ధనానికి అధిదేవత లక్ష్మీదేవి. సిరిసంపదలకు ప్రతీకగా నిలిచే అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు పూజలు చేస్తారు, నోములు నోస్తారు. శ్రీదేవి ప్రతిరూపాన్ని అంతటా ప్రతిష్ఠించి కొలుస్తారు. లక్ష్మీదేవి రూపం ఒదిగిన ఆభరణాలూ ధరిస్తారు. శ్రావణ మాసం విశేష పూజలు అందుకుని, వరాలు కురిపించే లక్ష్మీదేవి రూపంలో తళుకులీనుతున్నాయి..
వ్రతాల మాసం శ్రావణం. ఈ వ్రతాల మాసం వచ్చిందంటే చాలు అందంగా ముస్తాబై నిండుగా కనిపిస్తారు అతివలు. సంప్రదాయ దుస్తులపైకి కాంబినేషన్‌గా భారీ ఆభరణాలు అలంకరించుకుంటారు. సాక్షాత్తూ ఆ అమ్మవారి ప్రతిరూపాన్ని ఆభరణంగా ధరించి మురిసిపోతారు. అందుకే, సౌభాగ్య లక్ష్మి రూపాన్ని పొదిగిన ఆభరణాలకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతున్నది. ఉంగరాలు, వంకీలు, హారాలు, చోకర్లు, పెండెంట్లు, బ్రేస్లెట్లు, గాజులు, ఒడ్డాణాల్లోనూ లక్ష్మీకళ ఉట్టిపడుతున్నది.