విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్‌ను చాలా మిస్ అవుతున్నట్లు చెబుతున్నది బాలీవుడ్ నటి కొంకణాసేన్ శర్మ. ‘మెట్రో.. ఇన్ దినో’ షూటింగ్ సమయంలో ఇర్ఫాన్ ఎంతగానో గుర్తుకొచ్చాడంటూ చెప్పుకొచ్చింది. అనురాగ్ బసు దర్శకత్వంలో వస్తున్న మ్యూజికల్ చిత్రం ‘మెట్రో.. ఇన్ దినో’లోని మొదటి పాటను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా కొంకణాసేన్ మాట్లాడుతూ.. బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నది. ‘ఇర్ఫాన్‌ను మర్చిపోవడానికి ఓ జీవితం పడుతుంది’ అంటూ కన్నీటి పర్యంతమైంది. 2007లో అనురాగ్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ కామెడీ చిత్రం.. ‘లైఫ్ ఇన్ ఎ మెట్రో’. ఇందులో ఇర్ఫాన్ ఖాన్, కొంకణాసేన్ శర్మ జంటగా నటించారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గానే ‘మెట్రో.. ఇన్ దినో’ వస్తున్నది. మొదటి భాగంలో ఇర్ఫాన్ – కొంకణా జంటతోపాటు ధర్మేంద్ర, కంగనా రనౌత్, శర్మన్ జోషీ, శిల్పాశెట్టి, సారా అలీఖాన్, కేకే మేనన్ లాంటి అగ్రతారలు నటించారు.
వీరిలో రెండోభాగంలో నటిస్తున్నది కొంకణాసేన్ మాత్రమే! “మెట్రో.. ఇన్ దినో’లో ఓ సన్నివేశాన్ని చిత్రీకరించేటప్పుడు అసంకల్పితంగానే నా కళ్లనుంచి నీళ్లు కారిపోయాయి. ఆ సీన్‌కు ప్రీక్వెల్లోని ఓ సన్నివేశానికి లింక్ ఉంటుంది. పాత సీన్లో నేను, ఇర్ఫాన్ కలిసి నటించాం. అందుకే.. ఆయనే పదేపదే గుర్తుకొచ్చారు. ఇర్ఫాన్‌ను చాలా మిస్ అవుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. బాలీవుడ్ సీనియర్ దర్శకురాలు, నటి అపర్ణా సేన్ వారసులిగా ఇండస్ట్రీలోకి వచ్చింది కొంకణా సేన్. బెంగాలీ, హిందీతోపాటు హాలీవుడ్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది. టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్‌ల్లోనూ నటించింది. దర్శకురాలిగానూ ప్రతిభ చాటుకున్నది.
రెండు జాతీయ చలనచిత్ర అవార్డులతోపాటు నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకుంది. ఇక ఇర్ఫాన్ ఖాన్ విషయానికి వస్తే.. సహజత్వం ఉట్టిపడేలా, వైవిధ్య భరితమైన పాత్రలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేశాడు. ‘సలామ్ బాంబే’తో పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఇర్ఫాన్.. బాలీవుడ్‌తోపాటు
హాలీవుడ్‌లోనూ సత్తా చాటాడు. స్లమ్‌డాగ్ మిలియనీర్, ఎ మైటీ హార్ట్, జురాసిక్ వరల్డ్, లైఫ్ ఆఫ్ పై లాంటి సినిమాలతో మంచిపేరు సంపాదించుకున్నాడు. మహేశ్‌బాబు హీరోగా వచ్చిన ‘సైనికుడు’తో టాలీవుడ్‌కూ పరిచయమయ్యాడు. విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఇర్ఫాన్.. క్యాన్సర్,
పెద్దపేగు ఇన్ఫెక్షన్ కారణంగా 2020లో మృతిచెందాడు.