కొందరికి రాత్రిపూట నిద్రలోనే కాళ్లు పట్టేస్తుంటాయి. భరించలేని నొప్పిని కలగజేస్తాయి. ముఖ్యంగా మహిళల్లో ఇలాంటి సమస్యలు తరచుగా కనిపిస్తుంటాయి. ఈ సమస్య రావడానికి గల కారణాలను ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు.
నిద్రలో కాళ్లు పట్టేయడానికి ‘డీహైడ్రేషన్’ ఓ కారణం. శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత వల్ల కండరాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. దీనివల్ల తిమ్మిర్లు, కాళ్లు పట్టేయడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. మానసిక ఒత్తిడి కూడా.. కండరాల నొప్పిని కలిగిస్తుంది. శారీరక శ్రమ ఎక్కువైనా, వ్యాయామం చేసినా.. కండరాలు అలసిపోయి రాత్రిళ్లు కాళ్లు పట్టేస్తాయి. ముఖ్యంగా.. గర్భిణులలో ఈ లెగ్ క్రాంప్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. మూడో నెల నుంచి ఆరో నెల మధ్యలో.. చీటికీమాటికీ కాళ్లు పట్టేసి ఇబ్బంది కలిగిస్తుంటాయి. మధుమేహం, మూత్రపిండాల సమస్యలు, థైరాయిడ్, నరాల రుగత్మలు కూడా లెగ్ క్రాంప్స్ రావడానికి కారణం అవుతాయి.
నివారణ చర్యలు
డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు తగినంత నీటిని తీసుకోవాలి. పడుకునేముందు కాసేపు కాళ్లను స్ట్రెచ్ చేయాలి. దీనివల్ల కండరాలు స్వేచ్ఛగా కదులుతాయి. లెగ్ క్రాంప్స్తోపాటు కండరాల నొప్పులు కూడా దూరమవుతాయి.నిద్రలో కాళ్లు పట్టేస్తే.. కాలిని సాగదీసి ఉంచాలి. కొంతసేపు నిల్చున్నా.. నొప్పి తగ్గుతుంది. లెగ్ క్రాంప్స్ నిత్యం వేధిస్తుంటే.. హీట్ ప్యాడ్స్ వాడటం మంచిది. ఇక వేడి నీటి స్నానం కూడా లెగ్ క్రాంప్స్ను తరిమేస్తుంది. వేడినీళ్ల వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. ఎక్కువగా నొప్పి పుట్టే ప్రాంతంలో మసాజ్ చేసుకున్నా.. ఉపశమనం లభిస్తుంది.