vNOTES | మహిళలకు మచ్చలేని శస్త్రచికిత్స అందుబాటులోకి వచ్చింది. ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు పొట్టపై కోతలు పెట్టి ఓపెన్ సర్జరీలు చేయడం ఆనవాయితీ. దీనివల్ల రోగి తీవ్రమైన నొప్పిని భరించాల్సి ఉంటుంది. నాలుగైదు రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది. డిశ్చార్జ్ తరువాత కూడా రెండుమూడు నెలల విశ్రాంతి తప్పనిసరి. సర్జరీ గాటు శాశ్వత మచ్చగా ఏర్పడుతుంది. ఇలాంటి సమస్యలను కొంతమేర అధిగమించేందుకు ల్యాపరోస్కోపి అందుబాటులోకి వచ్చింది. ఈ పద్ధతిలో చిన్నపాటి రంధ్రం చేసి శస్త్రచికిత్స జరుపుతారు. దీంతో, రంధ్రం చేసిన ప్రదేశంలో మచ్చ మాత్రం తప్పదు. ఈపాటి నొప్పి, మచ్చ కూడా లేకుండా శస్త్ర చికిత్స పూర్తిచేయడం ‘వీనోట్స్’తోనే సాధ్యం.
వజైనల్ నేచురల్ ఒరిఫైస్ ట్రాన్స్ల్యుమినల్ ఎండోస్కోపిక్ సర్జరీ ( Vaginal natural orifice tranluminal endoscopic surgery)నే సంక్షిప్తంగా ‘ వీనోట్స్ ( vNOTES )’ అంటారు. ఈ పద్ధతిలో రోగికి ఎలాంటి నొప్పి ఉండదు. అంతే కాకుండా శరీరంపై ఎక్కడా కోత లేకపోవడంతో మచ్చ ఏర్పడే ఆస్కారం ఉండదు. ఖర్చు ల్యాపరోస్కోపితో దాదాపుగా సమానం. రోగి రెండు మూడు గంటల్లోనే డిశ్చార్జ్ కావచ్చు. మరుసటి రోజు నుంచీ బరువైన శ్రమ మినహా అన్ని పనులూ చేసుకోవచ్చు.
గర్భసంచి, అండాశయం సమస్యలకు ఈ విధానం ద్వారా చికిత్స అందించవచ్చు. ఇంకా..
☞ ఫైబ్రాయిడ్స్ వల్ల అధిక రక్తస్రావం కావడం.
☛ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ(ట్యూబ్లలో గర్భం రావడం).
☞ ఓవరిన్ సిస్టులు (అండాశయ తిత్తులు) తొలగించేందుకు.
☛ గర్భాశయ సమస్యలు.
యోని వద్ద చిన్నపాటి గాటు పెట్టి ఎండోస్కోపి పరికరాన్ని గర్భాశయం లేదా అండాశయానికి పంపి శస్త్రచికిత్స చేస్తారు. ఈ విధానంలో అతి తక్కువ స్థాయి అనస్తీషియా ఇస్తారు. దీనివల్ల చిన్నపాటి కోతకు సంబంధించి కూడా నొప్పి అనిపించదు. ఈ విధానంలో ఎలాంటి చెడు ప్రభావాలూ ఉండవు కాబట్టి, పూర్తిగా సురక్షితం.
– డాక్టర్ జి.వింధ్య, ల్యాపరోస్కోపిక్ సర్జన్, సీనియర్ గైనకాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
థైరాయిడ్ సమస్య ఉంటే పిల్లలు పుట్టరా?
Fertility problems | సంతానలేమికి కారణం?
Pregnancy Tips | ఏ సమయంలో కలిస్తే పిల్లలు పుడతారు?
male pregnancy | ఇక మగవారికీ గర్భం.. పది పిల్లలకు జన్మనిచ్చిన మగ ఎలుక