పెరుగు, యోగర్ట్.. రెండూ ఒకటే అనుకుంటారు చాలామంది. రెండూ పాల నుంచి తయారు చేసేవే అయినా, వీటిమధ్య కొంచెం తేడా ఉంది. తోడేయడానికి ముందు పాలను బాగా మరిగిస్తాం. వాటిని 30 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు చల్లబడే వరకు అలా ఉంచేస్తాం. ఆ తర్వాత ఒక చెంచా పెరుగుతో తోడుపెడతాం. తోడులోని లాక్టో బాసిల్లస్ అనే లాక్టిక్ ఆమ్లం ఉన్న బ్యాక్టీరియా కారణంగా పాలలో బ్యాక్టీరియా వృద్ధిచెందుతుంది. అలా కొన్ని గంటల్లో పాలు కిణ్వనం చెంది పెరుగుగా మారతాయి. ఇక పెరుగులో ఉండే లాక్టో బ్యాక్టీరియా మన పేగుల్లోకి చేరుకొని ఆరోగ్యపరంగా మనకు ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. యోగర్ట్‌ను కూడా పెరుగులానే తయారుచేస్తారు. అయితే పాలను కిణ్వనం చేయడానికి మాత్రం లాక్టోబాసిల్లస్ బల్గారిస్, స్ట్రెప్టోకోకస్ థెర్మోఫైలస్ అనే రెండు బ్యాక్టీరియాలను చేరుస్తారు. దీంతో, యోగర్ట్‌లో బ్యాక్టీరియా నాణ్యత, పరిమాణం సరైన పాళ్లలో ఉంటుంది. ఈ రెండు బ్యాక్టీరియాలను శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో వృద్ధిచేస్తారు. ఇవి సజీవంగా పేగుల్లోకి చేరుకోవడంతో పాటు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.