అతివల అలంకరణలో ఎన్ని ఎక్కువ ఆభరణాలు ఉంటే అంత అందం. ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో వినూత్నమైన నగలను వేసుకుని మురిసిపోతుంటారు. ఈ ట్రెండ్‌ను గమనించిన డిజైనర్లు మగువల మనసు దోచేలా కొత్తకొత్త డిజైన్లు ఆవిష్కరిస్తున్నారు. అలా ట్రెండ్ ఫాలో అవుతూ మార్కెట్లోకి వచ్చిందే వింటేజ్ జువెలరీ.
ఆధునిక సొబగులు అద్దుకున్న వింటేజ్ నగలపై ఈ తరం మహిళలు మోజుపడుతున్నారు. సంప్రదాయ వేడుకలు, పండగల్లో చీరకట్టులో కనికట్టు చేసే సుందరీమణుల మెడల్లో ఇవి ఎంచక్కా ఒదిగిపోతున్నాయి. కాలం మారినా ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అని మురిపిస్తున్న వింటేజ్ జువెలరీ విశేషాలివి..
అమ్మమ్మ కాసుల పేరు, నానమ్మ కంటె, కడియాలు.. ఇలా పలురకాల నగలు వారసత్వంగా మనవరాళ్ల నగలపెట్టెలో అడుగునపడి ఉంటాయి. ఇవేకాదు.. గుండ్ల హారాలు, ఎనల గొలుసులు, ముంజేతి కడియాలు, జడ చుక్కలు.. ఇలా చాలా రకాల ఆభరణాలు తాతమ్మ తరంలో ష్యాషన్. కాలక్రమంలో కరిగిపోయిన ఈ నగలు మరోసారి పురుడు పోసుకుంటున్నాయి.
ముఖ్యంగా చంద్రహారాలు, సూర్యహారాలు, అష్టలక్ష్మి గొలుసులు, కమ్మలు-బుట్టాలు, వంకీలు, రవ్వల గాజులు, ఒడ్డాణాలు ఇలా ఆ పాతకాలం మెరుపులన్నీ ఈ తరానికి చేరువ అవుతున్నాయి. వీటికి యాంటిక్ జువెలరీగా పేరు పెట్టి అతివలు ప్రత్యేకంగా ఆదరిస్తున్నారు. ఎలిగెంట్ లుక్‌తో అలరిస్తున్న ఈ నగలు ధరిస్తే… పండుగ సందడి రెండింతలు కావడం ఖాయం.