గర్భాశయ ఫైబ్రాయిడ్లు.. మహిళల్లో సాధారణంగా కనిపించే సమస్య. గర్భాశయం చుట్టూ పెరిగే కండరాలు, కణితులు.. ఎక్కువగా పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంటాయి. అయితే, తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం.. ఈ ఫైబ్రాయిడ్లు గుండె ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాయట. ఫైబ్రాయిడ్స్ లేని మహిళలతో పోలిస్తే.. ఈ సమస్య ఉన్నవారిలో దీర్ఘకాలిక గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 80 శాతం కంటే ఎక్కువగా ఉన్నదట. అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కు చెందిన ‘జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్’లో ప్రచురితమైన అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. పరిశోధనలో భాగంగా.. ఫైబ్రాయిడ్లు నిర్ధారణ అయిన దాదాపు 4,50,000 మంది మహిళలు, ఫైబ్రాయిడ్లు లేని 22,50,000 మంది పైగా మహిళల ఆరోగ్య డేటాను సేకరించారు. వీరంతా 18 నుంచి 50 ఏండ్ల మధ్య వయసు ఉన్నవారే. అందులోనూ గర్భాశయ శస్త్రచికిత్స, మెనోపాజ్, హృదయ సంబంధ సమస్యలు లేనివారినే ఈ అధ్యయనానికి ఎంపిక చేశారు. దాదాపు పదేళ్లపాటు, మొదటిసారిగా గుండె సమస్య వచ్చేవరకూ వీరి ఆరోగ్య పరిస్థితిని ట్రాక్ చేస్తూ వచ్చారు. వివిధ హృదయ సంబంధ సమస్యలపైనా దృష్టిపెట్టారు.
ఈ సందర్భంగా ఫైబ్రాయిడ్లు ఉన్న స్త్రీలలో రోగనిర్ధారణ తర్వాత మొదటి ఏడాది నుంచి పదేళ్ల కాలంలో హృదయ సంబంధ సమస్యలు ఎక్కువగా కనిపించినట్లు అధ్యయనకారులు వెల్లడించారు. ఫైబ్రాయిడ్ బాధితులు మొదటి సంవత్సరం నుంచే గుండె సమస్యల ప్రమాదాన్ని ఎదుర్కొన్నారట. కాలక్రమేణా సమస్య మరింత పెరిగినట్లు గుర్తించారు. పదేళ్లలో గుండె జబ్బుల ప్రమాదం 5.4 శాతానికి చేరుకున్నట్లు వెల్లడించారు. శరీర బరువు, మధుమేహం, రక్తపోటు లాంటి సమస్యలను సర్దుబాటు చేసిన తర్వాత కూడా.. ఫైబ్రాయిడ్లు ఉన్న మహిళలకు పదేళ్లలో హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం 81% ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. అందులోనూ 40 ఏళ్లలోపు వారిలోనే అత్యధిక ప్రమాద పెరుగుదల కనిపించిందట. ఈ క్రమంలో ఫైబ్రాయిడ్ నిర్ధారణ సందర్భంలో మహిళల గుండె ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ చూపాలని వారు సూచిస్తున్నారు. హృదయ సంబంధ సమస్యలు రాకుండా జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.