దీపావళి వచ్చిందంటే వాకిట్లో వెలుగులే కాదు, నట్టింట్లో బొమ్మల కొలువులూ వెలుస్తాయి. రంగురంగుల్లో చూడచక్కని రూపాల్లో ఆకట్టుకునే ప్రతిమలు, కాంతుల్ని విరజిమ్ముతూ ఇంటికే కళ తెచ్చే దివ్వెలు… వేటికవే సాటి. అయితే ఈ రెంటినీ ఒక్కచోట చేర్చేలా ‘ఇండియన్ కపుల్ టీ లైట్ హోల్డర్లు, దియా’లు రూపొందుతున్నాయి. కొలువులో పెట్టుకునే అవ్వ తాతల జంట మనకు సుపరిచితమే. అచ్చం అలాగే అందమైన స్త్రీ పురుషుల జంటను బొమ్మల్లో చొప్పించి, ఆ బొమ్మ పైనే దీపం వెలిగించుకునేలా రూపొందుతున్నాయివి. మట్టితో చేసిన ఈ బొమ్మలను అందమైన రంగుల పెయింటింగులతో అలంకరిస్తున్నారు. అద్దాలు, కుందన్లు, పూసలనూ వాటికి అద్దుతున్నారు. ఊరికే చూసినా భలే ముచ్చటగా ఉన్నాయే అనిపించేట్టు ఉండే ఈ బొమ్మలు, దీపకాంతులు తోడయ్యాక మరింత దేదీప్యమానంగా కనిపిస్తాయి. వీటిలో కొన్నింటిలో దీపం నేరుగా వెలిగించుకునే వెసులుబాటు ఉంటే, మరి కొన్నింటిలో కొవ్వొత్తిని పెట్టుకునే ఏర్పాటు ఉంటుంది. ఏదేమైనా ఈ దీపావళికి జంట
వెలుగులు ఇంట పూయాలంటే వెంటనే వీటిని వెంట తెచ్చుకోవాల్సిందే… ఏమంటారు?!