‘సవాళ్లు వద్దు. స్మార్ట్‌గా అయిపోవాలి’ అనుకుంటున్న జనరేషన్లో కంఫర్ట్ జాబ్‌ని, అమెరికాని వదులుకుని పుస్తకాలు ప్రచురించాలని హైదరాబాద్ వచ్చిందామె. గ్రామీణ, వ్యవసాయ కుటుంబ నేపథ్యమే అయినా విశ్వ సాహిత్యాన్ని, సామాజిక ప్రపంచాన్ని ఫాస్ట్‌గా చదివింది. పుట్టింది ఎలైట్ ఫ్యామిలీ కాదు. వారసత్వంగా వచ్చిన ఆస్తులు లేవు. గుండె ధైర్యం ఆమె ఆస్తి. అది ఎంత కీర్తిని తెచ్చిపెట్టిందో అజు పబ్లికేషన్స్ కో ఫౌండర్ శ్వేతలత ఎర్రం తన డైరీలోని కొన్ని పేజీలను జిందగీ పాఠకుల కోసం మళ్లీ గుర్తు చేసుకుందిలా..!
మాది వ్యవసాయ కుటుంబం. రోజూ ఇంటికి దినపత్రికలు వచ్చేవి. అప్పుడప్పుడు వారపత్రికలు వచ్చేవి. చిన్నప్పటి పుస్తకాలను ఇష్టంగా చదివేదాన్ని. నేను ఇంగ్లిష్ మీడియంలో చదివాను. అయినా తెలుగు చదవడం ఆపలేదు. చిత్తు కాగితం మీద అక్షరాలు కనిపించినా వదిలేదాన్ని కాదు. మామయ్య మా అమ్మ కోసం యద్దనపూడి సులోచనా రాణి, యండమూరి నవలలు తెచ్చేవాడు. మా అమ్మ ఏదైనా ఊరికి వెళ్లి వస్తుంటే.. పండ్లు కొనడం కన్నా, చందమామ, బుజ్జాయి పుస్తకాలు కొనుక్కొచ్చేది. మాకు సంతోషాన్నిచ్చేవి పుస్తకాలే. పదో తరగతి పూర్తయ్యాక సెలవుల్లో.. బోర్ కొడుతోందని అంటే మా అమ్మ పక్క ఊరి లైబ్రరీలో పుస్తకాలు తెమ్మని ఎవరినో పంపింది. ఏం పుస్తకాలు కావాలో అడగకపోయేసరికి లైబ్రేరియన్ నాలుగు పాత పుస్తకాలు పంపించాడు. వాటిలో అడవి బాపిరాజు రాసిన నారాయణరావు, మరోపుస్తకం చదివాను. అవి చదివినప్పుడు నాకూ రాయాలనే కోరిక కలిగింది. చిన్న చిన్న కథలు, కవితలు రాసి అమ్మకు చూపించేదాన్ని.
పెద్దయ్యాక డాక్టర్ కావాలని కోరిక, మెడిసిన్‌లో సీట్ రాకపోతే కెరీర్ కష్టమని మా వాళ్లు వద్దన్నారు. అందరిలాగే తొందరగా, తేలికగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఇంజినీరింగ్ చదువుల్లోకి మళ్లిపోయాను. ఐబీఎం ఇండియా (కోల్‌కతా)లో ఉద్యోగం చేశాను. మాస్టర్స్ చదవడానికి అమెరికా వెళ్లాను. ఎక్కడైనా నేను సంపాదించుకోగలనన్న ధైర్యం చదువు వల్లే కలిగింది. ఎవరిపైనా ఆధారపడకుండా బతకగలననే భరోసానిచ్చింది.
అమ్మానాన్నలే నా అదృష్టం ఆరేళ్ల క్రితం తెలుగు సాహిత్యానికి మళ్లీ దగ్గరయ్యాను. ఒక రచయిత పుస్తకాలను ప్రచురించేందుకు అజు పబ్లికేషన్స్ మొదలైంది. తర్వాత వేరే రచయితల పుస్తకాలను ప్రచురించడం మొదలైంది. నాలెడ్జ్ లేకుండానే ప్రచురణ రంగంలో అడుగుపెట్టాను. పనిచేస్తూ నేర్చుకుంటున్నాను. అమెరికాలో ఉంటూ ఇండియాలో పబ్లికేషన్ నడపడం చాలా కష్టంగా ఉండేది. ట్రావెల్ చేయాలని కోరిక కూడా ఉండేది. ఫుల్ టైమ్ జాబ్ చేస్తూ ట్రావెల్ చేయడం కష్టం. సెలవులు దొరకవు. పబ్లికేషన్ చూసుకుంటూ, ట్రావెల్ చేయాలనే ఆలోచనతో ఉద్యోగాన్ని, అమెరికాని వదిలేయాలనుకున్నాను. ఈ విషయం ఇంట్లో చెబితే మావాళ్లు వద్దనలేదు. ఏ సమస్య వచ్చినా ఎదుర్కోగలిగే ధైర్యం ఉందని వాళ్ల నమ్మకం. వారి మద్దతుతో అమెరికా వదిలి హైదరాబాద్‌కు వచ్చేశాను. పెద్దలు పిల్లలకు నేర్పాల్సింది ధైర్యం ఒక్కటే. వాళ్లు చదువుకున్నది కొంచెమే అయినా చిన్న ఊరిలో పెరిగినా కులం పట్టింపులు లేకుండా పెంచారు. మేం ఏం చేసినా సంతోషించేవాళ్లు. మీకు నచ్చినట్టుగా ఉండండి అన్నారు. ఇలాంటి తల్లిదండ్రులు ఉండటం నా అదృష్టం.
సేపియన్స్ స్టోరీస్ అనే కంపెనీని రిజిస్ట్రేషన్ చేయించాను. అజు పబ్లికేషన్స్ దానికి అనుబంధ సంస్థగా ఉంది. కొత్త రచయితలు, కొత్త రీడర్స్‌ని తీసుకురావాలని అజు పబ్లికేషన్స్ మొదలుపెట్టాం. ప్రముఖ రచయితల పుస్తకాలూ ముద్రిస్తున్నాం. వేరే భాషల్లోకి తెలుగు సాహిత్యాన్ని తీసుకుపోవడం మా అజు లక్ష్యం. మొదట ఇంగ్లిష్‌లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత భారతీయ భాషల్లోకి తీసుకెళ్తాను. ఇప్పుడు అంత శక్తి లేదు కాబట్టి సమకూర్చుకుంటున్నాను.

పాఠక విజయం! ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’ నవల ప్రచురణ సంస్థ విజయం కాదు. రచయిత రవి మంత్రి విజయమూ కాదు. ఇది పాఠకుల విజయం! దీనిని రెండున్నరేళ్ల క్రితం ప్రచురించాం. ఏడు నెలల్లో పదిహేను వందల కాపీలు అమ్మాం. ఒక రోజున హఠాత్తుగా వందల ఆర్డర్లు వచ్చాయి. రెండు రోజుల్లో మా దగ్గర ఉన్న ఏడు వందల కాపీలు అమ్ముడుపోయాయి. వెంటనే ప్రింటింగ్‌కి ఇచ్చి వేయి కాపీలు వేశాం. అవన్నీ ఒక్క రోజులోనే అయిపోయాయి. ఒకేసారి ఇన్ని పుస్తకాలు ఎందుకు అమ్ముడుపోతాయి? సాఫ్ట్‌వేర్‌లో బగ్ ఉండి పొరపాటుగా ఆర్డర్లు వస్తున్నాయేమోనని సందేహించాం. చూస్తే ఆన్లైన్లో ఆర్డర్లు, పేర్లు, అడ్రస్‌లు ఉన్నాయి. ఎక్కడో పొరపాటు జరుగుతున్నదని అనుకుంటూనే డెలివరీ చేస్తున్నాం. ఒక్క రోజులో పదిహేను వందలు, వేయి కాపీలు అమ్ముడుపోవడం ఆశ్చర్యమనిపించింది.
ఏ ప్రచురణకర్త ఎరుగని ఆర్డర్లు రావడం మొదలైంది. రీ ప్రింట్ వేస్తున్నప్పుడు ‘ఒకవేళ ఇవి అమ్ముడుపోకపోతే నష్టపోతాం’ అని భయపడ్డాం. కానీ, ఆ ఆర్డర్ల వెల్లువ ఆగలేదు. ఇంతమంది ఎందుకు కొంటున్నారని ఆలోచించాం. ఓ రెండు, మూడు వందల మంది ఫాలోవర్లు ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఈ పుస్తకం గురించి ఉంది. ఆ రీల్‌ని ఒక్క రాత్రిలోనే లక్ష మంది చూశారు. అది వైరల్ కావడంతో జనం కొనడం మొదలుపెట్టారు. ఇప్పటికీ కొంటూనే ఉన్నారు. ఈ పుస్తకం తెలుగు సాహిత్యానికి ఎంతోమంది కొత్త పాఠకులను తీసుకువచ్చింది.
పాఠకురాలిగా నేను ఒకే జోనర్ పుస్తకాలకు పరిమితమై ఉండను. పబ్లిషర్‌గానూ అంతే. పుస్తకాలు ప్రచురించాను. కానీ, పుస్తకం రాయాలన్న కోరిక మిగిలే ఉంది. ఏమి రాయాలో క్లారిటీ ఉంది. ఇప్పుడున్న పనుల వల్ల తాత్కాలికంగా వాయిదా వేశాను.
ఆర్డర్లకు ప్యాకింగ్ మేమే చేసేవాళ్లం. మా కో ఫౌండర్ ఏడాది క్రితం సంస్థ నుంచి తప్పుకొన్నారు. స్టూడెంట్స్ నలుగురు ఇంటర్న్‌షిప్ చేసేందుకు వచ్చేవాళ్లు. పనిలో వాళ్ల సహాయం ఉండేది. మాది చిన్న ఆర్గనైజేషన్. ఆన్లైన్ ఆర్డర్లతో మా పబ్లికేషన్ ఒక ఫ్యాక్టరీలా మారిపోయింది. కాలేజ్ పిల్లలకు పార్ట్‌టైమ్ జాబ్ ఇచ్చాం. కాలేజ్ అయిపోయాక ప్యాకింగ్‌కి వచ్చేవాళ్లు. ఇరవై నాలుగు గంటలూ ప్యాకింగ్ నడుస్తూ ఉండేది. ఒక రోజు ఒకే టైటిల్‌కి మూడున్నర వేలు ఆర్డర్లకు పార్సిల్ చేశాం.
పుస్తకాల బూచోళ్లు మా ప్రయాణం ఇలా సంతోషంగా సాగిపోతున్నప్పుడు పైరసీ భూతం షెర్లాక్ హోమ్లా ఎదురుపడింది. అమ్మ డైరీలో కొన్ని పేజీలు నవలను హైదరాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్‌లోని పైరసీ మాఫియా సొమ్ము చేసుకోవడం తెలిసింది. ఒక పాఠకుడు ‘హ్యాపీ టు సీ ద యువర్ బుక్ ఇన్ అవర్ లోకల్లైబ్రరీ’ అనే క్యాప్షన్‌తో అమెరికాలోని ఓ లైబ్రరీలోని ఓ ఫొటో పెట్టాడు. చూస్తే.. ఆ పుస్తకం హార్డ్ బౌండ్ చేసి ఉంది. మేం అలాంటి కాపీలు ప్రింట్ చేయలేదు. అక్కడి లైబ్రరీవాళ్లతో మాట్లాడితే ఇండియా నుంచి పంపించారని తెలిసింది. మా అనుమతి లేకుండా పైరసీ మాఫియా హార్డ్ బౌండ్ చేసి అధిక ధరకు అమ్ముకుంది. ఇలాంటి కేసులు రెగ్యులర్‌గా వస్తున్నాయి. కొందరు వాళ్ల పుస్తకాలు ఎవరూ కొనట్లేదని బాధపడుతున్నారు. వాళ్లు మీ పుస్తకాన్ని అమెరికా దాకా తీసుకుపోయారని సంతోషపడాల్సింది పోయి, ఎందుకు బాధపడుతున్నారని చాలామంది అన్నారు. అది పుస్తకం అమ్మడం రానివాళ్ల ఆనందమని, మా పుస్తకం తనని తాను అమ్ముకోగలదని, దాంట్లో మాకు సంతోషపడేదేమీ లేదని వాళ్లకు సమాధానం చెప్పాను.
పబ్లిషింగ్ మాఫియా కూడా ఉంది. పుస్తకాలు రీ ప్రింట్ చేసుకుంటూ రచయితలకు రాయల్టీ ఇవ్వరు. ఎక్కువ కాపీలు ముద్రించి తక్కువ కాపీలు లెక్క చెబుతారు. ‘అమ్మడైరీలో కొన్ని పేజీల’ను మా కంటే ఎక్కువ క్వాలిటీతో విజయవాడలోని ఓ పబ్లిషర్ ముద్రించారు. ఆ విషయం మాకు తెలిసి వాళ్లని ప్రశ్నిస్తే.. ‘ఎప్పటి నుంచో పుస్తకాలు ప్రచురిస్తున్నాం. నువ్వెవరు మాకు చెప్పడానికి?’ మమ్మల్నే దబాయించాడు. రచయితల మేధో సంపత్తిని వాడుకుంటూ వాళ్లకు పారితోషికం చెల్లించట్లేదు. లాభంలో కొంత వాళ్లకు ఇస్తే.. నష్టం ఏమిటి? రచయితలే లేకుంటే తెల్ల కాగితాలు అమ్మకుంటామా?