యువతులను టైప్-2 డయాబెటిస్ వెంటాడుతున్నది. గతంతో పోలిస్తే.. చక్కెర వ్యాధి బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ‘డయాబెటిస్ యూకే’ ప్రచురించిన తాజా అధ్యయనం, ఈ విషయాన్ని బయటపెట్టింది. 2017 – 2024 మధ్య కాలంలో, 40 ఏళ్లలోపు మహిళల్లో టైప్-2 డయాబెటిస్ నిర్ధారణ అయిన వారి సంఖ్య 47 శాతం పెరిగిందని ఈ అధ్యయనం వెల్లడించింది. ఇక 40-79 ఏళ్ల మధ్య వయసు గల మహిళల్లో 22 శాతం, 40 ఏళ్లలోపు పురుషులలో 34 శాతం పెరిగినట్లు తేల్చింది. గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా టైప్-2 మధుమేహం కేసులలో తీవ్రమైన పెరుగుదల నమోదవుతున్నదని నిపుణులు చెబుతున్నారు. అయితే, వృద్ధులతో పోలిస్తే టైప్-2 మధుమేహం ఆడవాళ్లలో చాలా వేగంగా పెరుగుతున్నదని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గర్భధారణ సమయంలో వచ్చే ‘గెస్టేషనల్ డయాబెటిస్’ ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు.
గర్భిణుల్లో సాధారణంగా కనిపించే డయాబెటిస్.. ప్రసవానంతరం తగ్గిపోతుంది. కానీ, గెస్టేషనల్ డయాబెటిస్ వచ్చినవారిలో 11 శాతం మందికి ఐదేళ్లలోపే ప్రీడయాబెటిస్ వచ్చేస్తున్నదట. పదేళ్లలోపు 15 శాతం మందిని పూర్తిస్థాయి టైప్-2 మధుమేహం చుట్టుముడుతున్నదట. అంతేకాకుండా.. గెస్టేషనల్ డయాబెటిస్‌కు గురైన మహిళల్లో 57 శాతం మంది మాత్రమే వార్షిక హెచ్‌బీఏ1సీ పరీక్షలు చేయించుకుంటున్నారట. ఇలా వైద్య పరీక్షలకు దూరంగా ఉండటం కూడా ప్రమాదాన్ని పెంచుతున్నదని అధ్యయనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక సర్వేలో పాల్గొన్న మహిళల్లో 33 శాతం కన్నా ఎక్కువ మంది.. ప్రసవం తర్వాత ఆరోగ్య సంరక్షణ సేవలకు దూరమైనట్లు చెప్పుకొచ్చారు. టైప్-2 మధుమేహం కేవలం వృద్ధులకు మాత్రమే వస్తుందని భావించేవారు. కానీ, ఇప్పుడు 40 ఏళ్లలోపు వారిలోనే ఎక్కువగా కనిపిస్తున్నది. అంతేకాకుండా యువతలో టైప్-2 మధుమేహం మరింత తీవ్రంగా మారి.. గుండెపోటు, పక్షవాతం లాంటి ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే, గెస్టేషనల్ డయాబెటిస్‌ను ఒక మేల్కొలుపుగా భావించాలనీ, ప్రసవానంతర సంరక్షణలోని లోపాలను సరిదిద్దుకోవాలని సూచిస్తున్నారు. తద్వారా టైప్-2 డయాబెటిస్ రాకముందే.. దానిని నివారించడానికి అవసరమైన పరీక్షలు, జీవనశైలిని అలవాటు చేసుకోవాలని అంటున్నారు.