అందాన్ని కాపాడటంలో ‘కొలాజెన్’ కీలక పాత్ర పోషిస్తుంది. చర్మం ముడతలు పడొద్దన్నా.. ముఖం కాంతిమంతంగా ఉండాలన్నా.. శరీరంలో కావాల్సినంత కొలాజెన్ ఉండాల్సిందే! అయితే, 40 ఏళ్లు దాటితే శరీరంలో కొలాజెన్ ఉత్పత్తి తగ్గడం ప్రారంభమవుతుంది. దాంతో, అందంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అలా కాకుండా ఉండాలంటే.. ‘కొలాజెన్’ను కాపాడుకోవాలి. అందుకోసం.. ఈ సలహాలు, సూచనలు పాటించాలి.
ఆహారం: అధిక ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారం కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. కాబట్టి, గుడ్లు, సోయా, పప్పులు, గింజలు, ఆకుపచ్చ కూరగాయలను తీసుకోవాలి. బోన్ సూప్ తాగినా.. మంచి ఫలితం కనిపిస్తుంది.
మంచి నిద్ర: మానసిక ఒత్తిడి, నిద్రలేమి కూడా కొలాజెన్ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగాలాంటివి చేయాలి. ప్రతిరోజూ 7-8 గంటలు నిద్రపోవాలి.
విటమిన్ సి: కొలాజెన్ ఉత్పత్తిని పెంచడంలో ‘విటమిన్ సి’ సమర్థంగా పనిచేస్తుంది. కాబట్టి, 40 ఏళ్లు దాటినవాళ్లు.. రోజువారీ ఆహారంలో ఉసిరి, నారింజ, నిమ్మ, కివీ, బ్రకోలీని చేర్చుకోవాలి.
సన్‌స్క్రీన్ లోషన్: అసలే వేసవి కాలం. సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రా వయోలెట్ కిరణాలు కొలాజెన్‌ను విచ్ఛిన్నం చేస్తాయి. కాబట్టి, బయటికి వెళ్లినప్పుడే కాదు.. ఇంట్లో కూడా సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం అలవాటుగా చేసుకోండి.
ఫేస్ యోగా: ముఖంపై ముడతలు తగ్గేందుకు ఫేస్ యోగా, ఫేస్ మసాజ్ ప్రయత్నించండి. ఇవి ముఖంపై రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.
కొలాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి.