వర్షకాలం వచ్చిందంటే చాలు, జుట్టుకు అనేక ఇబ్బందులు. జిడ్డుబారిపోవడం, చుండ్రు, రాలిపోవడం.. తదితర సమస్యలు చుట్టుముడతాయి. వాతావరణం తేమగా ఉన్నప్పుడు, తలమీది చర్మంలో ‘సీబమ్’ అనే ఒక జిడ్డు పదార్థం అధికంగా ఉత్పత్తి అవుతుంది. దాన్ని ఆహారంగా తీసుకుని బ్యాక్టీరియా, ఫంగస్ పోటీపడి పెరుగుతాయి. వాటివల్లే చుండ్రు, పేలు అధికం అవుతాయి. ఈ సమస్య నుంచి బయటపడటానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తారు.
ముఖ్యంగా వానలో తల తడిసి పోకుండా చూసుకోవాలి. ఒకవేళ తడిసినా వెంటనే తలంటు పోసుకోవడమో, జుట్టును శుభ్రమైన నీటితో కడిగి ఆరబెట్టుకోవడమో చేయాలి. తక్కువ గాఢత కలిగిన షాంపూ, మంచి కండిషనర్ వినియోగించాలి. తల తరచూ జిడ్డుగా అవుతుంటే జెల్ బేస్డ్ షాంపూ వాడాలి. అదే చుండ్రు సమస్య ఉన్నవాళ్లు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ షాంపూలు వినియోగించాలి. తలస్నానం చేశాక జుట్టు పొడిగా అయ్యేలా చూసుకోవాలి. తడిజుట్టు మీద జడ వేసుకోకూడదు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇబ్బందులు వదలకపోతే, డెర్మటాలజిస్టును కలవాలి. సరైన చర్యలతోనే వానకాలం ఇబ్బందుల నుంచి జుట్టును రక్షించుకోగలం.