1989లో వచ్చిన ‘మైనే ప్యార్‌కియా’ సినిమా.. బాలీవుడ్లో కల్ట్ క్లాసిక్ హిట్‌గా నిలిచింది. హీరో సల్మాన్ ఖాన్‌తోపాటు హీరోయిన్గా చేసిన భాగ్యశ్రీని ఓవర్‌నైట్ స్టార్లుగా మార్చేసింది. దాదాపు అన్ని భారతీయ భాషలలోకి అనువాదమై.. అక్కడా బాక్సాఫీస్‌లను కొల్లగొట్టింది. అయితే, ఈ సినిమాలో మరో విశేషం కూడా ఉన్నదని సీనియర్ నటి భాగ్యశ్రీ చెప్పుకొచ్చింది. ‘మైనే ప్యార్ కియా’ షూటింగ్‌లోనే సల్మాన్ ఖాన్ రియల్ క్యారెక్టర్ ఏంటో తనకు తెలిసిందని వెల్లడించింది.
తన ఐకానిక్ అరంగేట్రంతో రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా కీర్తిని సంపాదించుకున్న భాగ్యశ్రీ.. ఆ సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను ఇటీవల మీడియాతో పంచుకున్నది. ‘షూటింగ్ సమయంలో పబ్లిసిటీ షూట్ చేయడానికి ఒక ఫొటోగ్రాఫర్ వచ్చాడు. హాట్, సిజ్లింగ్ ఫొటోలు కావాలని చెప్పాడు. నాకు తెలియకుండానే నన్ను ముద్దు పెట్టుకోవాలని సల్మాన్‌కి సూచించాడు. షాట్ సందర్భంగా నన్ను ఎలా పట్టుకోవాలో, ఎలా ఉండాలో చెప్పాడు. నిజానికి అప్పుడు వారిద్దరూ నన్ను చూడలేదు.
కానీ, వారి మాటలతో నాలో తెలియని భయం మొదలైంది’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే, ఆ ఫొటోగ్రాఫర్ సూచనతో సల్మాన్ ఖాన్ ఏకీభవించలేదట. వెంటనే ‘ఇందుకు భాగ్యశ్రీ అనుమతి ఇచ్చిందా?’ అని అడిగాడట. ‘ముందు ఆమె అనుమతి తీసుకోవాలి. ఆమె సరేనని చెబితే.. అప్పుడు మాత్రమే నేను చేస్తాను’ అని చెప్పాడట. ఇంకా భాగ్యశ్రీ మాట్లాడుతూ.. ‘అప్పట్లో ఇలాంటి ఫొటోషూట్స్ కోసం హీరోయిన్ల అనుమతి తీసుకోవడం అనేది లేదు. అయినా.. సల్మాన్ ఉన్నతంగా ఆలోచించాడు. నా గౌరవాన్ని కాపాడాడు.
నిజంగా, అతనో రియల్ హీరో! జెంటిల్మన్ కూడా!’ అంటూ బాలీవుడ్ కండల వీరుణ్ని ఆకాశానికి ఎత్తేసింది. తొలి చిత్రంతోనే సక్సెస్ఫుల్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సల్మాన్-భాగ్యశ్రీ.. ఆ తర్వాత మంచి మిత్రులుగా కొనసాగారు. భాగ్యశ్రీ వివాహానికి హాజరైన కొద్దిమందిలో సల్మాన్ కూడా ఒకరు. తన పెళ్లికి తనవైపు సల్మాన్‌ఖాన్ మాత్రమే హాజరైనట్లు ఒక సందర్భంలో భాగ్యశ్రీ చెప్పింది కూడా!