నెలలు మీదపడుతున్న కొద్దీ.. గర్భిణుల్లో రకరకాల సమస్యలు తలెత్తుతుంటాయి. కొన్ని అంత ప్రమాదకరం కాకపోయినా.. తీవ్రమైన చికాకు పుట్టిస్తాయి. అలాంటి సమస్యల్లో ఒకటి.. దురద. పొట్ట పెరిగిపోతుండటం వల్ల చర్మం సాగి.. దురద పుడుతుంది. దీంతో మహిళలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలా.. దురద రాకుండా చూసుకోవడం, వచ్చినా తగ్గించు కోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
గర్భధారణ సమయంలో ఎక్కువమంది వేడినీటి స్నానానికే మొగ్గుచూపుతారు. అయితే.. వేడినీటి వల్ల చర్మం పొడిబారుతుంది. ఫలితంగా దురద పెరుగుతుంది. కాబట్టి, చన్నీటి స్నానమే మేలు. చలికాలమైతే గోరువెచ్చని నీటితోనే స్నానం చేయండి.
వేసుకునే దుస్తులు వదులుగా, సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండి. సింథటిక్ దుస్తులు దురదకు కారణవుతాయి. కాబట్టి, కాటన్ దుస్తులకే ఓటేయండి.
పెర్ఫ్యూమ్స్ వాడటం చాలామందికి ఇష్టం. కానీ, వీటిల్లో ఉండే రసాయనాలు దురదను పుట్టిస్తాయి. కాబట్టి, ఈ సమయంలో పెర్ఫ్యూమ్స్, రసాయన సబ్బులు, లోషన్లు వాడటం తగ్గించండి. వీటికి బదులు శనగ పిండిని వాడితే.. సాధారణ దురద కూడా తగ్గుతుంది. శనగపిండిలోని యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మ సమస్యలను దూరం చేస్తాయి.
దురద మరీ ఎక్కువగా ఉంటే.. ఎసెన్షియల్ ఆయిల్స్‌ను ఆశ్రయించడం మంచిది. వీటిలో యాంటి ఇచ్చింగ్, యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఒక కప్పు కొబ్బరి నూనెలో 10 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ వేయండి. ఈ మిశ్రమాన్ని దురదగా ఉన్న ప్రాంతంలో రాసి.. కొద్దిగా మసాజ్ చేస్తే.. ఉపశమనం లభిస్తుంది.
చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో కలబంద ముందుంటుంది. ఇందులోని యాంటి ఇన్ఫ్లమేటరీ, కూలింగ్ లక్షణాలు.. గర్భిణులకు దురద నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కొంచెం కలబంద గుజ్జును తీసుకుని.. దురద ఉన్నచోట రాయండి. అరగంటపాటు ఉంచి, చల్లని నీళ్లతో కడిగితే.. దురద దూరమవుతుంది.
చివరగా.. గర్భధారణ సమయంలో పొట్టపై దురద రావడం సహజమే. కానీ, మరీ ఎక్కువగా ఉంటే మాత్రం వైద్యులను కలవడమే మంచిది.