ఫుడ్ సైన్స్
తరచూ వర్షాలు పడుతూ ఉండటం వల్ల చుట్టూ తేమ వాతావరణం ఏర్పడుతున్నది.ఈ పరిస్థితుల్లో మనం మాటిమాటికీ జలుబు, జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో తెలుపగలరు?
వర్షంతో పాటు రకరకాల జబ్బులు సులభంగా వచ్చేస్తుంటాయి. వైరల్ ఫీవర్లు, మలేరియా, డెంగ్యూలాంటివి ఈ సమయంలో మనల్ని చుట్టు ముడతాయి. కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కలరా, టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంటరైటిస్, వాంతులు, విరేచనాల్లాంటివి తొందరగా వచ్చే అవకాశాలుంటాయి. అందుకే వానాకాలంలో పరిశుభ్రత చాలా ముఖ్యం. కూరగాయల్ని ట్యాప్‌కింద శుభ్రపరచడం, వెనిగర్, పసుపు, ఉప్పు లాంటివి వేసి కడగడంలాంటివి చేయాలి. శుభ్రమైన నీళ్లు తీసుకోవాలి. మున్సిపల్ ట్యాప్ నీళ్లయితే కాచి చల్లార్చి తాగాలి. తరచూ చేతులు కడుక్కోవడం, ఇంటి చుట్టూ పరిశుభ్రంగా, నీరు నిల్వ లేకుండా చూసుకోవడం చేయాలి. నూనెలో వేయించిన పదార్థాలు, స్ట్రీట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. కొందరు వండినవి రెండు మూడు రోజుల పాటు తింటారు.
ఎంత ఫ్రిజ్‌లో పెట్టినా సరే వానాకాలంలో అలాంటి ఆహారం వద్దు. పండ్లు కూడా తరిగిన వెంటనే తినాలి. విటమిన్-సి, యాంటి ఆక్సిడెంట్లు ఉన్న ఫుడ్స్, పండ్లు, కూరలు ఆహారంలో భాగం చేసుకోవాలి. ప్రొ బయాటిక్ ఫుడ్ తీసుకుంటే మంచిది. పెరుగు, ఇడ్లీ, దోశ, ఫెర్మెంటెడ్ వెజిటబుల్స్, కంబూచాలాంటి పులియబెట్టిన టీలు ఈ కోవలోకి వస్తాయి. ఇవి పొట్టకు బలం. ఏకాలమైనా సరే మన శరీరాన్ని ఎంత చురుగ్గా ఉంచుకుంటే అంత బాగుంటాం. వానల్లో వాకింగ్‌కి బయటికెళ్లలేం అనుకుంటే ఇంట్లోనే అటూ ఇటూ కాసేపు నడవచ్చు. సూర్యనమస్కారాలు, శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయాలి. సరళమైన యోగా, ప్రాణాయామం లాంటివి చాలా మేలు చేస్తాయి.
వర్షాకాలంలో బయట చల్లగా ఉంటుంది కాబట్టి వేడివేడిగా ఏదో ఒకటి తినాలనుకుంటాం. ముఖ్యంగా సెగలుకక్కే బజ్జీలు, పకోడీల్లాంటివి తరచూ తింటుంటాం. టీలు కూడా ఎక్కువగానే తాగుతాం. దానికి బదులు వేడి సూప్‌లు, రసం, వేడి మక్కజొన్న కంకి, ఉడకబెట్టిన పెసలు, పల్లీలు, శనగల్లాంటి గుగ్లిళ్లు తీసుకోవచ్చు. తెలంగాణ వంటకం సర్వపిండి కూడా కరకరలాడుతూ బాగుంటుంది. గుంత పొంగణాలు, షాలో ప్రై చేసిన కూరగాయలు, సోయా టిక్కీ, చపాతీలతో చేసిన చికెన్ ర్యాప్, పనీర్ ర్యాప్లలాంటివి కూడా ఈ సీజన్లో తినొచ్చు. మామూలు టీ కాకుండా అల్లం, ఇలాచీల్లాంటివి నీళ్లలో మరిగించి తీసుకోవచ్చు. ఇలా మన జిహ్వ చాపల్యాన్ని ఆరోగ్యంగా తీర్చుకుంటూ వానాకాలాన్ని దాటేస్తే అంతా ఆనందమే!
-మయూరి ఆవుల
న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@
gmail.com