పెళ్లి.. ఇద్దరు వ్యక్తుల మధ్య కేవలం ఒక ఒప్పందం కాదు.. ఎన్నో ఎమోషన్స్ కలగలిపిన నూరేళ్ల బంధం. అయితే ఆఫీసు పని, పిల్లల బాధ్యతలు, ఇంట్లోని చికాకుల మధ్య భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అసలైన కమ్యూనికేషన్ క్రమంగా తగ్గిపోతున్నది. మాటలు కరువై.. మౌనం పెరిగి బంధాలు బీటలు వారుతున్నాయి. మరి ఈ సమస్యకు చెక్ పెట్టి, మళ్లీ ఆ పాత రోజుల్లోలా ఒకరికొకరు తోడుగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? జస్ట్ ‘వాక్ అండ్ టాక్’.
కాపురాన్ని కాపాడుకోవడానికి ‘వాక్ అండ్ టాక్’ ఓ అద్భుతమార్గమని నిపుణులు చెబుతున్నారు. వారానికి ఒకపూట ఫోన్లను పక్కన పెట్టేసి, జంటగా నడకకు వెళ్లాలి. ఈ నడకలో ఇద్దరికీ ఓ ఎజెండా ఉండాలి. ఆ వారంలో మీ భాగస్వామి చేసిన పనుల్లో మీకు నచ్చిన మూడు విషయాలను చెప్పాలి. అలాగే మిమ్మల్ని బాధించిన లేదా మీకు ప్రేమ అందలేదనిపించిన ఒకటి రెండు పనులను కూడా సున్నితంగా వివరించాలి. ఇలా వారానికి ఒకసారి గతాన్ని విశ్లేషించుకోవడం వల్ల మనసులోని భారం తగ్గుతుంది.
అంతేకాదు, చిన్న చిన్న మనస్పర్ధలు పెద్ద గొడవలుగా మారకముందే సద్దుమణిగిపోతాయి. ప్రేమను వ్యక్తపరచడం, లోటుపాట్లను నిజాయతీగా చెప్పుకోవడం వల్ల బంధం మరింత బలపడుతుందని సైకాలజిస్ట్‌లు కూడా చెబుతున్నారు. చిన్న చిన్న విషయాలకు మీ బంధం బలహీనపడకుండా ఈ సూత్రాన్ని పాటించమని సూచిస్తున్నారు.