ముఖ సౌందర్యం ఇనుమడించేందుకు రకరకాల మాస్క్‌లను వేసుకుంటూ ఉంటాం. అయితే అవికూడా కాలానుగుణంగానే ఉండాలంటుంది సౌందర్యశాస్త్రం. అప్పుడే మన చర్మం మిలమిలా మెరుస్తుంది. అయితే వాతావరణం చల్లగా ఉండి పొడి చర్మం ఉన్నప్పుడు తేమను పట్టి ఉంచే మాస్క్ వేసుకున్నట్టే, ఎండ వేడికి జిడ్డు కారుతున్నప్పుడు దాన్ని నియంత్రణలో ఉంచే మాస్క్నూ వేసుకోవాలి.
దాన్నే సెట్టింగ్ మాస్క్ అని పిలుస్తారు. సాధారణంగా వేసుకునే మాస్క్‌లతో పోలిస్తే ఇవి కాస్త మందంగా ఉంటాయి. జిడ్డును, చర్మం మీద పేరుకుపోయిన మలినాలను పోగొట్టడమే కాకుండా, ఎండ వల్ల వచ్చే వేడిమిని తగ్గించి, చర్మానికి కూలింగ్ ఎఫెక్ట్‌ను ఇస్తాయి. ఇవి మందపాటి పొరను ఏర్పరచి చర్మాన్ని బిగుతుగానూ చేస్తాయి.
సెట్టింగ్ మాస్క్ల్లో క్లే (మట్టి) మాస్క్‌లతో పాటు, పీల్ ఆఫ్, థిక్ షీట్ మాస్క్‌లు ఉంటాయి. మన చర్మ రకాన్ని బట్టి వీటిని ఎంచుకోవచ్చు. డ్రై స్కిన్ వారితో పోలిస్తే జిడ్డు, మిక్స్డ్ చర్మాలు ఉన్న వాళ్లకి ఇవి ఎక్కువ మేలుచేస్తాయి. అప్పుడప్పుడూ పొడి చర్మం రకం వాళ్లూ వాడినా తర్వాత మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి. కాబట్టి మీరూ మీ చర్మ రకాన్ని బట్టి సెట్టింగ్ మాస్క్‌ను సెట్ చేసుకోండి.