Sankranti | శ్రమైక జీవన సౌందర్యానికి, సామాజిక సమైక్య మాధుర్యానికి ప్రతీక సంక్రాంతి. సర్వజన హితాన్ని ఆకాంక్షిస్తూ, సమష్టి తత్వాన్ని ప్రతిబింబిస్తుంది ఈ పండుగ. తెలుగు లోగిళ్లను వెలుగు వాకిళ్లుగా మార్చే ముచ్చటైన, ముగ్ధమనోహరమైన మూడు పండుగల సమాహారంగా సంక్రాంతి సౌందర్యం వెల్లివిరుస్తుంది. ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతులు, వైజ్ఞానికపరమైన అంశాలు ఈ వేడుకలో దాగి ఉన్నాయి.
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించిన రోజే సంక్రాంతి. ‘వచ్చింది వచ్చింది పచ్చ సంక్రాంతి… వచ్చింది వచ్చింది లచ్చి సంక్రాంతి…’ అంటూ గ్రామీణులు అమితోత్సాహంతో ఈ పండుగ రోజుల్లో పాడుకుంటారు. బొమ్మల పండుగ, ముగ్గుల పండుగ, పంటల పండుగ, పశువుల పండుగ, పెద్దల పండుగ, పెద్ద పండుగ… ఇలా సంక్రాంతికి ఎన్నో పేర్లు. వీటన్నిటికన్నా సంక్రాంతి అనగానే మనకు గుర్తుకు వచ్చేవి ప్రతి ఇంటి ముంగిటా మెరిసిపోయే ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసుల భజనలు, గంగిరెద్దుల ఆటలు, భోగిమంటలు, అరిసెలు, బొమ్మల కొలువు.
ప్రకృతి మార్పులకు సంకేతం
సంక్రాంతి పుష్యమాసంలో వస్తుంది. వరుస ప్రకారం పుష్యమాసం సంవత్సరంలో పదో మాసం. ఈ నెలలో పూసగుచ్చడానికి కూడా పొద్దు ఉండదని నానుడి. చల్లచల్లని గాలులు మేనును స్పృశించడం, మంచుజల్లులు పుడమిని ముద్దాడటం… ఇవన్నీ పుష్య సోయగాలే. పుష్య అంటే పోషణ శక్తి కలదని అర్థం. పుష్య పూర్ణిమ నాటి రాత్రి సిద్ధాంతులు దూదిని మంచులో ముంచి ఆ మర్నాడు దాన్ని పిండి ఆ ప్రక్రియలో వచ్చిన నీటి చినుకుల్ని బట్టి వర్ష నిర్ణయం చేసేవారని చెబుతారు. ఎన్ని చుక్కలు జారిపడితే అన్ని కుంచాల వాన కురుస్తుందని అంచనా వేసేవారు. ప్రాచీన కాలంలో ప్రకృతి పరిశీలన ద్వారా మనిషి సాధించిన వైజ్ఞానిక ప్రగతికి ఇది ప్రతీకగా కనిపిస్తుంది.
సంక్రాంతి అంటే ‘చేరుట’ అని అర్థం కూడా ఉంది. సంక్రమణంలో భాగంగా పుష్య మాసంలో సూర్యుడు ధనూరాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ పర్వకాలమే సంక్రాంతి. ఇది మూడు రోజుల పర్వం. పంట చేతికి అందటం వల్ల రైతులు ఆనందోత్సాహాలతో గడిపే సమయం ఇది. తమకు పాడిపంటలనిచ్చిన పండుగగా రైతులు సంక్రాంతిని కృతజ్ఞతా పూర్వకంగా జరుపుకొంటారు. పంటను చేతికిచ్చిన భగవంతుడికి, పొలాల్ని దున్నే ఎద్దులకు ఈ పండుగ ద్వారా ధన్యవాదాలు తెలుపుతారు. భోగి, సంక్రాంతి, కనుమ పర్వాల్లోని అంతరార్థం ఇదే.
భోగిమంటల సందడి
సంక్రాంతికి ఒక రోజు ముందు భోగి పండుగతో సంబురాలు మొదలవుతాయి. భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం. పాడి పంటలు సమృద్ధిగా ఇళ్లకు వచ్చే సమయం కావటంతో రైతులు ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి, ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు. పాతకు స్వస్తి చెప్పి నూతనత్వానికి స్వాగతం పలుకుతూ భోగి మంటల్లో పనికిరాని దుస్తులు, వస్తువులను వేసి పీడలను, అరిష్టాలను తొలగించుకుంటారు. భోగి పండుగ రోజు ఉదయం పిల్లలకు స్నానాలు చేయించి కొత్తదుస్తులు వేసి వారిని తూర్పు వైపునకు కూర్చోబెట్టి రేగుపళ్లు, చిల్లర నాణేలను కలిపి వారి తలపై పోస్తారు. తర్వాత పిల్లలకు హారతి ఇస్తారు. ఇలా చేయడం ద్వారా వారిపై పడిన దిష్టి తొలగిపోతుందని భావిస్తారు. అంతేకాకుండా పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుంది. బాహ్య నేత్రాలకు కనిపించని బ్రహ్మరంధ్రం తలపై భాగంలో ఉంటుంది. భోగిపళ్లను తలపై పోయడం ద్వారా అవి బ్రహ్మ రంధ్రాన్ని ప్రేరేపిస్తాయి. తద్వారా పిల్లల బుద్ధి వికసిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
సంబురాల పండుగ
మకర సంక్రాంతి విశేష పర్వదినం. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఈ పుణ్యదినాన సూర్యునికి అర్ఘ్యాలు ఇవ్వడం, పూజలు చేయడం, దానధర్మాలు చేయడం పరిపాటి. కాల గమనం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తున్నందున శరీరానికి సమతౌల్యం అవసరం. ఇందుకోసం నువ్వులు కలిపిన చక్కెరను తినడం, బెల్లంతో కలగలిపి చేసిన నువ్వుల లడ్డూలను తినడం కనబడుతుంది. పండుగ రోజున నెయ్యిని, కంబళ్లనూ, బెల్లాన్నీ, దానం ఇవ్వడం, ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులను వేయడం సంప్రదాయంగా వస్తున్నది. సూర్యుడి రథాన్ని ముగ్గుగా వేసి, దానిపై పేడతో చేసిన గొబ్బెమ్మలను, నువ్వులు, బియ్యం, చెరుకుగడలను ఉంచడం ప్రతి ఇంటి వాకిటా కనబడుతుంది.
మకర సంక్రాంతి సూర్యుణ్ని ఉద్దేశించి చేసే మహా పర్వదినం. సూర్యుడు మానవ ప్రపంచానికి నేత్రం వంటివాడు. అతను లేకుంటే ప్రపంచానికి వెలుగు ఉండదు. సూర్యుడే మానవాళికి ఆరోగ్య ప్రదాత. సూర్యకాంతి వల్లే ప్రకృతి వికసిస్తుంది. సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది. మేఘాలు ఏర్పడతాయి. వర్షాలు కురుస్తాయి. పంటలు పండుతాయి. చెట్లు పెరుగుతాయి. మానవుల జఠరాగ్ని ఆరిపోకుండా ఉంటుంది. శరీర అవయవాలన్నీ చక్కగా పనిచేస్తాయి. ఈ విధంగా మకర సంక్రాంతి ఆరోగ్య కారకమైన పండుగగా కూడా విరాజిల్లుతున్నది.
ఆనందాల కనుము
సంక్రాంతి మరుసటి రోజు కనుము. ఇది రైతులకు ఎంతో ముఖ్యమైన పర్వదినం. వ్యవసాయమే ఆధారమైన మన దేశంలో ఈ కనుము నాడు వ్యవసాయ పరికరాలను చక్కగా అలంకరించడం, పశుసంపదకు పూజలు చేయడం, ఎడ్లబండ్లను రంగురంగుల కాగితాలతో అలంకరించడం, పూజించడం కనబడుతుంది. ఈ పర్వదినం రోజు వ్యవసాయదారులందరూ తమ ఇళ్లల్లో చక్కగా పూజలు నిర్వహించుకొని, ఎడ్లబండ్లపై గ్రామవీధులలో ఊరేగుతారు. ప్రధానకూడళ్లలో ఎడ్లబండ్లను ప్రదర్శనగా ఉంచడం పరిపాటి.
డా॥ కప్పగంతు రామకృష్ణ