మారుతున్న జీవనశైలి, స్మార్ట్ ఫోన్ల అతివాడకం.. పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపుతున్నది. వాళ్ల జ్ఞాపకశక్తిని హరిస్తున్నది. ఫలితంగా..
చదువులోనూ వెనకబడే ప్రమాదం ఉంటుంది. ఈ విషయంలో సరిగా స్పందించకుంటే.. భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే.. పిల్లల్లో జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
చిన్నారుల ఆసక్తులు, వారి ఇష్టాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వారి ఆలోచనా శక్తిని పెంచేందుకు ప్రయత్నించాలి. కొత్త కొత్త విషయాలను నేర్పించాలి. అప్పుడు వాళ్ల మెదడు కూడా మరింత క్రియాశీలకంగా పనిచేస్తుంది.
ధ్యానం, యోగా చేయడాన్ని చిన్నతనం నుంచే అలవాటు చేయాలి. ఇవి పిల్లల్లో ఏకాగ్రతను పెంచుతాయి. జ్ఞాపకశక్తినీ మెరుగుపరుస్తాయి.
రెండేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లల్లో ఉండే ఆలోచనా పద్ధతిని ‘మ్యాజికల్ థింకింగ్’గా వ్యవహరిస్తారు. వీరు రోజంతా ఏవేవో ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. వారి ప్రశ్నలకు తల్లిదండ్రులు, టీచర్లు.. ఓపికతో సమాధానం చెప్పాలి. ప్రతి విషయాన్నీ ఉదాహరణలతో వివరించాలి.
చిన్నారులతో ఎక్కువ సమయం గడపాలి. అది వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. పేరెంట్స్‌తో గడిపే నాణ్యమైన సమయం.. చిన్నారుల్లో జ్ఞాపకశక్తి పెరగడానికి తోడ్పడుతుంది. వారితో మాట్లాడటం, వారితో కలిసి ఆటలు ఆడటం వల్ల గ్యాడ్జెట్స్‌కు డిస్కనెక్ట్ అవుతారు. తల్లిదండ్రులతో మరింత కనెక్ట్ అవుతారు.
పిల్లలు తమ పాఠాలను అర్థం చేసుకోవడానికి అవసరమైన సమయాన్ని ఇవ్వాలి. ఏదైనా కొత్త విషయం నేర్చుకునేటప్పుడు వారిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. పిల్లల ఉత్సుకతను ప్రోత్సహించాలి. కొత్త విషయాలను నేర్చుకోవడంలో వారిని ఉత్సాహపర్చాలి.
కంటినిండా నిద్ర.. పిల్లల్లో జ్ఞాపకశక్తిని బలోపేతం చేస్తుంది. వాళ్లు ప్రతిరోజూ 8 నుంచి 10 గంటల పాటు నిద్రపోయేలా చూడాలి. అందుకోసం ప్రత్యేక షెడ్యూల్ రూపొందించాలి.
పిల్లల మెదడుకు పదును పెట్టే ఆటలు ఆడించాలి. చెస్ నేర్పించడంతోపాటు పజిల్స్, సుడోకు, ఆప్టికల్ ఇల్యూషన్స్, క్రాస్‌వర్డ్ పజిల్స్, పిక్చర్ పజిల్స్ వంటివి సాల్వ్ చేయనివ్వాలి. దీనివల్ల పిల్లల మెదడు మరింత చురుకుగా మారుతుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.