తెలంగాణ పిండివంటల్లో సకినాలు ప్రత్యేకమైనవి. వేర్వేరు ప్రాంతాల్లో వీటిని వండుకున్నా.. ఇక్కడ చేసినంత రుచిగా మరెక్కడా కుదరవు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ పిండి వంటకం గురించి తెలియదన్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. బియ్యం పిండి, నువ్వులు, ఓమ, ఉప్పు వేసి తగిన మోతాదులో నీళ్లు కలిపి పిండిని తయారుచేస్తారు. పిండిని చేతుల్లోకి తీసుకొని అందంగా చుడతారు. సకినాలు చుట్టడం ఒక కళ. అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. సకినాలు చుట్టడం వచ్చిన వారికి చుట్టాలు, పక్కాలు తెగ మర్యాదలు చేస్తుంటారు. ‘సకినాలు చేస్తున్నాం వదినా! మీరు వస్తేనే అవుతుంది’ అంటూ సగౌరవంగా ఆహ్వానిస్తారు. సకినాల మూకుడు రోజు పిల్లల సంబురం అంతా ఇంతా కాదు. పిల్లలంతా గుమిగూడి పిండిముద్ద తీసుకొని, చిట్టి చేతులతో పాలకాయలు లేదా వేపకాయలుగా చేస్తారు. అందుకే ఇవాళ్టి బతుకమ్మను వేప (పాల)కాయల బతుకమ్మగా పిలుస్తారు. సకినాల బతుకమ్మగానూ ఆరాధిస్తారు. నూనెలో గోలించినా సకినాలకు చమురు ఎక్కువగా ఉండదు. బురబురలాడే ఈ పిండివంటకాన్ని కరకర నములుతూ ఆరగిస్తారు. ఇందులో వాడే నువ్వులు, ఓమ ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. సాయంత్రం బతుకమ్మ ఆడిన తర్వాత సకినాలను అందరూ పంచుకొని ఆ రోజుకు కమ్మని ముగింపునిస్తారు.