కరివేపాకు.. కూరలో పడితే నేచురల్ ఫ్లేవర్ వస్తుంది. సాంబారులో వేస్తే… అదిరిపోతుంది. పొడిగా చేసుకుంటే.. పడిపడి తినేయొచ్చు. ఆయుర్వేదంలోనూ కరివేపాకు విశేషంగా వాడుతుంటారు. ఎన్నో అనారోగ్య సమస్యలకు ఇది చెక్ పెడుతుంది. ఆరోగ్యాన్ని అందించడం మాత్రమే కాదు.. అందాన్ని రెట్టింపు చేయడంలోనూ కరివేపాకు ఎంతో సాయపడుతుంది.
కరివేపాకులోని యాంటి ఆక్సిడెంట్లు, యాంటి బ్యాక్టీరియల్, యాంటి ఫంగల్ లక్షణాలు.. మచ్చల్లేని, కాంతిమంతమైన చర్మాన్ని అందిస్తాయి. మెరుస్తున్న చర్మం సొంతం కావాలంటే.. కరివేపాకు ఫేస్‌ప్యాక్స్ ట్రై చేయొచ్చు. కరివేపాకులను నీటిలో ఉడకబెట్టి.. చల్లారాక మిక్సీలో వేసి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమానికి ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి.. ముఖం, మెడ, చేతులపై రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే.. ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గుతాయి.
కరివేపాకు నీటితోనూ ముఖ సౌందర్యాన్ని మెరుగు పరుచుకోవచ్చు. కొన్ని కరివేపాకులను నీటిలో ఉడక బెట్టాలి. చల్లారాక.. ఆ నీటితో తరచూ ముఖాన్ని కడుక్కుంటే.. ఫేస్ రోజంతా ఫ్రెష్‌గా ఉంటుంది. ఈ నీటిని టోనర్‌గానూ ఉపయోగించవచ్చు.
కరివేపాకును ఉడకబెట్టి.. పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో రెండుమూడు చుక్కల నిమ్మరసం వేసి ఫేస్‌ప్యాక్‌లా వేసుకోవాలి. బాగా ఆరిపోయిన తర్వాత కడిగేసుకుంటే.. చర్మం నిగారిస్తుంది. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. ముఖవర్చస్సు పెరుగుతుంది.
జుట్టు రాలడం తగ్గాలన్నా.. వెంట్రుకలు ఒత్తుగా పెరగాలన్నా కరివేపాకును ఆశ్రయించాల్సిందే! ఇందులోని ఔషధ గుణాలు.. జుట్టు సంరక్షణలో కీలకంగా పనిచేస్తాయి. కరివేపాకును ఎండబెట్టి, పొడిచేసి.. మామూలు కొబ్బరినూనెలో కలుపుకోవాలి. ఈ నూనెను వారానికి రెండుసార్లు కుదుళ్లకు బాగా పట్టిస్తే.. జుట్టు సమస్యలు దూరం అవుతాయి.