ఇప్పుడు ఏదైనా క్షణాల్లో పూర్తవ్వాల్సిందే! చేసే పని అయినా.. తినే ఆహారమైనా!? అందుకే, చాలామంది ఇన్స్టంట్ ఫుడ్‌కు అలవాటు పడిపోతున్నారు. అందులో ఆరోగ్యంపై శ్రద్ధ చూపేవారు ఓట్స్, మ్యూజ్లీ లాంటివి ఎంచుకుంటున్నారు. వీటిని కొంచెం పాలలో గానీ, పెరుగులో గానీ వేసుకొని.. కొన్ని పండ్లను జోడిస్తే చాలు.. క్షణాల్లో పోషకాలతో కూడిన అల్పాహారం సిద్ధమై పోతుంది. అయితే, ఈ రెండింటి మధ్య తేడాలు, ఏది తింటే ఆరోగ్యానికి మంచిది? అనే విషయాలపై కొందరిలో అవగాహన తక్కువ. ఈ క్రమంలో ఓట్స్, మ్యూజ్లీ మధ్య తేడాలేంటో తెలుసుకుందామా?
ఇవి అవెనా సాటివా అనే మొక్క విత్తనాలు. 100% తృణధాన్యాలు. రోల్డ్ ఓట్స్, ఇన్స్టంట్ ఓట్స్, స్టీల్ కట్ ఓట్స్ వంటి వివిధ రకాల్లో ఇవి లభిస్తాయి. ఓట్స్‌లో ఫైబర్, ప్రొటీన్‌తోపాటు ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటితో రకరకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు. ఓవర్‌నైట్ ఓట్స్, ఓట్ మీల్, స్మూతీలు, ఓట్ కేక్‌లు, ఓట్ జావా లాంటివే కాకుండా.. ఓట్స్‌తో దోస, ఇడ్లీ, ఉప్మా లాంటి భారతీయ అల్పాహారాలనూ సిద్ధం చేసుకోవచ్చు. ప్రతి 100 గ్రాముల ఓట్స్ నుంచి 66 గ్రా. కార్బోహైడ్రేట్లు; 13 గ్రా. ప్రొటీన్; 11 గ్రా. ఫైబర్; 7 గ్రా. కొవ్వు లభిస్తుంది.
రోల్డ్ ఓట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, గింజలు, ఇతర ధాన్యాల మిశ్రమంతో తయారైనదే.. మ్యూజ్లీ. దీనిని ఎక్కువగా వేడిపాలతో కలిపి బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటారు. ఇవి వివిధ రకాల ఫ్లేవర్లలో అందుబాటులో ఉన్నాయి.
వెరైటీలను బట్టి ప్రతి 100 గ్రా. మ్యూజ్లీలో.. 60-70 గ్రా. కార్బోహైడ్రేట్లు; 10-20 గ్రా. చక్కెర; 8-12 గ్రా. ప్రొటీన్; 7-9 గ్రా. ఫైబర్; 7-15 గ్రా. కొవ్వు; 2-4 మి.గ్రా. ఐరన్; 50-100 మి.గ్రా. క్యాల్షియం; 100-150 మి.గ్రా. మెగ్నీషియం లభిస్తుంది.