భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ. అయితే, ఇటీవల విడుదల చేసిన ఓ నివేదిక మన రైల్వేలో పారిశుధ్యం, పరిశుభ్రత గురించి ఆందోళన కలిగించే విషయాలు బయటపెట్టింది. రోజూ లక్షలాది మంది సుదూర ప్రాంతాలకు రాకపోకలు సాగించడానికి రైళ్లను ఆశ్రయిస్తారు. అలాంటిది అపరిశుభ్రమైన బ్లాంకెట్లు ప్రయాణికుల ఆరోగ్యానికి ప్రమాదంగా మారడం విచారకరం.
సమాచార హక్కు చట్టం కింద చేసుకున్న ఓ దరఖాస్తుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానంలో ఈ ఆందోళనకరమైన విషయం వెల్లడైంది. ప్రయాణికులు వాడుకునే లైనెన్ బెడ్షీట్లు, పిల్లో కవర్స్‌ను మాత్రం ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తారు. కానీ, కప్పుకొనే ఉన్ని బ్లాంకెట్లను మాత్రం నెలకు ఒకటి రెండుసార్లు… అందుబాటులో ఉన్న సామర్థ్యం, ఏర్పాట్లను బట్టి శుభ్రపరుస్తామని రైల్వే శాఖ బదులిచ్చింది. అంతేకాదు రైల్వేలో పనిచేసే హౌస్‌కీపింగ్ సిబ్బంది బ్లాంకెట్లను మరకలు పడినప్పుడు లేదంటే దుర్వాసన వస్తున్నప్పుడు ఉతుకుతారని కూడా ఈ నివేదిక తెలిపింది.
సూక్ష్మక్రిముల వ్యాప్తి
అయితే, ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు ఈ బ్లాంకెట్లను ఉపయోగిస్తే ఆరోగ్యవంతులకు రోగకారక క్రిముల వ్యాప్తికి ఆస్కారం ఉంటుంది. అలర్జీ, ఇరిటేషన్ కలిగించే క్రిములు వీటిపై పేరుకుపోయే ముప్పు ఉంటుంది. దీంతో ముక్కు కారడం, ముక్కు పట్టేయడం, కండ్లలో దురద, చర్మంపై దద్దుర్లు లాంటి సమస్యలు తలెత్తవచ్చు. ఇక ఆస్తమా, శ్వాస సమస్యలు ఉన్నవారికి ఆ సమస్యలు మరింత ఇబ్బందిగా మారతాయి. అంతేకాదు అపరిశుభ్రమైన ఉన్ని బ్లాంకెట్లు బ్యాక్టీరియా, ఫంగస్‌కు ఆవాసాలుగా మారతాయి. వాటిని క్రమం తప్పకుండా ఉతక్కపోతే చెమట, శరీర తైలాలు, ఆహార కణాలు వాటిపై పేరుకుంటాయి. దీంతో సూక్ష్మక్రిముల పెరుగుదలకు తగినన్ని పోషకాలు అందుతాయి. బ్యాక్టీరియా పెరగడంతో
చర్మ ఇన్ఫెక్షన్లు, ఫంగస్‌తో శ్వాస ఇబ్బందులు సహా ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి
అపరిశుభ్రమైన బ్లాంకెట్లు మరింత ప్రమాదకరంగా పరిణమిస్తాయి. కాబట్టి వీలైతే సొంత దుప్పటి తీసుకెళ్లడం శ్రేయస్కరం. లేదంటే రైల్వే శాఖ ఇచ్చే లైనెన్ బ్లాంకెట్లు వాడుకోవడం మంచిదని కొంతమంది సలహా ఇస్తున్నారు.