కల్యాణాయుత పూర్ణచంద్రవదనాం ప్రాణేశ్వరానందినీం
పూర్ణాం పూర్ణతరాం పరేశమహిషీం పూర్ణామృతాస్వాదినీం
సంపూర్ణాం పరమోత్తమామృతకళాం విద్యావతీం భారతీం
శ్రీచక్రప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం॥
స్వప్రకాశ జ్యోతి స్వరూపంతో, పరమేశ్వరుడి అంకాన్ని ఆసనంగా చేసుకుని, సకల భువన బ్రహ్మాండాలకు ఆరాధ్యదేవతగా పూజలందుకునే అమ్మ అవతారం శ్రీరాజరాజేశ్వరీదేవి. మహాత్రిపురసుందరిగా ఈమె శ్రీచక్ర నివాసినియై ఉంటుంది. నిశ్చల చిత్తంతో తనను ఆరాధించిన వారికి ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులను వరంగా అనుగ్రహిస్తుంది. మాయా మోహితమైన మానవ మనోచైతన్యం ఈ తల్లి ఉపాసన ద్వారా ఉద్దీపితమవుతుంది. అపరాజితాదేవిగా కూడా ఈ తల్లి పూజలు అందుకుంటుంది. ఈమె యోగమూర్తి. పసుపు పచ్చని పూలతో అమ్మను పూజించాలి. లలితా సహస్రనామ పారాయణ చేయాలి. శ్రీచక్రార్చన, కుంకుమార్చన, సప్తశతీ పారాయణ, చండీహోమం చేసిన వారికి ఇష్టకామ్యాలను అనుగ్రహిస్తుంది. సువాసినీ పూజ చేసి, భక్ష్య, భోజ్యాలతో మహానివేదన, ప్రత్యేకంగా లడ్డూలు నివేదన చేయాలి.