Pink Tax | ‘అమ్మాయిగా బతకడం చాలా ఖరీదైన వ్యవహారం…’ అంటూ ఈ మధ్య ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్ తెగ వైరల్ అవుతున్నది. అవును నిజమే… అయ్య బాబోయ్… ‘పింక్ ట్యాక్స్’ అంటూ మరింతమంది అమ్మాయిలు దానికి సమాధానాలు ఇస్తున్నారు. ఆడపిల్లల కొనుగోలు శక్తిని దెబ్బతీస్తున్న పింక్ ట్యాక్స్ ఇప్పుడు హాట్ టాపిక్. ప్రపంచవ్యాప్తంగా చాలారోజుల నుంచి చర్చల్లో ఉంటున్న ఈ విషయం మరోసారి తెరమీదకి వచ్చింది. ‘అసలేమిటీ ట్యాక్సూ?!’ అంటూ అమ్మాయిలు నెట్ వీధుల్లో వాకబు చేస్తున్నారు. ఇది నిజంగా తెలుసుకోవలసిన విషయమే మరి!
లింగభేదాన్ని బట్టి ధరలు నిర్ణయించడాన్ని పింక్ ట్యాక్స్‌గా పిలుస్తున్నారు. ఒకే రకమైన ఉత్పత్తి, సేవలకు మగవాళ్ల కన్నా ఆడవాళ్లు ఎక్కువ ధర చెల్లించాల్సి రావడం అన్నది ఇక్కడి విషయం. ఇక, గులాబీ రంగును మహిళలను ప్రతిబింబించేందుకు వాడతాం అన్న సంగతి తెలిసిందే. అసలే వేతనాల్లో ఆడామగా మధ్య భేదం అన్నది ఒక పక్క ఆలోచించ దగ్గ అంశంగా ఉంటే… ఇక కొనుగోళ్లలో ఈ కోణం ఆందోళన కలిగిస్తున్నది.
2015లో న్యూయార్క్ నగరపు వినియోగదారుల వ్యవహారాలు చూసే సంస్థ… ఒకే రకం ఉత్పత్తులకు మగవాళ్ల కన్నా ఆడవాళ్లు సగటున 7 శాతం అధికంగా చెల్లిస్తున్నట్టు గుర్తించింది. ఫ్రమ్ క్రాడిల్ టు కేన్ (పుట్టడం నుంచి గిట్టడం దాకా) అనే పేరుతో ఓ అధ్యయనం జరిపింది. ఇందులో 794 ఉత్పత్తుల్లో ఈ తేడా ఉన్నట్టు గమనించింది. అది నివేదిక వెల్లడించిన తర్వాత దీనిమీద ప్రపంచవ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. సాధారణంగా ఉపయోగించేవే కాదు… వృద్ధాప్యంలో ఉన్న మహిళలకు అవసరమైన ఉత్పత్తులు కూడా 8 శాతం ధర ఎక్కువగా ఉన్నాయంటూ ఆ మధ్య వరల్డ్ ఎకనమిక్ ఫోరం లెక్కలు తేల్చింది.
ఇన్‌కం ట్యాక్స్, జీఎస్టీలలాగా ప్రభుత్వాలు వేసే ట్యాక్స్ కాదిది. స్త్రీ పురుషులిద్దరికీ ఉత్పత్తులు, సేవలు అందించే సంస్థలు… ఆడవాళ్ల ఉత్పత్తుల మీద మాత్రం అధిక ధరను నిర్ణయిస్తున్నాయి. సంస్థను బట్టి, ఉత్పత్తిని బట్టి, సేవలను బట్టి ఈ తేడా ఎంత అన్నది ఉంటున్నది. ఉదాహరణకు ఉత్పత్తుల విషయం తీసుకుంటే… ఒక కంపెనీ మగవాళ్లు వాడుకునేందుకు తయారుచేసే బేసిక్ మోడల్ రేజర్ ధర రూ.10 నుంచి ప్రారంభమవుతుంది. కానీ, అదే సంస్థ ఆడవాళ్ల కోసం చేసే రేజర్ ధరలు మాత్రం రూ.50 నుంచి మొదలవుతున్నాయి. దుస్తుల నుంచి చెప్పుల దాకా ప్రతిదాంట్లోనూ మనం ఈ తేడాను గమనించవచ్చు.
ముఖ్యంగా బ్రాండెడ్ దుస్తులు, యాక్సెసరీల విషయంలో ఇది మరీ స్పష్టంగా కనిపిస్తుంది. సెయింట్ లారెంట్, గూచి, డాల్చే అండ్ గబ్బానా, బాల్మెయిన్, వాలెంటినో… ఇలా పేరుమోసిన బ్రాండ్లన్నీ పింక్ ట్యాక్స్‌లు బాదుతున్నవే. ఈ విషయంలో బిజినెస్ ఆఫ్ ఫ్యాషన్.కామ్ అనే సంస్థ ఓ అధ్యయనం చేసింది. దాని ప్రకారం… వీటిలో ఓ సంస్థ ఈ విషయంలో మరింత ముందున్నట్టు తెలిపింది. ఈ బ్రాండ్‌కు సంబంధించి ఒక డిజైన్‌తో గీతలు ఉండే పురుషుల స్వెటర్ ధర రూ.78 వేల చిల్లర ఉంటే… అదే డిజైన్‌లో మహిళల స్వెటర్ ధర దాదాపు లక్ష రూపాయలు ఉంది.
పొట్టి చేతులుండే నలుపు రంగు సిల్కు చొక్కా ధర అబ్బాయిలకు రూ.41వేలకు అమ్మితే… అదే చొక్కా అమ్మాయిలకు మాత్రం రూ.50 వేలుగా ధర నిర్ణయించింది. ఇవి అనే కాదు… వివిధ సంస్థలు ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా తయారుచేస్తున్న షాంపూలు, ఫేస్‌క్రీమ్‌లు, బాడీవాష్‌లు… ఇలా అన్నిటిలోనూ ఇదే వివక్ష సుస్పష్టంగా కనిపిస్తున్నది. చెప్పులూ, బ్యాగుల్లాంటి యాక్సెసరీల విషయంలోనూ చాలా కంపెనీలది ఇదే ధోరణి.
ఇక సేవల విషయంలోనూ పింక్ ట్యాక్స్ మహిళల్ని భయపెడుతూనే ఉంది. సెలూన్ సంగతే తీసుకుందాం… మన దగ్గరనే కాదు… ప్రపంచవ్యాప్తంగా మహిళలు, పురుషుల హెయిర్‌కట్ ధరల్లో తేడా ఏకంగా 60 శాతం దాకా ఉంది. హెయిర్‌వాష్, ఫేషియల్, క్లీన్అప్.. ఇలా ప్రతిదాని ధరల్లోనూ విపరీతమైన వ్యత్యాసం ఉంటున్నది.
అమ్మాయిగా బతకడం చాలా ఖరీదైన విషయం. నెలసరి ఖర్చులకు నెలకు కనీసం 150 రూపాయలు అవుతున్నాయి. ఒక మంచి బ్రా ఖరీదు రూ. 400-500 మధ్య ఉంటున్నది. అదే ఏ జాగింగ్‌కో రన్నింగ్కో వెళ్లామంటే… సపోర్టివ్ బ్రాలు అవసరం అవుతాయి. ఎలా చూసినా అవి కూడా 800 నుంచి 1500 రూపాయల దాకా అవుతున్నాయి. మన దగ్గరనే కాదు… ప్రపంచ వ్యాప్తంగా ఒకే రకమైన ఉత్పత్తులకు మగవాళ్లకన్నా ఆడవాళ్లు 7 శాతం అధికంగా చెల్లిస్తున్నారు.
అదే ఉద్యోగ భద్రత కోసం కట్టే ఇన్కమ్ ప్రొటెక్షన్ పాలసీలు 50 శాతం దాకా ఎక్కువ ప్రీమియమ్‌లు ఉంటున్నాయి. రేజర్ల మీద 29 శాతం, బాడీవాష్‌ల మీద 16 శాతం… ఇలా వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, దుస్తులు… చాలావాటిలో పింక్ ట్యాక్స్ ఉంది. సగటున చెప్పాలంటే తమ అవసరాల కోసం ఆడపిల్లలు ఏడాదిలో వేల రూపాయలు అధికంగా చెల్లిస్తున్నారు… అంటూ రాసుకొచ్చింది. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పర్పుల్ రెడీ అనే ఐడీతో ఉన్న అమ్మాయి రాసిన ఈ పోస్టే ఇటీవల పింక్ ట్యాక్స్ మీద చర్చలకు దారి తీసింది.
పింక్ ట్యాక్స్ విషయంలో ఇలా ఎందుకు జరుగుతున్నది అన్నదానికి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే ఆడవాళ్ల అవసరాలూ, ఆసక్తుల్ని కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయని అర్థమవుతుంది. ఒక కొత్త ఉత్పత్తి కనిపించినా, ఆకర్షణీయమైన దుస్తులు, యాక్సెసరీలు కంటబడ్డా చాలామంది మహిళలు ఖరీదు లెక్కపెట్టకుండా కొంటారు… అని కంపెనీలు అనుకుంటున్నాయి. ఆ కారణంగానే ఒకే రకమైన ఉత్పత్తులకు మహిళల విషయంలో ఎక్కువ ధరలు నిర్ణయిస్తున్నాయి.
ఆడవాళ్లకు మాత్రమే ప్రత్యేకమైనవిగా కనిపించేలా ప్యాకింగ్‌లను రంగుల్లో ఆకట్టుకునేలా తీర్చుదిద్దుతున్నాయి. తద్వారా మహిళల నుంచి పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నాయి… అని కొందరు మార్కెట్ పండితులు విశ్లేషిస్తే… వాళ్ల కోసం తయారుచేసే ఉత్పత్తులను కొన్నిసార్లు దిగుమతి చేసుకోవాల్సి రావడం, చర్మానికి సున్నితంగా ఉండేందుకు ఎక్కువ ఖరీదైన పదార్థాలు వాడాల్సి రావడం కూడా కారణాలుగా మరి కొందరు చెబుతున్నారు.