుస్తుంది. దానివల్ల మనం రోజంతా చురుగ్గా ఉంటాం. ఉదయాన్నే నడక, పెద్దదో చిన్నదో వ్యాయామంలాంటివి రోజులో మన శరీరాన్ని ఉత్సాహంగా ఉంచేందుకు తోడ్పడతాయి. దాని వల్ల ఎప్పుడూ కుర్చీల్లో కూర్చుని ఉండాలన్న భావన కలగదు. కండరాలను బలపరచి, గుండె కొట్టుకునే వేగాన్ని క్రమబద్ధం చేసేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అందుకే ఉదయాన్నే తొట్ట తొలిగా ఓ 3 వేల అడుగులు వేయడం అన్నది మనం బరువు తగ్గేందుకు సాయపడే అంశంగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
3 వంతుల నీరు
దాహం వేసినా వేయకపోయినా శరీర అవసరాలకు సరిపోయేలా నియమిత మోతాదులో నీళ్లు తాగడం చాలా అవసరం. అయితే ఒక రోజులో మనం తీసుకోవాల్సిన నీళ్లలో మూడోవంతును ఉదయంపూట లేదా మధ్యాహ్నంలోపు తీసుకోవడం వల్ల శరీర బరువు క్రమబద్ధీకరణ జరుగుతుందట. శరీరంలో జరిగే ప్రతి క్రియకూ నీళ్లు అవసరం. సరైన మోతాదులో ఇవ్వడం వల్ల ఆహారం చక్కగా జీర్ణమవడంతో పాటు అన్ని పనులు చకచకా జరిగిపోతాయి. కొన్నిసార్లు నీళ్ల కోసం శరీరం పంపే సంకేతాలను, ఆకలిగా భావించే అవకాశమూ ఉంటుందట. తొలిపొద్దులో సమృద్ధిగా నీళ్లను తీసుకోవడం వల్ల ఇలాంటివి జరిగే అవకాశమూ తక్కువ. అంతేకాదు, మగత, తలతిరగడంలాంటి సమస్యలు లేకుండా మెదడు కూడా రోజంతా చురుగ్గా ఉంటుంది.
30 గ్రాముల ప్రొటీన్
ప్రొటీన్ శరీరానికి అత్యావశ్యక పోషకం. కండరాలు, కణజాల నిర్మాణానికి ఇది కీలకం. దీన్ని ఉదయపు అల్పాహారంలో 30 గ్రాములు తీసుకోవడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉండి, తిండి గురించి మెదడు నుంచి వచ్చే సంకేతాలు నియంత్రణలో ఉంటాయి. దానివల్ల అధిక కేలరీలు ఉండే ప్రాసెస్డ్ఫుడ్లాంటి వాటి జోలికి పోము. దీంతో బరువు పెరిగే అవకాశమూ తగ్గుతుంది.