Vinayaka Chavithi | తొలిపూజలు అందుకునే వినాయకుడు విఘ్నాలను తొలిగించే దేవుడు. విజయాలను ప్రసాదించే దైవం. వినాయకుడి వక్రతుండం ఓంకారానికి ప్రతీక. శూర్పకర్ణుడు అంటే చేటల వంటి చెవులున్న వాడు అని అర్థం. ఏది ఆర్తితో కోరినా శ్రద్ధతో వింటాడన్నమాట. లంబోదరుడు అంటే అందరినీ తన పొట్టలో పెట్టుకుని కాపాడుకునేవాడని భావం. గోరంత భక్తితో పూజించినా కొండంత అనుగ్రహాన్ని వర్షించే ఆకాశమంత దేవుడు గణపతి. వినాయక చవితి సందర్భంగా ఆ దేవదేవుణ్ని మనసారా స్మరించుకుందాం..
శుక్లాంబర ధరం విష్ణుం
శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్న వదనం ధ్యాయేత్
సర్వ విఘ్నోపశాంతయే!
అని గణపతిని ప్రార్థించిన తర్వాతే ఏ శుభకార్యాన్నయినా ఆరంభించడం పరిపాటి. విఘ్నాలు తొలగాలంటే విఘ్నేశ్వరుడిని స్మరించాల్సిందే! భగవంతుడికి భక్తే ప్రధానం. ఖరీదైన సేవలేం అవసరం లేదు. పత్రాలు సమర్పించినా దేవుడు సంతృప్తి చెందుతాడు. అందుకే భగవద్గీతలో ‘పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి’ అని పేర్కొన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఈ నాలుగింటిలో మొదట పేర్కొన్నది పత్రాన్నే! దీనికి నిదర్శనంగా వినాయకుడి పూజలో 21 రకాల పత్రాలు సమర్పిస్తాం.
మాచీ పత్రం, బృహతి (వాకుడు), బిల్వం (మారేడు), దూర్వ (గరిక), దత్తూర (ఉమ్మెత్త), బదరి (రేగు), అపామార్గ (ఉత్తరేణి), తులసి, చూత పత్రం (మామిడి), కరవీరం (గన్నేరు), విష్ణుక్రాంతం (శంఖపుష్ప మొక్క పత్రం), దాడిమి (దానిమ్మ), దేవదారు, మరువకం (దవనం), సింధువార (వావిలి), జాజి పత్రం, గండకి (దేవకాంచన), శమి (జమ్మి), అశ్వత్థ (రావి), అర్జున (తెల్లమద్ది),
అర్క పత్రం (జిల్లేడు) ఇలా 21 రకాల పత్రాలు గణపతికి సమర్పిస్తారు.
ఆధునిక కాలంలో ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయని ఉన్నవాటితో పూజ అయింది అనిపిస్తున్నాం. కానీ, అన్నిటినీ సేకరిస్తే విశేషం. ఈ పత్రాలన్నీ ఔషధ నిధులు. వీటిని వినాయకుడితోపాటు చెరువులో నిమజ్జనం చేయడం ద్వారా నీళ్లు శుద్ధి అవుతాయి.
గజాననం భూత గణాధిసేవితం
కపిత్థ జంబూఫల సార భక్షణమ్
ఉమాసుతం శోక వినాశకారణమ్
నమామి విఘ్నేశ్వర పాద పంకజమ్
శ్లోకం లోక ప్రసిద్ధం. కపిత్థ మంటే వెలగపండు. దీన్ని లక్ష్మీ కటాక్షం కోసం గణపతి హోమాలలో సమర్పిస్తుంటారు. వెలగపండు లేని వినాయక చవితి లేదంటే అతిశయోక్తి కాదు. జంబూఫలం అంటే అల్లనేరేడు పండు. ఈ రెండు ఫలాలూ గణపతికి ప్రీతిపాత్రం. వీటిలోని పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వెలగపండు 21 రకాల బాక్టీరియాలతో పోరాడగలదని, నేరేడు పండు విశేషమైన రోగనిరోధక శక్తిని ప్రసాదిస్తుందని ఆయుర్వేదం చెబుతున్నది. గణపతి ఆరాధనలోని ఆంతర్యం తెలుసుకొని, శ్రద్ధగా స్వామి సేవ చేసుకుందాం. గడ్డిపరక సమర్పించినా మహద్భాగ్యంగా స్వీకరించే దేవుడు ఆయన. ఉండ్రాళ్లకే ఉప్పొంగిపోయే భక్త సులభుడు. వినాయకుడిని స్మరించి, ప్రార్థించి, పూజించి నిరాటంకంగా మన పనులను సఫలం చేసుకుందాం!
నిషు సీద గణపతే గణేషు
త్వామాహుర్విప్రతమం కవీనామ్
న రుతే త్వత్క్రియతే కిం చనారే
మహామర్కం మఘవన్ చిత్రమర్చ॥
(రుగ్వేదం 10-112-9)
‘హే! గణపతీ! నువ్వు అనేకానేక దేవతల సమూహంలో విరాజమానుడవై ఉన్నావు. విద్వత్ జనులు నిన్ను బుద్ధి శాలురందరిలో శ్రేష్ఠునిగా నిర్వచిస్తున్నారు. చిన్నదైనా, ఎంత పెద్దదైనా, సమీపంలోనిదైనా, ఎంతో దూరాన కష్టతరమైనదైనా నీ అనుగ్రహం లేక ఏ కార్యాన్నీ.. ఎవరూ జయప్రదంగా పూర్తి చేయలేరు. మేం చేసే సత్కార్యాలన్నీ నిర్విఘ్నంగా పరిపూర్ణం అయ్యేలా కరుణించు’ అని పై మంత్రానికి అర్థం.
‘గణపతి అధర్వశీర్ష ఉపనిషత్’ వినాయకుడికి హృదయం లాంటిది. గణేశ అర్చనలో అనేక సందర్భాలలో దీనిని పఠిస్తుంటారు. విభిన్న నామాలతో విఘ్నేశ్వరుడికి నమస్కారాలు ఇందులో పేర్కొన్నారు. శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదీయ మైత్రాయణీ సంహిత, కణ్వ సంహితలలో‘గణపతయే స్వాహా’ అని, ‘గణానాం త్వా..’ మంత్రం గణపతి హోమాల్లో వినియోగించడం కనిపిస్తుంది. ఇలా మంత్ర స్వరూపుడైన వినాయకుడి ఆరాధనలో వివిధ వేద మంత్రాలు అనునిత్యం వినిపిస్తూ ఉంటాయి.
యోగసాధనంతా ఆధ్యాత్మిక విజయం కోసమే! ఆరోగ్యమనేది యోగ వల్ల కలిగే తాత్కాలిక ప్రయోజనం మాత్రమే. యోగ సాధకుల అంతిమ లక్ష్యం మోక్షమే కావాలి అంటుంది శాస్త్రం. అది సాధ్యం కావాలంటే మానవ శరీరంలోని షట్చక్రాలూ ఉత్తేజితం అవ్వాలి. అప్పుడే శిరస్సుపై ఉండే సహస్రారం ఉత్తేజితమై మోక్షానికి చేరువ అవుతారు. అయితే, ఏ క్రతువు చేసినా తొలిపూజ గణపతికే చెందుతుంది. అలాగే ఈ యోగసాధన సైతం గణపతి అధిష్ఠానంగా భావించే మూలాధార చక్రంతోనే మొదలవుతుందని యాజ్ఞవల్క్య స్మృతి చెబుతున్నది.
‘త్వం మూలాధారే స్థితోసి నిత్యమ్.. త్వం యోగినో ధ్యాయంతి నిత్యమ్’ అంటుంది గణపతి అధర్వశీర్షం. మానవ శరీరంలోని మూలాధార స్థానంలో ఉండే దైవానివి నీవే… యోగులందరూ ఎప్పుడూ నిన్నే ధ్యానిస్తూ ఉంటారని భావం. యోగశాస్త్రంలో గణపతిని మూలాధార చక్రానికి అధిష్ఠాన దేవతగా భావిస్తారు. మూలాధారం ఉత్తేజితమైనప్పుడు అక్కడినుంచి పైకి ఉండే సుషుమ్న మేల్కొంటుంది. తద్వారా సాధన క్రమంలో మిగతా ఐదు చక్రాలూ ఉత్తేజితం అవుతాయి. సుషుమ్నకు ఇరుపక్కల ఉండే ఇడ, పింగళ నాడులు ప్రధానమైనవి. ‘ఇడ’ బుద్ధికి, ‘పింగళ’ సిద్ధికి సంకేతంగా భావిస్తారు. సుషుమ్న ఎప్పుడూ ఈ రెండు నాడులతోనే కలిసి ఉంటుంది. మూలాధారం గణపతి అయితే, ఇడ, పింగళ… సిద్ధి, బుద్ధి అన్నమాట. యోగసాధనతో శరీరం, మనసు పవిత్రం అయినప్పుడు బుద్ధి వికసిస్తుంది. ఫలితంగా సిద్ధి కలుగుతుంది.
– డా॥ వెలుదండ సత్యనారాయణ