గొప్పగా చదువుకొని ఉన్నతమైన ఉద్యోగం చేయాలని ఎవరికి మాత్రం ఉండదు. ఆ మహిళ కూడా అలాగే ఆశపడింది. కానీ పెండ్ల్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతలు అమె ఆశయాలకు అడ్డుకట్ట వేశాయి. వరుస కష్టాలు ఆమెను కుంగదీశాయి. అలాంటి సమయంలోనే ఒక సమావేశం ఆమెలో మార్పును తీసుకొచ్చింది. సమాజానికి తన వంతుగా కృషి చేయాలని నడుం బిగించింది. తన బిడ్డల భవిష్యత్తు కోసం పారిశుధ్యకార్మికురాలిగా పనిచేస్తూనే, బస్తీలోని చిన్నారులకు ఉచితంగా ట్యూషన్లు చెబుతున్నది ఒంకొళ్ల స్రవంతి. ‘పే బ్యాక్ టు ద సొసైటీ’ అంటూ టీచర్ అవతార మెత్తి సికింద్రాబాద్‌లోని బోలక్పూర్ బస్తీ పిల్లలకు పాఠాలు బోధిస్తున్న స్రవంతి
సంగతులు ఆమె మాటల్లోనే..
చదువుకు వయసుతో సంబంధం లేదని నా అభిప్రాయం. అందుకే
గతేడాది అంబేద్కర్ దూరవిద్యా కేంద్రంలో పీజీలో చేరాను. ఆర్థిక స్తోమత లేకున్నా నా పిల్లలను చదివించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నా. ‘ఎన్ని కష్టాలొచ్చినా చదువు మాత్రం ఆపొద్దు, ఎవరిమీద ఆధారపడి జీవించొద్ద’ని నా పిల్లలకు తరచూ చెబుతుంటా. ప్రస్తుతం నా ఇద్దరు కూతుళ్లు కష్టపడి చదివి ప్రభుత్వ గురుకులాల్లో సీట్లు సంపాదించారు. పైసా పెట్టకుండా ఉచితంగా చదువుకుంటున్నారు. నాదేమో కాంట్రాక్ట్ ఉద్యోగం. పనికి వెళ్లిన రోజే జీతం అన్నట్లు ఉంటుంది.
నేను పుట్టింది, పెరిగింది జనగామ జిల్లాలోని వడ్లకొండ గ్రామం. పదో తరగతి వరకు సొంతూర్లోనే చదువుకున్నాను. తర్వాత పై చదువులు జనగామలో పూర్తిచేశాను. డిగ్రీ (బీఏ) రెండో సంవత్సరం చదువుతుండగానే 2006లో హైదరాబాద్‌కు చెందిన మా బంధువుల అబ్బాయితో నా పెండ్లి జరిగింది. మావారి సహకారంతో డిగ్రీ పూర్తిచేశాను. ఆ తరువాత ఇద్దరు ఆడపిల్లలకు జన్మనివ్వడంతో గృహిణిగా స్థిరపడ్డాను. కుటుంబ బాధ్యతల్లో పడి అసలు నేను చదువుకున్నాననే విషయాన్నే మరిచిపోయాను. ఉద్యోగం చేయాలనే ద్యాస కూడా లేకుండా పోయింది. పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న మా అత్తమ్మ అనారోగ్యానికి గురికావడంతో 2015లో ఆమె కొలువులో నేను చేరాను. కొన్ని రోజులకే మా అత్తయ్య చనిపోయింది. వెల్డింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న మా ఆయన 2016లో గుండెపోటుతో నిద్రలోనే మరణించాడు. ఈ రెండు మరణాలు నన్ను తీవ్రంగా కలిచివేశాయి. నా ఇద్దరు కూతుర్ల కోసం దుఃఖాన్ని దిగమింగాను. నేను ఎలాగో చదువుకు తగ్గ ఉద్యోగం చేయడం లేదని, కనీసం నా బిడ్డలైనా ఉన్నతంగా చదువుకొని గొప్ప ఉద్యోగాలు చేయాలని పారిశుధ్య కార్మికురాలిగానే జీవనం కొనసాగించాను.
నలుగురితో ప్రారంభించా
2023లో మా బస్తీలో ఉన్నవాళ్లు నన్ను ఓ మీటింగ్‌కు తీసుకెళ్లారు. భువనగిరి జిల్లాలోని టేకుల సోమారం గ్రామంలో మహిళలతో ఆ సమావేశం జరిగింది. మహిళలు చదువుకోవాల్సిన ఆవశ్యకత, పుట్టినందుకు ఈ సమాజానికి మనం చేయాల్సిన మేలు, స్త్రీ స్వేచ్ఛ లాంటి సామాజిక అంశాల గురించి అక్కడ చర్చించారు. అక్కడికొచ్చిన వారిలో ఎంతమందిని ఆ మాటలు ప్రభావితం చేశాయో నాకు తెలియదు కానీ, నన్ను మాత్రం తట్టిలేపాయి. జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుందని తెలిసొచ్చింది. సమావేశానికి వెళ్లేటప్పుడు ఎంత అయిష్టంతో, నీరసంతో వెళ్లానో.. అంత ఉత్సాహంతో అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యాను. నావంతుగా ఈ సమాజానికి ఏదైనా చేయాలని మమ్మల్ని తీసుకెళ్లిన రాజేష్ అన్నతో నా ఆలోచన పంచుకున్నా.
అలా మొదలైందే ఈ ట్యూషన్ ఐడియా. ఆ సమావేశానికి వెళ్లొచ్చిన వారం రోజుల వ్యవధిలోనే మార్చి 1న నలుగురు పిల్లలతో ట్యూషన్ ప్రారంభించాను. మా ఇంటిముందు నుంచి వెళ్లే చిన్నారులను ట్యూషన్‌కు పిలిచేదాన్ని. నా మాటలు విని పిల్లలు ట్యూషన్‌కు రావడం ప్రారంభించారు. అలా నలుగురి నుంచి 20 మందికి చేరారు. ఇంటి ముందు స్థలం సరిపోవడం లేదని భావించి మా బస్తీలోని బాబూ జగ్జీవన్‌రామ్ భవనంలో ట్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాను. నాకు తోడుగా ఇంటిపక్కన ఉండే వాసవి అనే గృహిణి కూడా వచ్చి పిల్లలకు ట్యూషన్ చెప్పడం ప్రారంభించింది. మా ట్యూషన్ ప్రభావం వల్ల పిల్లలు మంచి మార్కులు తెచ్చుకున్నారు. ఆ సంతోషంలో మొదటి వార్షికోత్సవంకూడా నిర్వహించుకున్నాం.

Teching
రాజ్యాంగ పీఠిక చదివిస్తాం
పిల్లల సంఖ్య నలభైకి చేరడంతో గతేడాది డిసెంబర్లో ఒక గదిని అద్దెకు తీసుకున్నాం. ఆ సందర్భంలోనే తమవంతు సహకారం అందిస్తామని ఒక ఐదుగురు ఉద్యోగులు ముందుకొచ్చారు. పిల్లలకు బెంచీలు ఇప్పించడంతో పాటు ప్రతినెలా ఆ గది అద్దె చెల్లిస్తున్నారు. శాంతికి ప్రతిరూపం బుద్ధుడు కాబట్టి ఆయన జన్మస్థలం పేరిట మా సెంటర్‌కు ‘లుంబినీ నాలెడ్జ్ సెంటర్’గా పేరు పెట్టుకున్నాం. ఈ సెంటర్‌కు అంగన్వాడీ నుంచి ఆరో తరగతి విద్యార్థుల వరకు వస్తుంటారు. ఈ పిల్లల తల్లిదండ్రుల్లో చాలామంది రోజు కూలీలే! నాతో పాటు ఇద్దరు మహిళలు కూడా పాఠాలు బోధిస్తున్నారు. పిల్లలకు ఆటలు కూడా నేర్పిస్తున్నాం. విద్యార్థులతో ప్రతిరోజూ మెడిటేషన్ చేయిస్తాం. భారత రాజ్యంగ ప్రవేశిక అందరితో చదివిస్తాం. నేను తెలుగు, హిందీ బోధిస్తుంటాను. మిగతా టీచర్లు ఇతర సబ్జెక్టులు చెబుతారు. హోమ్ వర్క్ చేయించడంతో పాటు ప్రతి శనివారం టెస్ట్ నిర్వహిస్తాం. పండుగలప్పుడు, ఆదివారాల్లో కూడా మా ట్యూషన్ సెంటర్‌కు సెలవు ఉండదు.
నేను సక్సెస్ అయినట్లే
ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటలకు నిద్రలేచి ఐదు గంటలకల్లా ఇంటిపనులు ముగించుకుంటాను. ఐదు గంటలకు పారిశుధ్య పనిలోకి వెళ్లి తిరిగి మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటికొస్తాను. ఇక సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఏడింటి వరకు ట్యూషన్ సెంటర్లో ఆ చిన్నారులతోనే గడుపుతాను. రాత్రుళ్లు అలస్యమైనా సరే వాళ్లు అడిగిన సందేహాలు తీర్చే ఇంటికి వస్తాను. పిల్లలకు జ్ఞానం పంచాలంటే ముందుగా మనం సాధన చేయాలి. అందుకోసం పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకున్నాను. సావిత్రీబాయి పూలే, జ్యోతిరావు పూలే, అంబేద్కర్ లాంటి మహనీయుల పుస్తకాలను చదివేందుకు ఇష్టపడతాను. ఒకరోజును ఎలా సద్వినియోగం చేసుకోవాలో అంబేద్కర్ దినచర్య పుస్తకం చదివాకే తెలిసింది. గతేడాది జనవరి 26న ఓ కార్యక్రమం నిర్వహించాం. పిల్లలు తమకిష్టమైన వేశధారణల్లో వచ్చారు. ఒకరు లాయర్‌గా, మరొకరు డాక్టర్‌గా, ఇంకొకరు ఐఏఎస్‌గా.. ఇలా వారికి నచ్చినట్లు వచ్చారు. భవిష్యత్తులో వాళ్లేం కావాలనుకుంటున్నారో అలా వచ్చారు. వీరిలో ఒక్కరైనా ఆ స్థాయికి వెళ్లగలిగితే నేను విజయం సాధించినట్లే.
…? రాజు పిల్లనగోయిన
గడసంతల శ్రీనివాస్